ప్రథమ గురువు తల్లి;-డా.నీలం స్వాతిచిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961
 చిన్నపిల్లల్లో అనేక రకాల వాళ్ళు ఉంటారు  అమ్మ కానీ నాన్న కానీ, అన్న కానీ ఎవరు ఏది చెప్పినా ఒకసారి చెప్పగానే అర్థం చేసుకుంటారు. కొంతమంది రెండు మూడు సార్లు చెప్పించుకుంటారు. మరికొంతమంది ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోరు అక్కడ అమ్మ అవసరం   గురుకులాలలో విద్యావ్యవస్థ ఎలా ఉండేదంటే గురువుగారి  కుడి ప్రక్కన త్వరగా అర్థం చేసుకోగలిగిన కుర్రవాళ్ళని, ఎడమపక్క కొంచెం తక్కువ జ్ఞానం కలిగిన వాళ్లను కూర్చోబెట్టుకుంటారు.  ఆయన ఏదైనా విషయం చెప్పడానికి ఉదాహరణకి ఒక శ్లోకం.  ఆ శ్లోకం ఆయన చెప్పగానే కుడిచేతి పక్కన మొదటి వాడు దానిని తిరిగి చెబుతాడు. ఆ చెప్పిన దానిని రెండో కుర్రవాడు చెబుతాడు. ఆ తర్వాత వరుసగా ఎనిమిది మంది చెప్పేస్తారు. కానీ ఎడం చేతి ప్రక్కన ఉన్న వాళ్లు ఏ ఒక్కరు కూడా నోరు విప్పరు. అక్కడ గురువు గారి అవసరం. పిల్లలు చీకటిలో ఉన్నారు కనుక విజ్ఞానజ్యోతి ని వెలిగించవలసిన బాధ్యత ఆ గురువుగారికి ఉంటుంది.  వారు చాలా సక్రమంగా దాన్ని నిర్వర్తిస్తారు అది గురు ధర్మం.
ఆ గురు స్థానంలో ఉన్నది అమ్మ ఈ ప్రపంచంలో ఏ బిడ్డ కైనా మొదటి గురువు కన్నతల్లి  లాల పోస్తూ కూడా అక్షరాలను వాళ్ల మెదడుకు పట్టించ గలిగిన నేర్పరి. ఆ అమ్మ కూడా ఒక్కొక్కసారి పిల్లల మనస్తత్వాలను అర్థం చేసుకోవడంలో గారాం వల్ల కొరవడుతుంది తెలివైన చురుకైన కుర్రవాడికి  రెండో సారి చెప్తే కోపం విసుగు  ఎందుకమ్మా అన్ని సార్లు చెప్తావు అని విసుక్కుంటాడు కనుక అతని తత్త్వాన్ని తెలుసుకొని  ఎలా చెబితే వాడు వింటాడో అలా చెప్పాలి  లాలించి బుజ్జగించి చెపితే కొంతమంది వింటారు  కొంతమంది లంచం లేకుండా ఏ పని చేయరని మనకు తెలుసు. పిల్లల్లో కూడా చెకోడి ఇస్తే నీ మాట వింటాను. నిన్న చేసిన జిలేబి ఉంది కదా అది తింటూ మాట్లాడుకుందాం  అనే రకం పిల్లాడు వుంటాడు. ఇంకా తృతీయ శ్రేణి లో ఉన్న వాళ్ళు ఉంటారు అమ్మ ఎన్నిసార్లయినా చెప్పనివ్వండి  వాడి బుర్రకి ఎక్కదు చేసిన పనినే చేస్తూ ఉంటాడు. అలాంటి వాడికి దండన తప్ప మరొక మార్గం లేదు  దండించడం ఎలా? ఎలా చేసినా అమ్మకే బాధ వాడు ఏడుస్తూ ఉంటే వాడి కన్నీటికి కరిగిపోతుంది అది తల్లి ప్రేమ  తొడపాశం పెడితే కందిపోతుందని భయం  అందుకే పెట్టినట్లుగా పెడుతుంది తప్ప కందిపోయేటట్లు చేయదు  ఎంతైనా సున్నిత మనస్కురాలు కదా అమ్మ.  అలాంటి అమ్మకు పాదాభివందనం చేయడం తప్ప మనం ఏం చేయగలం  అమ్మ దొరకడం మన పూర్వ జన్మ సుకృతం అంటే ప్రతి ఒక్కరూ ఒప్పుకొని తీరవలసినదే.


కామెంట్‌లు