చివరికి మిగిలేది ||;-మచ్చరాజమౌళి దుబ్బాక 9059637442
నీ పుట్టుక గొప్పది ... 
నీ జాతకం మహా గొప్పది... 
అయినా, 
ఏమవుతావో తెలియదు 
ఏది నీదవుతుందో తెలియదు 
స్వార్థానికి పునాదులు తవ్వ్వుకుని 
మోసాలు, ద్వేషాలు ఇటుకలుగా పేర్చుకుని
శాశ్వతమనే భ్రమలో ప్రయాణం చేస్తున్నావు 

నువ్వు పెంచుకున్న ప్రేమలు నీవి కావు
నువ్వు తవ్వుకున్న నిధి నిక్షేపాలు నీతో రావు
వెలకందని సమాధిలో నువ్వెలిగిపోయినా ఎవ్వరికీ ఏమీకావు 
నిన్ను నువ్వే ఆత్మ ద్రోహం చేసుకుంటున్నావు 
అన్నీ నావేనన్న భ్రమలో

కాలం ఒడిలో 
కరిగిపోయే క్షణాలకు 
కొత్త రంగులు అద్దుకుంటూ
దేహాన్ని కప్పుకున్న శ్వాసకు 
చివరకు మిగిలేది ఏది..? 

నిద్రపోయిన దేహం
తెల్లారి లేసేంత వరకు తెలియదు
ఈ ప్రాణం నడుస్తోందని

గాలి ఆగిపోతే ఈ దేహం నీదికాదు
చలనం నీకు లేకపోతే మనిషివని అనిపించుకోవు
మల్లొస్తానని మరణమెప్పుడూ చెప్పి వెళ్ళదు
మనిషి లక్షణాలను మృగ్యం కానీయకు
గతాన్ని ముందరేసుకుంటే
నీవైన నాలుగు మంచి మాటలు నిలిచుండేలా చూసుకో... 

______


కామెంట్‌లు