విలువలు;--: సి.హెచ్.ప్రతాప్
మహేష్ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. చదువులో మంచి తెలివితేటలు ప్రదర్శిస్తాడు. ఆటపాటలలో కూడా బాగా చురుగ్గా వుంటాడు.
ఇంకొక రెండు నెలల్లో ఫైనల్ పరీక్షలు ఉండడం వలన మహేష్ తల్లిదండ్రులు అతడిని అనవసర తిరుగుళ్ళు తిరగకుండా స్కూలు అయిన వెంటనే ఇంటికి వచ్చి చదువుకునేలా చేస్తున్నారు. ఈ సంవత్సరం ఎలాగైనా క్లాసు ఫస్ట్ ర్యాంక్ రావాలన్నదే వారి కోరిక.సినిమాలు, షికార్లు, ఆటలు తాత్కాలికంగా బంద్ అయ్యాయి.
ఒకరోజు స్కూలు అయ్యాక ఇంటికి బయలుదేరుతుంటే అతడి స్నేహితుడు సురేష్ కలిసాడు. నీతో అర్జెంటుగా మాట్లాడాలి అని మహేష్ ను పక్కకు పిలిచాడు సురేష్.
"రేపు నా పుట్టిన రోజు?"అన్నాడు సురేష్.
" మెని మెని హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే, అడ్వాన్స్ విషెస్ " చెప్పాడు మహెష్.
" థాంక్స్ రా! కాని ఏం లాభం ? పరీక్షలు త్వరలో వున్నాయని మా పేరెంట్స్ రేపు ఎలాంటి సెలబ్రేషన్స్ కు ఒప్పుకోవడం లేదు. మామూలు రోజులాగే రేపటి రోజు కూడా స్కూలు, చదువు, ట్యూషన్లు అంటూ గడపాలి" నిరాశగా అన్నాడు సురేష్.
 " ఏం చేస్తాం. అయినా పేరెంట్ ఏం చేసినా మన మంచి కోసమే కదా"' అన్నాడు మహెష్.
" ఆ సంగతి అటుంచు, . రేపు నా పుట్టిన రోజు వెరైటీగా గడపాలని అనుకుంటున్నాను. నువ్వు ఓ కే అంటే నా ప్లాన్ చెబుతాను" "
ఏమిటా ప్లాన్, కాస్త వివరంగా చెప్పు"
"రేపు స్కూలుకు బయలుదేరినట్లు ఇంట్లో నుండి బయలుదేరుదాం. స్కూలు యూనిఫామ్ తో పాటు మరొక జత బ్యాగులో పెట్టుకుందాం. మార్నింగ్ షో కు సినిమా చూసి, మధ్యాహ్నం హోటల్లో స్పెషల్ లంచ్ చేద్దాం. ఒక రెండు గంటలు పార్కులో గడిపి, అక్కడే బట్టలు మార్చుకుని మామూలు టైముకు ఇంటికి వెళ్ళిపోదాం. " ప్లాన్ సవివరంగా చెప్పాడు సురేష్.
అంతా విన్న మహేష్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి.
"అమ్మో, ఇంట్లో చెప్పకుండా స్కూల్ ఎగ్గొట్టి , సినిమాకు, హోటల్ కు వెళ్ళడమే? మా మమ్మీ, డాడీ కి తెలిస్తే తాట తీస్తారు" గుండెలపై  చెయ్యి పెట్టుకుంటూ భయం భయంగా అన్నాడు మహేష్.
"ఏం పర్లేదు. ఇంట్లో తెలియకుండా మేనేజ్ చెస్తే రోజు మంచి మజాగా గడపవచ్చు.మన క్లాస్ ఫెండ్స్ ఎంతో మంది వారి ఫ్రెండ్ తో బర్త్ డే, వాలైంటైన్స్ డే, ఫ్రెండ్ షిప్ డే వంటి రోజులలో స్కూలు ఎగ్గొట్టి బయట జాలీగా, హ్యాపీగా గడపడం మామూలే. " అంటూ ఆ రోజు ఎలా ఎంజాయ్ చెయ్యవచ్చో,ఇంట్లో తెలియకుండా ఎలా మ్యానేజ్ చెయ్యవచ్చో చెబుతూ మహేష్ ను కన్విన్స్ చేసాడు సురెష్.
ఆఖరుకు, సంవత్సరానికి ఒకసారే వచ్చే బర్త్ డే నాడు కూడా నాకు కోపరేట్ చెయ్యవా? ఫ్రెండ్షిప్ విలువ ఇదేనా? అంటూ గడ్డం పట్టుకుని బ్రతిమిలాడాడు.
మొదట్లో ససేమిరా కుదరదు అన్న మహేష్ ఆఖరుకు ఒప్పుకోక తప్పింది కాదు. ఇద్దరూ ఆనందంగా మరునాడు రోజు ఎలా గడపాలో ప్లాన్ చేసుకున్నారు.ఆ రాత్రి మహేష్ కు ఇంకొక ఐడియా వచ్చింది. రేపటి రోజులో తాను కూడా కొంత డబ్బు ఖర్చు పెడితే ఇంకా బాగా రోజు స్పెండ్ చేయవచ్చు కదా అనుకున్నాడు. అయితే తనకు డబ్బు ఎవరిస్తారు ? అమ్మ, నాన్నలను అడిగితే అసలు ఇవ్వరు సరి కదా,తన ప్రోగ్రాం మొత్తం తెలిసిపోయి తనపై నిఘా పెడతారు. మొత్తం ప్రోగ్రాం పాడైపోయే అవకాశం వుంది. కాబట్టి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా డబ్బు దొంగలించాలని నిర్ణయించుకున్నాడు.
రాత్రి అమ్మా, నాన్నలు పడుకున్నాక నెమ్మదిగా బీరువా తాళం సంపాదించి, బీరువా తెరిచి నాన్నగారి పర్సు నుండి అయిదు వందల రూపాయలు కొట్టేసాడు.
తిరిగి తాళాలు యధాస్థానంలో పెట్టి తన గదిలోకి వచ్చి పడుకున్నాడు. అతనికి ఇప్పుడు ఎంతో ఎక్సైటింగ్ గా వుంది.రేపటి రోజున  సురేష్ తో కలిసి సూపర్ గా ఎంజాయ్ చేయబోతున్నాడు. ఇప్పుడు తనను తన ఫ్రెండ్స్  తనను కూడా వారి జట్టులో చేర్చుకుంటారు.ఇకముందు నుండి పార్టీలే పార్టీలు.
ఆ రాత్రి అతనికి కలలో అతని తాతగారు వచ్చారు.ఆయన కన్నీళ్లు పెట్టుకుని ఎంతో బాధతో మహేష్ చేతులు పట్టుకుని" ఎంత పని చేసావురా? నీకు చిన్నప్పటి నుండి నేను ఎన్నో నీతి కధలు, మహాత్ముల జీవిత చరిత్రలు చెప్పి మంచి మార్గంలో నడవమని  బొధించాను. నా ఆఖరి నిమిషంలో నువ్వు ఒక మంచి బాటలో నడిచి  నాకెంతో మంచి పేరు తేవడంతో పాటు ఈ దేశానికి ఉపయోగపడేలా నడుచుకుంటానని మాట ఇచ్చావు.కాని ఇప్పుడు ఏం చేసావురా? ఒక పనికిమాలినవాడితో కలిసి నీ విలువలకు త్రిలోదకాలిచ్చావు. ఆఖరుకు దొంగతనం కూడా చెయ్యడానికి కూడా సిద్ధపడ్దావు. నీ ప్రవర్తన నాకెంతో బాధతో పాటు మనస్థాపం కూడా కలిగిస్తొంది"అని బాధగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు.
ఈ కలతో దిగ్గున మహేష్ లేచి కూర్చున్నాడు. ఒళ్ళంతా చెమటలు పట్టేసాయి.తాతగారి మాటలతో తానెంత తప్పు చేసాడో అర్ధం అయ్యింది.తన అనుచిత ప్రవర్తనతో ఆయన మనస్సు కష్టపెట్టాడు. ఒక్కసారిగా అతనిలో నిద్రాణమై వున్న నైతిక విలువలు మేల్కొన్నాయి.వెంటనే లేచి తాను దొంగలించిన డబ్బు యధాస్థానంలో పెట్టెసాడు. మర్నాడు తాను తనతో రావడం లేదని లేదని సురేష్ కు గట్టిగా చెప్పాలని,అంతేకాక ఇంకెప్పుడూ తల్లిదండ్రుల మాట కాదని తప్పుడు పనులు చేయకూడదని నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయం తీసుకున్నాక అతనికి ఎంతో రిలీఫ్ గా అనిపించి హాయిగా నిద్ర పోయాడు.
చిన్ననాటి నుండే పిల్లలలో నైతిక విలువలు నేర్పిస్తే అవి వారిని ఎప్పుడూ కాపాడుతూ మంచి మార్గంలో నడిచేలా చేస్తాయి.
సి హెచ్ ప్రతాప్ 


ఫ్లాట్ నెంబర్ : 405 ,శ్రీ బాలాజీ డిలైట్స్
రాహుల్ కోలనీ, ఎ ఎస్ రావు నగర్
సాయి సుధీర్ కాలేజీ వద్ద
హైదరాబాద్ 500 062

కామెంట్‌లు