హైపర్ టెన్షన్;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 అనారోగ్యాలకు వయసుతో ఎలాంటి పరిమితులు వుండవు. నేను చెప్పిన లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేవి ఏ ఒక్క వయసు వారికో పరిమితం కాదు. చిన్నవారా పెద్దవారా అని కాకుండా ప్రతి ఒక్కరూ ఈ రుగ్మతల బారిన పడి బాధలను అనుభవిస్తూ ఉంటారు. అయితే నిన్న మనం చెప్పుకున్నట్లుగా ఒక్కొక్క డిసీస్ గురించి వివరంగా తెలుసుకుందాం. 
మొదటిది హైపర్ టెన్షన్ అంటే రక్తపోటు. వాడుక భాషలో చెప్పాలంటే బిపి ఈ పదానికి  కొందరు పరిచితులైనప్పటికి అందరూ సుపరిచితులే...
హాస్పిటల్ లోనే ఉంటాను కాబట్టి రకరకాల పేషంట్ లను చూస్తూ వుంటాను. 
పేషెంట్ సైకాలజీలు చాలా విచిత్రంగా ఉంటాయి. మీకు తెలుసా నేను ఎక్కువ కాలం పోస్టింగ్ చేసింది జనరల్ మెడిసిన్ లోనే అక్కడ ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేవి ప్రథమం.
అయితే నేను చూసిన చాలా మంది పేషెంట్స్లో చీఫ్ కంప్లైంట్ గా కోపాన్ని చెపుతూ వుంటారు. మా వారు ఈ మధ్య ఎక్కువగా కోప్పడుతున్నారు ఆయనకు బీపీ వచ్చిందేమో అని అనుకుంటున్నామని చెప్పేవాళ్లు కొందరైతే, ఏమ్మా ఇదివరకు బిపి ఉందా అంటే? లేదు కానీ ఇప్పుడు మాత్రం వచ్చి వుంటుంది డాక్టర్ ఈ మధ్య ఎక్కువగా కోపం వచ్చి అరుస్తున్నాను అని చెప్పేవారు మరికొందరు. ఇది అమాయకత్వమో? లేదా పరిసరాల ప్రభావమో? కోపం వస్తే బిపి వచ్చేసి నట్టు కాదు. 
బాడీలో బ్లడ్ ప్రెషర్ పెరిగినప్పుడు కాస్తంత యాంగ్జైటీ, చెమటలు పట్టడం అనేవి సహజ లక్షణాలుగా కనిపిస్తూ ఉంటాయి. బాడీ కొంత సేపు అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది. ఆ సమయంలో ఎవరేం మాట్లాడినా, చీకాకు పడుతుంటాం అంతే తప్ప మరే ఇతర కారణాలు కావు.
మరి హైపర్ టెన్షన్ ఎలా వస్తుంది అంటే వయసు నిమిత్తం, మద్యాన్ని, సిగరెట్లను సేవించడం వల్ల, ఆహారపు అలవాట్ల వల్ల, జీన్ డిఫెట్ల వల్ల, స్ట్రెస్ వల్ల, ఇతర రోగాల వల్ల కూడా ఈ రక్త పోటు రావొచ్చు. రక్త పోటు అధికమైనప్పుడు వచ్చే లక్షణాలు  కళ్ళు తిరగడం, చెమటలు పట్టడం, వాంతి వచ్చినట్టు అనిపించడం, తలనొప్పి, గుండె దడ లాంటివి. అయితే ఇది మందులతో నయమైపోతుందా అంటే?  కచ్చితంగా కాదని చెప్పాలి మందులు అనేది బీపీ ని కంట్రోల్ లో మాత్రమే ఉంచగలవు. బీపీనే కదా ఈ రోజుల్లో అందరికీ అది సహజం అని వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం అయితే చేయను కానీ నేను. హై బ్లడ్ ప్రెషర్ గుండెపోటు కి దారి తీస్తుంది కనుక జాగ్రత్తలు మాత్రం తప్పనిసరి. కాస్త నియమాలు పాటించడం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చు మన ఆరోగ్యాన్ని మనమే కంట్రోల్ చెయ్యవచ్చు.
ఆహారంలో ఉప్పుని తగ్గించి తీసుకోవాలి,
ఊరగాయలు, అప్పడాలు ఇలాంటి ఆహారాలకు స్వస్తి చెప్పి,
ఆకుకూరలు, పండ్లు కూరగాయలను తినే అలవాటు చేసుకోవాలి, 
మెడిటేషన్, యోగా లాంటి వ్యాయామాలను చేస్తూ,
సోడా ఉప్పుకానీ, కూల్ డ్రింక్స్ ఉప్పు చేపలు, చిప్స్ లాంటివి
మొత్తంగా మానేయాలి.
పాలను తాగవచ్చు కానీ అందులో మరే ప్రోటీన్ పౌడర్స్ అంటే హార్లిక్స్ బూస్ట్ లాంటివి ఉపయోగించకూడదు.
చెరువు చేపలను తినవచ్చు.
ఉప్పుకు ప్రత్యామ్నాయంగా రుచి కోసం కరివేపాకు, పుదీనా లాంటివి ఆహారంలో జోడించండి. 
హెచ్చరికలు జారీ చేయడం అనేదే నా వంతు అది పాటించడం, పాటించకపోవడం అనేది మీ ఇష్టానుసారం...
బాధ్యతగా ఈ చిన్ని డాక్టరు చెప్పిన మాటలను బుద్ధిగా వింటారని భావిస్తూ...


కామెంట్‌లు