గొప్ప స్థపతి మా శివ నాగిరెడ్డి గారు (31);-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 మనిషి జీవితం సామాజికం. అందరితో కలిసి జీవించాలి. ఒక్కడి వల్ల ఏ కార్యము సాధ్యపడదు. పెద్ద వారైనా, చిన్న వారైనా వారి తత్త్వాన్ని అనుసరించి మనం ప్రవర్తించాలి. మంచిది అయితే చేయడానికి ముందుకు రావాలి.అదే చెడని నీకు అనిపిస్తే  దానికి దూరంగా ఉండాలి తప్ప నోరు విప్పకూడదు. ఒక చిన్న కుర్రవాడు వచ్చి నమస్కరించి తన పేరు చెప్పి  మీ కోసం వచ్చాను అంటే ఎంత ముద్దుగా ఉంటుంది  మనం ముచ్చట పడుతూ  దగ్గరకు తీసుకొని ఆనందంగా ముద్దుగా  మాట్లాడుతూ ఉంటాం. అదే ముక్తసరిగా ఉంటే, ఏమీ పట్టనట్లుగా తానొక్కడే  గొప్పవాడు అన్నట్లుగా  భావించి ప్రవర్తిస్తే అతనిని చూసే ఆ పద్ధతి వేరుగా ఉంటుంది. ఆప్యాయతలు లేకుండా పోతాయి. ఈ స్థితికి కారణం తల్లిదండ్రులు. పిల్లలకు మనం ఎంత గారం పెడతామో అంత క్రమశిక్షణ ఇచ్చి మంచి అలవాట్లు నేర్పాలి లేకపోతే ఈ బాలుడి లాగానే ఉంటుంది. అదే పెద్ద వారు వచ్చి అణకువగా మర్యాదగా మాట కలిపిన వారితో ఒక రకంగా మాట్లాడుతాం. వీరికి ఇచ్చే
గౌరవ మర్యాదలు వేరు
తప్పకుండా ఆతిథ్యం ఇచ్చి  పంపిస్తాం మాట్లాడుకునే పద్ధతి కూడా అంత ఉదాత్తంగా ఉంటుంది. అదే తల బిరుసు కుర్రాడు వచ్చి వాడి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ, మంచీ మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్న వాడిని ఎలా చూస్తాం  ఎప్పుడు వీడు బయటకు వెళతాడా అని ఆలోచిస్తాము. ఆప్యాయతకు కానీ, ఆతిథ్యానికి కానీ తావు ఉండదు. అలాంటి మనస్తత్వం అర్థం చేసుకోవడంలో మేటి మా శివ నాగి రెడ్డి. అంత రౌడీగా వచ్చిన కుర్రాడు కూడా  రెడ్డి గారి పంచన వుంటే  తప్పక మారితీరతాడు. ఇలాంటి ప్రవర్తన అలవాటు చేసుకుంటే వచ్చేది కాదు  జన్మ సంస్కారం ఉండాలి  తల్లిదండ్రుల పెంపకం, ఆప్యాయతలు వుండాలి  వారు పెద్దలను గౌరవించే వారై ఉండాలి  అలాంటి వాడు కనుకనే  తల్లిదండ్రుల నుంచి మంచి అలవాట్లను నేర్చుకున్నారు రెడ్డి గారు.
ఇంక వయసులో ఉన్న ఆడపిల్లలు అంతా ఒక మాదిరిగా ఉండరు కదా  పేదరికంలో ఉండి  సంస్కారయుతంగా పెరిగిన పిల్లలు ఒక రకంగా ఉంటారు. విపరీతమైన నమ్మకం తో ఉన్న వారు మరికొంతమంది ఉంటారు. మరికొంతమంది వారికి డొక్క శుద్ధి లేకపోయినా  వారి పెద్దవారు మంచి ఉద్యోగ స్థితిలో ఉంటే వారు మర్యాదగానే ఉంటారు కానీ వీరికే ఎక్కడలేని కుచ్చితం  వస్తుంది. మరి ఈ ముగ్గురిని ఒకేరకంగా చూడాలా? వారి పద్ధతిని మనం కూడా అనుసరించాలా? నిజానికి నాలాంటి వాడయితే టిట్ ఫర్ టాట్ మంచికి మంచి చెడుకు చెడు ఉంటుంది. కానీ శివ నాగి రెడ్డి గారు నా అంత  రాజస తత్త్వం కాదు వారిదంతా సాత్వికం ఎదుటి వారిని కూడా నీ లాగానే చూసి గౌరవించడం నేర్చుకోమని పెద్దలు చెప్పిన విషయాన్ని గౌరవించే పెద్దమనిషి. అలాంటి వ్యక్తి నాలాగా ప్రవర్తించడు కదా అందుకే వారికంత గౌరవ మర్యాదలు.

కామెంట్‌లు