నేను స్వేచ్ఛను ++++ వారాల ఆనంద్
స్వేచ్చా నేనూ వేర్వేరు కాదు 
ఒకరిని  పిలిస్తే ఇద్దరం పలుకుతాం 
నేనూ నా ఊపిరి చలనశీలులం 
నిరంతర ఉచ్వాస  నిశ్వాసలం 
 
నా  నివాసం ‘స్వాతంత్రం’
బ్యాంకు లాకర్ కాదది 
రక్త మాంసాలతో నిర్మించుకున్న ఇల్లు  

75 ఏళ్ల నాటి ఈ గూడులో
ఎవరి నమ్మకం వాళ్ళది 
ఎవరి ప్రేమలు వాళ్ళవి 
ఎవరి భోజనం వాళ్ళది 
అమ్మా, అమ్మీజాన్, అక్కా, బావా 
దాదా దాదీ, బేటా బేటీ అంతా బాగున్నారు 
సబ్ ఠీక్ హై 

అప్పుడప్పుడు ఇంటి కప్పుకు 
కన్నాలు పడతాయి 
ఎప్పటి కప్పుడు పూడ్చేస్తాం 
పెంకుల్నీ సర్దిస్తాం 

కానీ 
ఇంట్లోకి పందికొక్కులు దూరి నప్పుడే 
కలవర పడతాం 

అయినా పునాదులు గట్టివి 

నా ఇంటికి దోఖాలేదు 
వెయ్యేళ్ళయినా 
ప్రేమ నిలుస్తుంది 
స్నేహామృతం కురుస్తూనే వుంటుంది

కామెంట్‌లు