గొప్ప స్థపతి మా శివ నాగిరెడ్డి గారు (34);-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.


 జీవితంలో ఒక కుటుంబానికి మంచి పేరు ఎలా వస్తుంది ఎవరి వల్ల వస్తుంది  సామాన్యంగా  ఆలోచించరు  తమ పేరు వల్ల  ఆస్తిపాస్తుల వల్ల పేరు వస్తుందని అనుకుంటారు కానీ మన పెద్దలు  ఇంటిని చూసి ఇల్లాలిని చూడు అని అంటారు అంటే ఆమె అప్సరసగా ఉందనా అర్థం  ఆమె సౌందర్యం వల్ల ఆమెను చూడాలనిపిస్తుంది అనా ప్రపంచంలో తెలిసిన వాడు ఎవ్వడూ భౌతికమైన అందాన్ని ఆశించడు. ఆమె మనస్సు ఎంతో మృదువుగా ఉంటుంది. దాని అందం చూస్తారు తప్ప మిగిలినవి ఏమీ పట్టించుకోరు. ఇల్లాలు లేక గృహిణి అంటే ఏం చేస్తుంది ఆ ఇంటి పెత్తనం అంతా ఆమె చేతుల మీదుగానే జరుగుతుంది అంటాం. కానీ ఏ కుటుంబం అయినా ఒక దాని వల్ల పూర్తి కార్యక్రమాలను చేయగలుగుతుందా అనేక వస్తువుల సహకారం కావాలి.  బియ్యం కావాలి, వంటసామగ్రి కావాలి, పనిమనిషి కావాలి, వస్తువులు కావాలి, వంటకు సిలిండర్ కావాలి, ఇవన్నీ ఉంటేనే ఆమె చేయగలుగుతుంది కనుక సమష్టి కృషి  పేరు తేవడానికి కారణం. వేళకాని వేళలో  ఆకటితో వచ్చే అతిథులను ఆదరించడం దగ్గరనుంచి  ముందే చెప్పి నాకు ఈ పదార్థం అంటే ఇష్టం ఆ రోజు వస్తాను అన్న అభ్యాగతి  వరకు అందరి క్షేమాన్ని చూసుకుంటుంది కనుకనే ఆమెను గృహిణి అన్నారు. ఈ లక్షణాలన్నీ నాకు శివనాగిరెడ్డి గారిలో కనిపిస్తాయి. లింగాన్ని మార్చాలని కాదు తత్వాన్ని మాత్రమే. ఒక గృహిణి షడ్రసోపేతమైన వంటకాన్ని తయారు చేసి  చివరిలో మరొకటి తయారు చేస్తున్న సమయంలో ఆ వచ్చినవారు త్వరపడి భోజనం చేస్తే  ఆయన సుష్టుగా కడుపారా తిన్నా అయ్యో నేను ఇది పెట్టలేక పోయానని బాధపడుతుంది. అది అమ్మ తత్త్వం శిల్పులలో ఎవరి తత్త్వం ఎవరికి ఉన్నా రెడ్డి గారు మాత్రం ఎవరినీ అనుకరించడం కాని అనుసరించడం కానీ చేయలేదు. తాను నేర్చుకున్న దానికి మరికొన్ని  సొగసులను అద్దటం కోసమే ప్రయత్నం చేస్తారు  మొత్తం పూర్తయిన తర్వాత  తాను మనసులో ఏముందనుకున్నాడో అది పూర్తిగా రాకపోతే ఆ గృహిణి పరిస్థితే వీరిది కూడా. ఇది కూడా చేస్తే బాగుండునే అన్న ఊహ ఆయనను వేధిస్తోంది. ఇంటిని చిందరవందరగా ఉంచకుండా  సక్రమంగా ఏ వస్తువు ఎక్కడ ఉండాలో చూసి  దానిని అక్కడ అమరుస్తుంది గృహిణి  ఈ శిల్పాలు కూడా చక్కగా తయారుకావడానికి  కావలసిన ముడిసరుకు మొత్తాన్ని ఒకచోట పెట్టుకొని దానికి ఏ రాయి సరిపోతుందో  దానిని తెలుసుకొని  ఆ ఏర్పాట్లు చేస్తారు.  ఆ రాతిని  సక్రమంగా చెక్కకపోతే  ఆ ఇల్లు ఎంత చిందరవందరగా  అసహ్యంగా కనిపిస్తుందో  వీరి శిల్పం కూడా అలాగే అవుతుందనే భయం. మన ఉపాధ్యాయులు చిన్నప్పుడే మనకు చెబుతారు భయమూ, భక్తీ ఉండి తీరాలి అని భయం ఉండడం వల్ల జీవితంలో తప్పు చేయకుండా ఉండాలి అన్న కృత నిశ్చయానికి వచ్చి  దాని కోసం ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నం ఎలా ఉండాలి అంటే భక్తితో కూడినదై ఉండాలి.  భక్తి అనగానే మనవారి మెదడులో వచ్చే అభిప్రాయం భగవంతుడు అని దానిని పుష్పాలతో  పూజించడం అని అనుకుంటారు. కానీ భక్తి అంటే  అంకితభావం. దాని మీదే మనసు లగ్నం చేసి చేయలేకపోతే  తాను అనుకున్న  పనిని సక్రమంగా చేయలేరు. కనుక అలా చేయగలిగిన చేస్తున్న వ్యక్తి మా శివ నాగి రెడ్డి గారు. తుదిమెరుగులు దిద్దే అవకాశం లేక అత్యవసరంగా పంపించవలసిన  స్థితిలో  ఒక్కొక్కసారి అలా పంపాల్సి వస్తుంది అప్పుడు ఆ స్థితి, ఆ  మధన ఆ గృహిణిని మించి ఉండదా? అందుకే  శివ నాగి రెడ్డి గారిని  నండూరి వెంకట సుబ్బారావు గారు రాసిన  ఉత్తమా ఇల్లాలి నోయి అన్న పాటని జ్ఞాపకం చేయడం కోసం  ఆ పోలిక చేశాను. స్త్రీతో పురుషుడు ఏమిటి అంటే  ఇవాళ రాజ్యాలను ఏల గలిగిన స్త్రీలు మగవారి కన్నా ఎంత ఎక్కువ మంది వున్నారు. మనకు జన్మనిచ్చింది స్త్రీ కదా  పెంచి పోషించింది  మనకు విద్యాబుద్ధులు చెప్పింది అమ్మ కాదా? అమ్మ  ఆడది కాదా ఆమెలో స్త్రీ తత్వాన్ని చూస్తామా అమ్మతనాన్ని చూస్తామా? ఇక్కడ రెడ్డి గారి లో మాతృతత్త్వం చూశాను నేను.


కామెంట్‌లు