సర్వజ్ఞుడు మా శ్రీనివాసుడు;-ఏ. బి ఆనంద్ఆకాశవాణి,విజయవాడ కేంద్రం.9492811322.

 శ్రీనివాస్ రెడ్డి గారిని చూసినప్పుడు, మాట్లాడినప్పుడు మా నాన్న లక్షణాలు చాలా కనిపించాయి.  ఇద్దరూ ఆ రోజుల్లోనే  కోటీశ్వర కుటుంబంలో పుట్టిన వాళ్లు. డబ్బులు మీద నడిచిన మనుషులు అలాంటివారికి  సమాజంలో  ప్రత్యేకమైన అభిప్రాయాలు ఉంటాయి  వాటిని సాధించడం కోసం ప్రయత్నం చేస్తారు.  మా నాన్నకు ఏ సంఘటన ఎదురు అయిందో తెలియదు కానీ  స్వామీజీలు అంటే పరమ అసహ్యం అందరూ దొంగ సాధువులు తప్ప వేదాంతం తెలిసిన వాడు ఎవడు లేడు అని నిశ్చితాభిప్రాయంతో ఉన్న వాడు. ఐదో తరగతి చదివిన మేధావి దొంగ స్వామీజీల గురించి అద్భుతమైన నాటకం  కలికాలం  వేదాంతం  అన్న మూడు గంటల నాటకాన్ని ప్రదర్శన యోగ్యంగా  రాశారు.  ఆ తర్వాత  ఇందుపల్లిలో  మలయాళ స్వామి ఉపన్యాసం ఉందని తెలిసి  మిత్రులతో వెళ్ళాడు  వారి దర్శనం కోసం అడిగితే  స్వామీజీ  ఏకాంత సేవ లో ఉన్నారు చూడడానికి వీలు లేదు అన్నారు ఏకాంతరా అది మేము అనుభవిస్తాం అన్న మాట స్వామీజీ చెవిన పడింది  ఆ సాయంత్రం నాన్న ఉపన్యాసం అయిన తరువాత  సాదు సుబ్బయ్య గారిని పంపించి నాన్నను  ఏర్పేడుకు తీసుకు వచ్చారు.   తనకు ఉన్న అజ్ఞానాన్ని మొత్తాన్ని  తీసివేశారు స్వామీజీ. అలాంటివాడు భగవద్గీతను అధ్యయనం చేసి  స్వామీజీ కృపవల్ల  "గీతా సిద్ధాంతం, గీతా సందేశం" అన్న గ్రంధాలను వ్రాశారు. అలాగే శ్రీనివాసరెడ్డి అదృష్టం బాగుంది  పూర్వజన్మ సుకృతం వల్ల  కేరళలో ఉన్న స్వామీజీ వారిని గుర్తించడం  వారి శిక్షణలో  పరిపూర్ణ మానవుడిగా  తీర్చిదిద్దబడి  అమ్మవారికి ఆత్మీయుడైనాడు. నా స్నేహితులు ఇద్దరు ముగ్గురు  వారి గురించి చెప్పడం  మా నాన్న రక్తం ప్రవహిస్తున్న నేను దానిని నమ్మకపోవడం,దొంగ సాధువు అని నమ్మి వారి దగ్గరికి ప్రయాణమై వెళ్లడం  వారు మేడపైన ఉండడం నేను కింద నా పత్రిక కూడా ఏదో వ్యాసం రాసుకోవడం జరిగిపోయింది.  మూడు గంటల తర్వాత మేడ దిగి వచ్చి నన్ను చూసి  క్షమించాలి  నా శిష్యుడు అనుకొని  పైకి వస్తాడులే అని  మిమ్మల్ని నిర్లక్ష్యం చేశాను  అని చిరునవ్వుతో మాట్లాడారు. నేను ఊహించిన వ్యక్తికి వీరికి సంబంధమే లేవు. సానుకూల దృక్పథం ఏర్పడింది  దాదాపు ఒక అర గంట  కాలక్షేపం చేస్తున్న సమయంలో వారి శ్రీమతి లక్ష్మి వచ్చి  పండ్లు  పాలు తీసుకొచ్చి  భోజనానికి కూడా ఉండమంది  వారి ఆతిథ్యానికి  వారి సంస్కారానికి  మురిసిపోయాను. తరువాత వారితో ఎంతో సన్నిహితంగా సంబంధం ఏర్పడింది అంటే  వారి గ్రామంలో తప్ప పై గ్రామాలకు వెళ్ళవలసి వస్తే నేను లేకుండా వెళ్లడం లేదు. నేను లేకుండా ఏ కార్యక్రమం కూడా జరగలేదు. దాని వల్ల నాకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి  మనసులో నాటుకు పోయిన దొంగ స్వామీజీల తత్త్వం నన్ను వెంటాడుతూనే ఉంది  వీరిలో ఎప్పుడైనా  ఆ దొంగ మనస్తత్వం బయటపడుతుందేమో నని  ఎదురుచూస్తున్నాను కానీ ఈ క్షణం వరకు  ఆ ఛాయలే కనిపించలేదు. వారి బంధువర్గం వున్న ప్రతి గ్రామానికి  నేను లేకుండా ఆయన ఒంటరిగా ఎప్పుడూ వెళ్ళలేదు  దానితో  వారి  గతించిన జీవిత  క్షణాలన్నీ నాకు తెలిసినాయి. వారి శ్రీమతి లక్ష్మి  నన్ను మామయ్య అంటూ  నా శ్రీమతి అరుణను అత్తయ్యా అంటూ మా ఇంటికి అమ్మాయిలానే ప్రవర్తిస్తోంది  పిల్లలిద్దరూ  నన్ను తాతయ్య అంటూ ప్రేమగా పిలుస్తునే  వుంటారు. ఏ మనిషికైనా  మనసులో ఒక అభిప్రాయం ఏర్పడిటే  దాని ప్రభావం నుంచి బయటపడటం చాలా కష్టం అని  నా అనుభవం నాకు నేర్పిండి.  దీని వల్ల నేను నేర్చుకున్నది ఎవరినీ తక్కువగా అంచనా వేయకూడదు ఎవరి ప్రజ్ఞాపాటవాలు వారికి ఉంటాయి. దానిని సద్వినియోగం చేసుకోవడం కానీ దుర్వినియోగం చేసుకోవడం కానీ  అది వారి ఇష్టాఇష్టాలను  అనుసరించి ఉంటుంది అని. నిజానికి మా అబ్బాయి గురించి రాయాలంటే  వ్యాసులవారు రచించిన భారతమంత కథ  దానికి అంతం ఉండదు  అయినా నా ప్రయత్నం వదలను.



కామెంట్‌లు