బాలకృష్ణులు;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 బంగారు బాల్యాన్ని మోస్తున్న 
భావి భారత పౌరులు వీరే....
చూశారా! ఈ నవ్వులను...
చందమామ చిన్నబోదూ...!
ఎంత అందంగా ఉన్నారో కదా అప్పుడే విరిసీ విరియని పూల మొగ్గల్లా...
ఎంత హాయిగా వున్నారో కదా
విను వీధుల్లో విహరించే పక్షుల్లా...
వీరి అందమైన అమాయకత్వాన్ని చూస్తుంటే,
కల్మషం ఎరుగని ఆ పసి మనసులను అనుభూతి చెందుతుంటే మరలా ఒకసారి తిరిగి బాల్యం తలుపు తట్టాలనిపిస్తుంది కదూ!
"ఆ బాలకృష్ణులకు..."
ఆటలు పాటలు తప్ప మరో ధ్యాస లేదు...
సరదాలు, సంతోషాలు తప్ప
రవ్వంత దిగులు కూడా లేదు...
వారిదైన ప్రపంచంలో వారికి ఏ పరిధులు ఉండవు....
అందమైన ప్రపంచం వారిది...
భయాన్ని నటించినట్లు నమ్మిస్తారు కానీ...
చిటపట చినుకులు మొదలవ్వగానే ఈ చిన్నారుల పాదాలు చిందులేస్తాయి...
ఆ పాల బుగ్గలలో
పసిడినవ్వులను పూయిస్తాయి...
కేరింతల ఆదమరపు ఆకలిని
తరిమేస్తుంటే...
అమ్మ అనురాగం గోరుముద్దల ప్రేమను పంచుతుంటే...
ముద్దు ముద్దు మాటలతో
పొద్దు తిరిగిపోతుంటే...
అమ్మ ఒడి లాలనలో పాల బువ్వనారగించి వెన్నెల కిరణాల దుప్పట్లో దూరి
నిదురోతారు ఈ యశోదా కృష్ణులు...



కామెంట్‌లు