పోరాటాల గడ్డపై పురుడు పోసుకున్న పుస్తకం ప్రమోద్ ఆవంచ--7013272452
 ఉమ్మడి కరీంనగర్ జిల్లా గ్రామాలు,1970-80 దశకంలో
నీళ్ళు, కరెంట్, విద్య, రవాణా వంటి కనీస సౌకర్యాలు లేక అంధకారంలో కొట్టుమిట్టాడుతుండేవి.అప్పట్లో వర్షాలు పడక తీవ్రమైన నీటి కొరత.నీళ్ళకోసం మహిళలు కిలోమీటర్ల దూరం ప్రయాణం చెసేవారు.బిందెలు తీసుకుని వ్యవసాయ బావులకు
దారి కట్టేవారు.పట్టణాలలో,నల్లాలు వచ్చినా మూడు, నాలుగు రోజులకొకసారి నీళ్ళు వచ్చేవి.నల్లాల
దగ్గర బిందెలను క్యూ లో పెట్టి ఎదురు చూసేవారు.అక్కడ వారి పడిగాపులు, ఎదురుచూపులు,నీళ్ళు వచ్చేప్పుడు తోపులాటలు, గొడవలు,తండ్లాటలు ఇలా అన్నీ ఇన్నీ కష్టాలు కావు.నాయకులు ఎన్నికల తరువాత గాయబ్ అయి 
మళ్ళీ ఎన్నికలప్పుడే కనిపించెటోళ్ళు.ఇది ఇలా వుంటేఅధికారంలోకి వస్తే, తొమ్మిది గంటల కరెంటు ఇస్తామనీ వాగ్దానాలు చేసిన ప్రబుద్ధులు,ఇరవై నాలుగు గంటల్లోకేవలం మూడు గంటలు మాత్రమే కరెంట్ ఇచ్చేవారు.అప్పట్లో, గ్రామాలల్లో,రోజుల తరబడి కరెంట్ వుండేది కాదు.ఏదో మొక్కుబడిగా,అరగంటో,
గంటో వుండేది.కరెంటు లేకపోవడంతో, ప్రతి ఒక్కరికీ
ఎక్కాలు,కంద్దీళ్ళు, ఒత్తి ప్రమిదలే దిక్కు అయ్యేవి.దీనితో పిల్లలు చదువుకోవాలంటే చాలా ఇబ్బందులు పడేవారు.ఇంతేకాకుండా వ్యవసాయ బావుల్లో,బోర్లు పనిచేయక,పంటకు నీళ్ళు లేక రైతులు
నానా ఇక్కట్లు పడేవారు.కరెంట్ ఎప్పుడొస్తుందో తెలియక రాత్రంతా పొలాల్లోనే నిద్రపోయే వాళ్ళు.కొందరు అర్ధరాత్రి మూడు గంటలకు లేచి పొలాల దగ్గరకు వెళ్లి, నీళ్ళు పెట్టేవాళ్ళు.ఇక విద్యా సంస్థల విషయం చాలా దారుణమైన పరిస్థితి.ప్రభుత్వ
పాఠశాలల దుస్థితి దయనీయంగా ఉండేది.కొన్ని ఊర్లల్లో,ఐదవ తరగతి వరకు,మరి కొన్ని చోట్ల ఏడవ తరగతి వరకు ప్రాథమికోన్నత పాఠశాలలు వుండేవి.ముఖ్యంగా అప్పట్లో ఉపాద్యాయుల కొరత, తీవ్రంగా ఉండేది.అంతే కాకుండా క్లాసు రూంల కొరత కూడా ఉండేది,దాంతో పిల్లలను చెట్ల కింద కూర్చోబెట్టి
చదువులు చెప్పే వారు.ఉన్న ఉపాద్యాయుల అలసత్వం, పిల్లలకు కనీస వసతులు, లేకపోవడం,సరైన ఇంఫ్రాస్టక్చర్ లేకపోవడం వంటి కారణాల వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్య అరకొరగాఉండేది.
 అప్పట్లో రవాణా సౌకర్యాలు నరకాన్ని తలపించేలా వుండేవి.గ్రామాల్లో పొద్దునొకటి, సాయంత్రమొకటి రెండు సార్లు మాత్రమే ఎర్ర బస్సు కనిపించేది.కొన్ని ఊర్లు రోడ్డును ఆనుకుని వుండటం వల్ల బస్సు అక్కడే ఆగి ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్ళేది.కొన్ని ఊర్లు రోడ్డు నుంచి కిలోమీటరు, రెండు కిలోమీటర్ల దూరం వుండడం వల్ల, అక్కడ దిగి ప్రయాణికులు ఊర్లోకి రెండు కిలోమీటర్లు నడిచేవారు.
ఉదయాన్నే వచ్చే బస్సు,స్కూల్ పిల్లలు, ఉద్యోగులు,తమ ఊర్లల్లో పండే కూరగాయలు, ఆకుకూరలు,పండ్లు గంపల్లో పెట్టుకుని టౌన్ కు వెళ్లి అమ్ముకునేవాళ్ళతో కిక్కిరిసి ఉండేది.బస్సు నిండిపోవడంతో, డ్రైవర్లు కొన్ని స్టాపుల్లో ఆపకుండానే
వెళ్ళేవారు, కొన్ని చోట్ల, బస్టాండుకి దూరంగా తీసుకెళ్ళి ఆపడం చేస్తుండేవారు.కొన్ని ఊర్లకు బస్సే వుండేది కాదు.ఆ ఊర్లల్లో పిల్లలు పక్క నున్న ఊరికి కాలినడకన వెళ్లి చదువుకునేవారు.చిరు వ్యాపారస్తులు,గంపను నెత్తినెత్తుకునీ, ఊరూరు తిరిగే వాళ్ళు.ఇందులో ఎక్కువగా ఆడవాళ్ళు ఉండడం గమనార్హం.మామూలుగా పల్లెటూళ్ళలో రోడ్లు చాలా ఇరుకుగా ఉంటాయి.రోడ్డుకిరువైపులా ఇండ్లు,ఇండ్ల ముందర వడ్లు, మొక్కజొన్నలు,ఇతర ధాన్యాలను ఆరబోస్తుంటారు.అలాంటి స్థితి లో ఆర్టీసీ బస్సు ఊర్లోకిరావాలంటే సాధ్యం కాదు.అందుకే ఇండ్ల ముందున్న ప్రహారీ గోడలను పడగొట్టి, రోడ్డు వెడల్పు చేస్తేనే బస్సు ఊర్లోనికి రావడానికి వీలవుతుంది.అది అంతా సులభమైన విషయం కాదు.ఇక ఇతర రవాణా సౌకర్యాలలో, సైకిల్స్,రిక్షాలు అతి ప్రధానంగా వుండేవి.
                  పైన పేర్కొన్న ప్రాథమిక సౌకర్యాలు సామాన్యులకు, అందుబాటులో ఉండకపోవడంతో, వాళ్ళల్లో విసుగు వచ్చి,ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో, నిరసన వ్యక్తం చేయడం అనేది సర్వసాధారణం.అయితే ఈ నిరసన వ్యక్తం చేయడంలో, ప్రజలకు సపోర్ట్ గా మొదటి నుంచి ఉభయ కమ్యూనిష్టు పార్టీలు ముందుండేవి.అప్పట్లో, కాంగ్రెస్, కమ్యూనిష్టు పార్టీలు రెండే వుండేవి.కాంగ్రేస్ పార్టీ గ్రామ స్థాయిలో ఏర్పరచుకున్న కాడర్ నీ, కమ్యూనిష్టు పార్టీలు నిర్మించుకోలేకపోయారు.తక్కువ మెంబర్ షిప్ ఉన్నా
వాళ్ళు పార్టీ కోసం కమిటెడ్ గా పనిచేసేవారు.కాంగ్రేస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా వుండేది.ఆ పార్టీ,అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగేకొనసాగుతుంది.కరెంటు కోతలతో, ఇక్కట్లు పడుతూ,తొమ్మిది గంటల కరెంటు ఇస్తామన్న ప్రభుత్వం,తమ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదనీ, రైతులు, రాస్తారోకోలు, నిర్వహించడం, విద్యుత్ శాఖ అధికారులను, వాళ్ళ కార్యాలయాల్లో నిర్బంధించడం, దీన్ని అడ్డుకొని, పోలీసులు, అందుకు కారణమైన వాళ్ళను, అరెస్టు చేసి,వాళ్ళపై కేసులు నమోదు చేయడం, జరుగుతుండేది.అలాగే నీళ్ళు రావడం లేదని, ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకోని, ప్రభుత్వంపై,ఖాళీ కుండలతో, శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేస్తున్న, మహిళలు, యువకులు, కార్మికులపై విచక్షణా రహితంగా లాఠీచార్జి చేసి,వారిపై కేసులు పెట్టడం....బస్సు బస్టాండ్ లో ఆపని డ్రైవర్ పై స్థానిక యువకులు దాడి చేయడం, వారిపై కేసులు నమోదు చేయడం, జరిగింది.ఆ పదేళ్ల కాలంలో,ప్రజాపోరాటాలను, ప్రభుత్వం తన ఉక్కు పాదంతో అణగదొక్కింది.సమస్యలు పరిష్కారించే వాళ్ళు లేకపోవడంతో పాటు పోలీసు నిర్బంధం అధికమైంది.సందెట్లో సడేమియా అన్నట్లు,పైరవీకార్లు,దళారులు, పోలీసులతో, కుమ్మక్కు అయి, న్యాయం కోసం ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టేవాళ్ళు.ఈ కేసుల బాధ తట్టుకోలేక చాలా మంది యువకులు,అడవి బాట పట్టారు.కొందరు రాజకీయాల్లో చేరారు.                 
ఇలా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగి, కరీంనగర్ జిల్లా కోర్టు చేరుకునేవి.1977 సంవత్సరం నాటికి కరీంనగర్ జిల్లా కోర్టులో, యాభై మంది అడ్వకేట్స్ మాత్రమే ఉండేవారు.అప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో, అక్రమ కేసులు మోపబడిన దళితులు, గిరిజనులు, బహుజనులు, నిరక్షరాస్యులు, అనేక మంది,తమ మీద బనాయించిన కేసులను కొట్లాడేందుకు, డబ్బులిచ్చి వకీళ్ళను పెట్టుకునే ఆర్థిక స్థోమత కూడా లేని వాళ్ళున్నారు.
 అలాంటి పరిస్థితుల్లో గులాబీల మల్లారెడ్డి గారు, ఎల్.ఎల్.ఎమ్.మధ్యలోనే ఆపేసి, గ్రామాలను అభివృద్ధి చేయాలనీ,యువతను చైతన్యం చేయాలనీ,పీడిత వర్గాలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో, కరీంనగర్ జిల్లా కోర్టులో అడ్వకేట్ గా
 ప్రాక్టీసు ప్రారంభించారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ మండలం,తురకవాని కుంట గ్రామంలో
 భూదేవి, లింగారెడ్డి అనే దంపతులకు ఆయన ఏకైక సంతానంగా, జన్మించారు.పాఠశాల విద్య రామవరం,నంగునూర్, హుస్నాబాద్ లలో, డిగ్రీ సిద్దిపేటలో, ఉస్మానియా యూనివర్సిటీ లో ఎల్.ఎల్.బి.పూర్తి చేసారు.చిన్నప్పటి నుంచి ఆయనకు కవితలు, కథలు, రాయడం, ఉపన్యాసాలు ఇవ్వడం చాలా ఇష్టం.1969 లో,జరిగిన జై తెలంగాణ ఉద్యమంలో, పాల్గొని, కరీంనగర్ జైలుకు వెళ్లిన ఆయన అక్కడే తన మొదటి కవితను రాసారు.1984 లో, పల్లె పొలిమేరల్లోకి.. కవితా సంపుటి,86 లో జర్నలిస్టు కథాసంపుటి,2014లో,జనమేవ జయతే-కవితాసంపుటి,ఆ తరువాత నా లక్ష్యం నా గమ్యం, ఎద్దు ఎవుసం...సురుకుల వైద్యం, ప్రకృతి ప్రియురాలు మానవత, వంటి కవితా సంకలనాలను వెలువరించారు.మల్ దాద- చారిత్రక నవల, కూడా రాసారు."కోర్టు రణ భూమిలో, వెయ్యి యుద్దాలు వెయ్యి విజయాలు...ఈ పుస్తకంలో తన నలబై సంవత్సరాల వకీల్ వృత్తిని, తాను సాధించిన విజయాలను,కళ్ళకు కట్టినట్లు పొందుపరిచారు.ఈ పుస్తకాన్ని, దీనితో పాటు తాను రాసిన ఇంకొన్ని కవితా సంకలనాలను,గత ఆదివారం సిద్దిపేటలో జరిగిన సాహితీ సభలో పరిచయమై, నాకు అందించారు.వెయ్యి యుద్దాలు వెయ్యి విజయాలు పుస్తకం చదివాక,మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది.
                    1970-80 సమయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా గ్రామాలు, అక్కడి ప్రజల సమస్యల్ని  మీకు వివరించాను."గెలవాన్న తపన ఉన్నచోట ఓటమి అడుగైనా పెట్టదు"అని అంటూనే బద్దకించే పొలం లేదు కానీ మనుష్యులు ఉన్నారన్న చైనా సామెతను గుర్తుకుచేసారు, మల్లారెడ్డి గారు.అప్పట్లో,కరీంనగర్ జిల్లాలో వివిధ పార్టీల నాయకులపై, వారి వెంట తిరిగే యువకులపై, అక్రమ కేసులు బనాయించి, రిమాండ్ చేసేవారు.కోర్టులో మల్లారెడ్డి గారు రోజుకు పదిమందినైనా బేయిల్ పై, విడిపించే పరిస్థితి ఉండేది.ఒక్కొక్కరు యాభై రూపాయలు ఇచ్చినా అయిదు వందల రూపాయలు జమ అయ్యేవి.వచ్చిన డబ్బుల్లో, మూడు, నాలుగు వందల రూపాయలు క్లయింట్లు అన్నం తినడానికి, మరియు వాళ్ళు ఊరికెళ్ళేందుకు బస్సు చార్జీలు తిరిగి ఇచ్చేవారు.ఆ రోజుల్లో ఆయనకు డబ్బు మీద ఆశ,ధ్యాస కానీ ఉండేది కాదు.ఆయనకు ఒకటే ఆలోచన,ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఒక్కరూ కూడా జైలుకు వెళ్ళవద్దనుకునేవారు.నడుస్తున్న కేసుల్లో ఎవ్వరికీ శిక్ష
 పడొద్దనీ, ప్రతి రోజూ రాత్రి మూడు గంటలకు లేచి, ఉదయం ఏడు గంటల వరకు ఫైల్స్ ఏకధాటిగా చదవడం, వాటిని సంబంధించిన "కేస్ లా"ని, వెదికి పట్టుకోవడం, నోట్స్ రాసుకోవడం చేస్తుండేవారు. ఈయన పట్టుదల చూస్తుంటే, నల్గొండలో మా చిన్నాయన సీనియర్ క్రిమినల్ అడ్వకేట్ ఆవంచ వేణుగోపాల్ రావు గారు జ్ఞాపకం వస్తున్నారు.ఆయన కేసు ఉందంటే, తెల్లవార్లూ లా పుస్తకాలు చదువుతుండేవారు.వాళ్ళ డెడికేషన్,కేసు గెలవాలన్న తపన అప్పటి తరం,డబ్బులతో, సంబంధం లేకుండా,
 ఒక చాలెంజ్ గా తీసుకుని కేసు కొట్లాడడం గొప్ప విషయం.ఎంత చదివినా ఇంకా తెలియని విషయాలు ఎన్నో ఉండేవి.కేసులు ఎక్కువగా రావాలంటే, తీసుకున్న ప్రతి కేసులో విజయం సాధించాలి.నన్ను నమ్ముకున్న వ్యక్తికి నా అసమర్థత వల్లనో,నా సోమరితనం వల్లనో, నష్టం జరగకూడదు.ఒక్కో కేసులో
 చార్జిషీటు,161 స్టేట్మెంట్ ను, మెడికల్ సర్టిఫికెట్ ను, పంచనామాలను, ఎఫ్ఐఆర్ తో సహా అన్ని పేపర్లను, ఒకటికి పదిసార్లు చదివేవారు మల్లారెడ్డి గారు.చదవినప్పుడల్లా, కొత్త కొత్త ఆలోచనలు స్ఫురించేవనీ,ఆ కొత్త ఐడియాలు కేసు గతిని మార్చేసేవనీ, బాగా చదవడం వల్ల, కోర్టు హాలులో,సాక్షిని క్రాస్ చేస్తున్నప్పుడు,మాట మంత్రదండమై,ఏదో కనికట్టు చేసినట్లుగా,కేసు వీగిపోయేదనీ, అలా వందల కాంటెస్టెడ్ కేసుల్లో విజయం సాధించాననీ ఆయన చెపుతారు.గ్రామ సర్పంచ్ గా,అన్ని వర్గాలకు దగ్గరై, వాళ్ళ సహకారంతో,
 గ్రామాన్ని అభివృద్ధి చేశారు.
                   ఆయన వకీల్ వృత్తి చేసుకుంటూనే, పత్రికా ఎడిటర్ గా,లీగల్ కరస్పాండెంట్ గా, జర్నలిస్టుగా, ఎన్నో వార్తా కథనాలు రాసి,ఇటు అధికారుల్లో,అటు ప్రభుత్వంలో,చలనం తీసుకువచ్చారు.చివరికి కోర్టులకు సైతం చురకలు వేస్తూ,లీగల్ కరస్పాండెంట్ గా, సమాజం పట్ల తన వంతు బాధ్యతను నిర్వహించారు.అప్పట్లో ఆయన రాసిన "కల్లోల సీమలో న్యాయమూర్తుల కొరత" "సన్నగిల్లిన ఫోరం ప్రభావం"కథనాలు అందరినీ ఆలోచించేలా చేసాయి.
                   కోర్టు రణ భూమిలో వెయ్యి యుద్దాలు వెయ్యి విజయాలు....ఈ పుస్తకం గులాబీల మల్లారెడ్డి
గారి ఆత్మకథ.యువ న్యాయవాదులకు ఈ పుస్తకం ఒక కరదీపిక.వాళ్ళు తప్పకుండా చదవాల్సిన పుస్తకం.ఈ పుస్తకంలో,ఆయన దళితులు,పీడిత వర్గాల పక్షాన చేసిన వెయ్యి యుద్దాలు,ఆయన సాధించిన వెయ్యి విజయాలు తెలుసుకోవాలంటే, ప్రతి ఒక్కరూ ఆ పుస్తకాన్ని కొని చదవాల్సిందే.
 జనం...జనం...జనం...
 నా మనోవన



మంతా జనం....
               - జనమేవ జయతే.
                                            
కామెంట్‌లు