నేలతల్లి ప్రేమ వేల మొక్కలకు జన్మనిస్తే
ప్రాణవాయువు పంచి
కోట్లజీవుల రక్షించే ఘన చరిత్ర వృక్షానిది
సకల జీవరాశికి పంచభూతాల మద్య
అపురూప ఆత్మీయబంధం
కాగితం-కలానిది ఏ అనుబంధమో!
కడుపున పుట్టి కాటికి చేరే దాకా
మనిషి మానుది పాలు నీళ్ళ స్నేహబంధం
వాహనమేదైనా కాలుష్య విషం కక్కుతూ
ఓజోన్ కవచం చిల్లులు పడేస్తే
గ్లోబల్ వార్మ్ ప్రతాపానికి
మానవ మనుగడ ప్రశ్నార్ధకం!
పర్యావరణం గొంతు నిండా విషరసాయనం నింపి
అర్థాంతర మరణ మృదంగం వాయిస్తూ
సెజ్ సైతాన్ వికృతరూపాలు
పచ్చనాకు సాక్షిగా పచ్చిదేహాన్ని సమాధి చేస్తే
ఆకుపచ్చని ఆత్మలు ఆకాశహార్మ్యాలై ఘోషిస్తున్నయ్
రక్షకుడు భక్షకుడైతే వృక్ష పరిరక్షణ పగటికల
పిడికిలంత గుండె స్పందన సామాజిక ఉద్యమమై
చెట్టంత ప్రాణికి ఆజ్యం పోయాలి
నీవు ప్రేమగా పెంచే వారసులు
రేపు రెక్కలొచ్చి ఎగిరిపోవచ్చు
విత్తునాటాలని పట్టుదల చాలు
మొక్కై,మానై,దేహానికో ఊపిరై
'ఆయుష్మాన్ భవంటూ దీవిస్తుంది.
(జూన్ 5, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి