భక్తిశ్రద్ధలు; -: సి.హెచ్.ప్రతాప్
 వెంకటాపురం లో శివయ్య అనే ఒక పేద బ్రాహ్మణుడు వున్నాడు.తాతలనాటి ఒక పాడుబడిన ఇల్లు కొంచెం ఖాళీ స్థలం తప్ప అతనికి ఇంకేమీ ఆస్తిపాస్తులు లేవు. అబ్బిన కొద్దిపాటి విద్యతో పౌరోహిత్యం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య ఖాళీ స్థలంలో కూరగాయలు పండిస్తూ , దానిపై వచ్చిన ఆదాయంతో కుటుంబ పోషణకు వేణీళ్ళకు చన్నీళ్ళలా  సహకరిస్తోంది.
అయితే రాను రాను వయసు పైబడటం, కుటుంబ ఖర్చులు ఎక్కువవడం,ఆదాయం తక్కువవడoతో కుటుంబ పోషణ కష్టతరంగా మారింది.
ముందు ముందు జీవితం ఎలా సాగుతుందా అని భార్యాభర్తలిద్దరూ నిరంతరం మధన పడుతూ వుండేవారు.
ఇంతలో ఒక రోజు ఆ గ్రామానికి ఒక సాధువు వచ్చారు. ప్రజలందరు అతనిని దర్శించుకుని తమ తమ సమస్యలను విన్నవించుకొని తగిన పరిష్కారాలను పొందుతున్నారు. ఆయన మహిమలను విని శివయ్య కూడా ఆయనను దర్శించుకుని తమ సమస్యలు తీరే ఉపాయం చెప్పమని అర్ధించాడు.
అందుకు ఆ సాధువు కాసేపు కళ్ళుమూసుకుని ధ్యానించి అటు పిమ్మట " ఈ ఊరికి రెండు వందల యోజనాల దూరంలో వున్న భైరవ పురం లో వున్న ఒక అయిదు వందల సంవత్సరాల వయస్సు గల ఒక అశ్వద్ధ వృక్షాన్ని దర్శించి, 108 ప్రదక్షిణలు చేసి , భక్తితో పూజించి నైవేద్యం సమర్పించి, నీ సమస్యలు విన్నవించుకుంటే ఒక మండలం రోజులలో నీ కష్టాలన్నీ తీరుతాయి" అని చెప్పారు.
ఆ మాటలు విన్నాక శివయ్యలో కొండంత ఆశ జనించింది. వెంటనే పూజ సామాగ్రి మూటగట్టుకొని కాలినడకన భైరవ పురానికి బయలుదేరాడు.
పది రోజుల ప్రయాణం తర్వాత శివయ్య భైరవ నగరానికి చేరుకున్నాడు. ఆ ఊరి పొలిమేరల్లో వున్న అశ్వద్ధ వృక్షం వద్ద వేల సంఖ్యలో భక్తులు వరుసక్రమం లో నిలిచి వున్నారు.
ఒక్కొక్కరి వంతు వచ్చినప్పుడు ఆడంబరంగా, అట్టహాసంగా ఆ వృక్షానికి పూజలు చేసి నైవేద్యం, ఇతర కానుకలు సమర్పించుకొని తమ సమస్యలు ప్రార్థన రూపంలో విన్నవించుకుం టున్నారు.

అక్కడ వున్న వారిలో శివయ్య ఒక్కడే కడు పేదవాడిలా వున్నాడు. ఇతరులు చేసిన అట్టహాసమైన పూజల ముందు తన క్రతువు చాలా అధమంగా అనిపించింది అతనికి. అన్ని ఆడంబరమైన పూజలకే దేవుడు ముందుగా స్పందిస్తాడు కాబట్టి అసలు తన పూజలు స్వీకరిస్తాడా అన్న సంశయం అతనిని వెంటాడసాగింది.  సరే ఎలాగూ ఇంత దూరం వచ్చాడు కాబట్టి ఆ పూజ పూర్తి చేసుకుని వెళ్దాం. ఆపైన భగవంతుడి దయ అని అనుకున్నాడు శివయ్య.తాను తెచ్చిన సామాగ్రితో పూజ చెసి, ఒక రొట్టె ముక్కను నైవేద్యం పెట్టి  భక్తి శ్రద్దలతో ప్రార్ధన చేసి,  తన సమస్యలు చెప్పుకొని పాల ముంచినా, నీట ముంచినా నీదే భారం దేవా అనుకొని ఒక నమస్కారం చేసుకొని ,అనంతరం దూరంగా ఒక చెట్టు కింద విశ్రమించాడు.  

ప్రయాణ బడలిక వలన అతనికి గాఢంగా నిద్ర పట్టింది. నిద్రలో అతనికి ఒక అద్భుతమైన కల వచ్చింది.
శంకర భగవానుడు శివయ్య ఎదురుగా కూర్చోని శివయ్య పెట్టిన రొట్టె ముక్క ఎంతో ప్రీతిగా తింటుంటే, శివయ్య ఆయనకు పై పంచ తో విసురుతూ తన్మయత్వంతో కన్నార్పకుండా చూస్తున్నాడు.
తినడం పూర్తయ్యాకు శంకరుడు తృప్తిగా త్రేంచి నువ్వు పెట్టిన ఈ విలువైన నైవేద్యం నాకెంతో తృప్తిగా, రుచికరంగా అనిపించింది శివయ్య" అని అన్నారు.
" స్వామీ, ఈ పేదవాడు పెట్టిన రుచి పచి లేని రొట్టె ముక్క మీకు నచ్చిందా స్వామీ? " ఆశ్చర్యంతో అడిగాడు శివయ్య.
" నేను నాకు పెట్టే నైవేద్యాలు ఎంత ప్రేమతో, భక్తితో పెట్టారన్నది మాత్రమే చూస్తాను గాని వారి ఆర్ధిక స్థితిగతులతో నాకేమాత్రం పనిలేదు.  భక్తితో సమర్పించే ఫలం, పుష్పం, ఆఖరుకు మంచినీళ్ళయినా నాకెంతో ప్రీతి కలిగిస్తాయి.నువ్వు పెట్టిన నైవేద్యంలో అపారమైన భక్తి శ్రద్ధలు వున్నాయి కాబట్టి అది నాకెంతో ప్రీతికరమయ్యింది. నీ కష్టాలన్నీ తీరుతాయి. ఆనందంగా నీ కుటుంబంతో నిండు నూరేళ్లు వర్ధిల్లు" అని దీవించి శంకరుడు అంతర్ధాన మయ్యారు.
కల చెదిరి, శివయ్య నిద్ర లేచాడు. కలలో ప్రతీ అంశాన్ని గుర్తుకు తెచ్చుకొని ఎంతో ఆనందించారు. ఆధ్యాత్మిక జీవితంలో స్వచ్చమైన మనస్సు, భక్తిశ్రద్ధలు, చిత్తశుద్ధి,నిష్కల్మష ప్రేమ ఉండడం ఎంత అవసరమో అర్ధమై అతని కళ్ళు ధారాపాతంగా వర్షించాయి.

కామెంట్‌లు