జీవితమా....;- మంజుల సూర్య, హైదరాబాద్
అస్తమానం  పరుగులు పెట్టించే నీకు
తీరుబడిగా కూర్చుని నాతో కబుర్లు చెప్పి ఎన్నాళ్ళయింది
ఎప్పుడు ఏదో సాధించమంటూ
నన్ను సాధించుకు తినడమేనా

చిర్రుబుర్రులాడుతూ 
ఎండినట్లు ఏడ్చినట్లుంది కళ లేక నీ ముఖమంతా
కొట్టుకుపోయినట్లుంది సారమంతా
కొత్తమట్టిని కొత్తగా నింపనీ
తోటమాలి అవతారం ఎత్తనీ

చుట్టం చూపు కూడా లేని
చుట్టరికాలను చుట్టేసి 
పలకరింపుల  పందిరి కింద
ముచ్చట్లను మూటేసుకోనీ

చెలిమితో కాస్త చెడుగుడే  ఆడనీ
కళ్ళు చెమ్మగిల్లేట్టు ఫక్కున నవ్వనీ
పసితనంలోకి మళ్ళీ జారనీ

బావిలోకి జారిపోయిన బొక్కెనలా
అగాథంలోకి జారుతున్న ఆప్యాయతలను
తాడేసి పైకి లాగనీ

ప్రేమను ప్రేమగా గుండెలోకి ఒంపుకుని
మంత్రమేదో వేసినట్టు 
యంత్రమేదో కట్టినట్టు
చినుకు చిలకరింపుకు 
మట్టి పరిమళం గుప్పుమన్నట్టు
మహిమనేదో చూపనీ

సంతోషాన్ని సంచుల్లో నింపనీ
దిగులు గూడులో మొత్తంగా వంపనీ

బాధలకి బ్యాండేజి కట్టనీ
మరకే కనిపించని మరుపు మలామును రాయనీ

ధైర్యాన్ని కాస్త రోట్లో నూరుకోనీ
పచ్చడిలా తలోకాస్త పంచనీ

చిరుగులైన నమ్మకానికి దగ్గరవుతూ దారిలోకి తెచ్చుకుంటూ
దారంతో గట్టికుట్లే వెయ్యనీ

ఇంతచేసి
నిమిషమైన స్థిమితంగా నిన్ను చూడనీ
పలక మీద తప్పులన్నీ మరి చెయ్యనంటూ మారి మరీ దిద్దనీ

అందుకే ఓ  జీవితమా
కులాసాగా ఖుషీగా
తాగుదాం మాట్లాడుతూ గరంచాయ్ నే
వేసేద్దాం బిస్కెట్ నే రేపటి వేకువకి

ఆగి చూద్దాం....
అనుభూతుల్ని మిగుల్చుకుందాం
ఆగమన్నా ఆగని వర్తమానంలో అనుక్షణం జీవించి....ఏమంటావ్
....వస్తావ్ కదూ


కామెంట్‌లు