దేవుడ్ని చూడలేడు!!;-- యామిజాల జగదీశ్
 ఒక యువకుడికి దేవుడిని నేరుగా చూడాలనే ఆశ కలిగింది.
అతనొక వేదపాఠశాలకు వెళ్ళాడు. అక్కడున్న ఓ పండితుడిని కలిసి నమస్కరించి తన మనస్సులోని మాటను చెప్పాడు. 
ఆయన యువకుడికి వేదం నేర్పడంతోపాటు పలు పుస్తకాలు చదివించారు. యువకు డెన్నో విషయాలు తెలుసుకున్నాడు.
కానీ భగవంతుడిని చూడలేకపోయాడు. దాంతో అతను తీవ్ర నిరాశ చెందాడు. అంతేకాకుండా ఆ పండితుడి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. 
"ఎంతో నేర్చుకున్నాను. కానీ నాకు దేవుడి దర్శనం లభించలేదు కదా" అని బాధపడ్డాడు. ఆందోళన చెందాడు. 
కొంతకాలం ప్రశాంతంగా ఉన్నాడు. 
కొన్ని రోజుల తర్వాత ఓ మహాత్ముడిని కలిసి తన మనసులోని మాటను చెప్పాడు.
తాను మేధావిగా ఉన్నప్పటికీ దేవుడు తనను పట్టించుకోలేదని అహంకారపూరిత ధోరణిలో ఏవేవో మాటలన్నాడు.
అతనిలోని అహంభావాన్ని గ్రహించిన ఆ మహాత్ముడు "కుమారా! ఒక నిముషం నేను చెప్పేది విను. నువ్వెన్నో నేర్చుకున్నట్టు, అనేక అనుభవాలు పొందినట్టు చెప్తున్నావు. వాటన్నింటినీ పరీక్షించే సమయం నాకు లేదు. కనుక నీకేం తెలుసో వాటన్నింటిని రాసి తీసుకురా. నేను తీరికవేళల్లో వాటిని చదువుతాను. నీకు భగవంతుడిని చూసే భాగ్యం ఉందా లేదా అనేది చెప్తాను" అన్నారు.
యువకుడు ఇంటికి వెళ్ళాడు. తను చదువుకున్నదంతా రాయడం ఆరంభించాడు. రెండేళ్ళయ్యింది. రాసిన ఓ వంద కాగితాలను తీసుకుని మహాత్ముడి వద్దకు వెళ్ళాడు.
మహాత్ముడు "పుత్రా! నాకిన్ని పేజీలు చదివే సమయం లేదు. వీటిలో అనవసరమైనవి మినహాయించి క్లుప్తంగా కొన్ని పేజీలలో నువ్వు చదువుకున్న సారాంశాన్ని మాత్రం రాసి తీసుకురా" అన్నారు.
యువకుడు సరేనని ఇంటికి వెళ్ళాడు. కొన్ని నెలలపాటు ప్రయత్నించాడు. మహాత్ముడు చేసిన సూచనను దృష్టిలో పెట్టుకుని కొన్ని పేజీలు రాసుకుని మహాత్ముడి దగ్గరకు వెళ్ళాడు.
అప్పుడు మహాత్ముడు అతనితో "అరెరే. ఇప్పుడు నాకు కంటిచూపు పూర్వంలా లేదు. నువ్వు మరింత క్లుప్తంగా రాసి తీసుకురా" అన్నారు.
అందుకు యువకుడేమీ విసుక్కోలేదు. మహాత్ముడు చెప్పినట్టే మరింత క్లుప్తంగా రాసి ఆయన వద్దకు బయలుదేరాడు.
అప్పటికీ మహాత్ముడు దానిని చదవలేదు.
"నువ్వు చదువుకున్నదంతా ఒక్క పేజీలో రాసి తీసుకురావడం ఆనందంగా ఉంది. ఇరవై వాక్యాలు రాసానన్నావు. ఆనందమే. కానీ దీనిని మరింత కుదించి అయిదు వాక్యాలలో రాసి తీసుకురా. అలా రాయడం నీకేమీ పెద్ద కష్టమైన పని కాదు" అని పంపించేశారు యువకుడిని.
అయితే యువకుడికి అయిదు వాక్యాలలో ఏం ఎలా రాయాలో తెలీలేదు.  కనుక వొట్టి తెల్ల కాగితంతో మహాత్ముడి వద్దకు వచ్చాడు.
మహాత్ముడు అది చూసి చిర్నవ్వు నవ్వారు.
"పుత్రా! నువ్వడిగిన ప్రశ్నకు జవాబు నువ్వే ఇప్పుడు అర్థం చేసుకో. నువ్వు నేర్చుకున్నానని చెప్పుకున్నదంతా ఈ తెల్లకాగితంలాంటిదే. వొట్టి చదువు మాత్రమే భగవంతుడిని చూడటానికి దోహదపడదు. అతనిని చూడాలనుకుంటే ముందుగా నువ్వు అతని పట్ల భక్తిని పెంచుకో. అది మానేసి నేనంత చదివాను .....నేనింత చదివాను ....నాకన్నీ తెలుసు....అని చెప్పుకోవడంవల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదు. అలా చెప్పుకోవడంవల్ల గర్వం వస్తుంది. గర్వమున్న మనసు దేవుడ్ని చూడలేదు" అన్నారు.

కామెంట్‌లు