ప్రజలబాగు కోసమే ;- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
జలజల జలజల వానలుకురిసిన 
గజగజ గజగజ చలి వణికించిన 
భగభగ భగభగ ఎండలు మండిన 
జనులందరికీ కడుపునింపగా 
ప్రకృతితోనే మమేకమయ్యి
కృషీవలుడినై శ్రమనే చేస్తా ! 

వెన్నముద్దకు సుద్దులు చెప్పి 
పాటలు నేర్పి ఆటలు నేర్పి 
పాఠాల్ చెప్పి నడవడికను నేర్పి 
మనిషిగ మలిచే గురువును నేను ! 

లారీ అయినా క్వారీ అయినా 
మట్టిలొ అయినా ఇసుకలొ అయినా 
కర్మాగారం ఏదయినాసరె
నిరంతరం నే పరిశ్రమించే శ్రామికుడనేగా !

దేహముకొచ్చిన కష్టమేదైనా
మాటలతోనీ మందులతోనీ
అవసరమైతే శస్త్రాలతోనీ 
చికిత్స చేసి అనారోగ్యమును పోగొట్టి
"వైద్యో నారాయణో హరిః"
అని నేను అనిపించుకుంటా !

ఇల్లేదైనా మేడేదైనా 
వెళ్ళేందుకు ఏదారేదైనా 
నదులు వాగుల వంతెనలైనా
నీటిని దిగువకు డ్యామేదయినా
భూమిపైని ఏ కట్టడమైనా
ఆలోచించి పథకం వేసి 
నిర్మించేసే ఇంజనీరుని నేనేగా !

ఎండావానా చలి ఏదయినా 
కొండా కోనా సముద్రమయినా 
మాతృభూమిని కబళింపజూసే
శత్రుమూకను దునుమాడేసే
వీరసైనికుడను నేనేగా!

ఎవరు ఏపనిచేసినా 
ఎవరు ఎంత కష్టపడినా 
రకరకాల వృత్తులన్నీ
ప్రజల బాగు కోసమేగా !!


కామెంట్‌లు