గొప్ప స్థపతి మా శివనాగి రెడ్డి (1)-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం.9492811322.
 మానవుడు విధిని నమ్మినా, నమ్మకపోయినా దాని పని అది చేసుకుంటూ పోతోంది.  ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతుంది.   మంచితనంగా ఉన్నవారిని మరీ మంచివాణ్ణి గానూ, చెడ్డ వారిని మరీ చెడ్డవానిగా చేస్తోంది. దీనిని కొంత మంది నమ్మొచ్చు, నమ్మక పోవచ్చు మనం సరిగా మనసు పెట్టి పని చేస్తే ఎందుకు సాధించలేము అనే కార్యదీక్ష  పట్టిన వాళ్ళు ఉండవచ్చు. వీరి మాటలకు నవ్వాలనిపిస్తుంది దీనిని విమర్శించే వాళ్ళూ ఉన్నారు, కొనియాడేవారు ఉండవచ్చు.  లోకో భిన్న రుచి అన్నది శాస్త్రం. పుర్రెకో బుద్ధి అని పెద్దలు చెప్పిన వాక్యం ఎవరు దేనిని నమ్మినా కాలం ఆగదు. ఎక్కడో కృష్ణా జిల్లా మారుమూల గ్రామం తేలప్రోలులో జన్మించి వ్యవసాయం చేసుకో వలచిన నన్ను మా గ్రామంలో ఏస్. ఏస్. ఏల్. సి చదవగానే  నాకిష్టమైన లయోలా కాలేజీలో చేర్చడం నాకు పెద్ద పని అయినా అలా కలిసి వచ్చింది అనుకుంటాను.
అక్కడి నుంచి ఎస్.ఆర్.ఆర్ కాలేజీకి రావడం నాటకాలలో గెలుచుకోవడం నా నాటకానికి నండూరి సుబ్బారావు గారు దర్శకునిగా రావడం నన్ను రేడియోకి ఎన్నిక చేయడం  బందా గారికి సన్నిహితుణ్ణి కావడం తేలప్రోలు నుంచి విజయవాడ, విజయవాడ నుంచి కడప, అక్కడ నుంచి విశాఖపట్నం, ఆ తరువాత ఢిల్లీ కేంద్రాలలో ఉద్యోగం చేయడం నిజంగా ఇది నా అదృష్టం. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరి ద్వారా  నేను ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వచ్చాను.  ఇంతవరకు వచ్చిన తరువాత  పని భారం ఎక్కువ కావడం వల్ల మరింత కష్టపడవలసి రావడం కూడా నా అదృష్టం అనుకున్నాను. అదృష్టం అనే శబ్దాన్ని కూడా నమ్మని వాళ్ళు ఉన్నారు. అది నాకు శ్రమ వల్లే సాధ్యం తప్ప మరెక్కటి లేదు. కనిపించని శక్తి మనకు సాయం చేయలేదు అన్న వాదనలు వినిపిస్తాయి. ఎక్కడో చిన్న పల్లెలో చినపరిమిలో  ఉన్న యోగానంద రెడ్డి  నా కార్యక్రమాలను వినడం, నా వద్దకు వచ్చి నేను కూడా రేడియోకు రావాలను కోరడం  దాని పద్ధతులు అన్నీ చెప్పి తనను కూడా రేడియోకు తీసుకురావడం నేను అనుకోని విషయమే కొన్ని నెలల తరువాత రెడ్డి వచ్చి అన్నగారు మీకు కావలసిన వ్యక్తి, కలవవలసిన వ్యక్తి నాకు కనిపించాడు. ఆయన వ్యక్తిత్వం నాకు నచ్చింది  మీరంటే మంచి అభిమానం  మీ కళ్ళతో చూడాలని నాకు ఉంది. మీరు ఎప్పుడు అవకాశం ఇస్తే అప్పుడు ఇద్దరం కలిసి వెళ్లి  వారిని పరిచయం చేసుకుందాం  అనుకుంటే ఏ రోజుకారోజు అలాగే జరిగిపోయింది కుదరలేదు. ఒకరోజు అనుకోకుండా రెడ్డి వచ్చి అన్నగారు ఇవాళ సాయంత్రం నాతో రండి  అని ఒక సాహిత్య కార్యక్రమానికి తీసుకు వెళ్ళాడు. అక్కడ వక్త మాట్లాడిన ప్రతి అక్షరం నా మనసునకు నచ్చడమే కాదు  మనసుకు పట్టింది కూడా. బయటికి వచ్చిన తర్వాత వారు ఎవరని అడిగితే  వారితోనే మీ పరిచయం అని చెబితే నేను ఆశ్చర్యపోయాను.  సరే తమ్ముడు రేపు ముహూర్తం వారిని కలుద్దాం  అది మన అదృష్టంగా భావిద్దాం అనుకున్నాం.

కామెంట్‌లు
Unknown చెప్పారు…
Very good feel happy