గజ్జెలగుర్రం ;-డి.కె.చదువులబాబు.9440703716

 నందవరంలో ఉండే చంద్రయ్య వద్ద ఒక అందమైన గుర్రం ఉంది. ఆగుర్రం కాళ్లకు గజ్జెలు కట్టి నాట్యం చేయడం నేర్పాడు. అది గజ్జెలతో ఘల్లుఘల్లుమని శబ్ధంతో నాట్యం చేస్తుంటే చూడముచ్చటగా ఉండేది. పెళ్లిళ్లలో,పెద్దపెద్దతిరునాళ్లులోగజ్జెలగుర్రంతో నాట్యం చేయించడానికి చంద్రయ్యను పిలిచేవారు. అందుకుగాను చంద్రయ్యకు డబ్బులు ఇచ్చేవారు. 
అతనికి చందు అనే కొడుకు ఉన్నాడు. అప్పుడప్పుడు సెలవుదినాల్లో చందూను వెంట తీసుకెళ్లేవాడు చంద్రయ్య. చందు పెళ్లిళ్లు,జాతర్లలో చూడముచ్చటయిన గజ్జెలగుర్రం నాట్యం చూసి  ఆనందించే వాడు.
ఒకరోజు ఒకపెళ్లికి వెళ్లి ఇంటికి వచ్చేవేళకు సాయంత్రమయింది.గుర్రాన్ని కట్టేసి తండ్రీకొడుకులు అలసటతో మంచంపై వాలిపోయారు.వెంటనే నిద్రపట్టేసింది. కొద్దిసేపటి తర్వాత ఇంటిబయటనుండి ఎవరో గట్టిగా పిలుస్తుండటంతో లేచి వచ్చారు. ఇంటిముందు బారెడుగెడ్డం,మూరెడుమీసం ఉన్న ఒక పొట్టిమనిషి ఉన్నాడు. అతను చంద్రయ్యతో "అయ్యా!నాపేరు జడలయ్య. మాఇంటిలో మాతాతలకాలంనాటి నాలుగుగజ్జెలు ఒకరాగిచెంబులో ఉండేవి. ఏఉపయోగం లేని ఈగజ్జెలను తరతరాలుగా ఇంట్లో ఉంచుకోవడం ఎందుకు? అమ్మేద్దామనుకున్నాను. ఈ గజ్జెలను  మీగుర్రంకోసం మీరు కొంటారేమోనని వచ్చాను" అని చెప్పి గజ్జెలను తీసి చేతికిచ్చాడు. చంద్రయ్య వాటిని అటూఇటూ కదిలించాడు. అవి శ్రావ్యంగా, ఎంతోమధురమైన శబ్ధంతో మ్రోగాయి.వినసొంపైన ఆశబ్ధం ఎంతో ఆహ్లాదకరంగా అనిపించడంతో చంద్రయ్య వాటినికొని గుర్రంకాళ్లకు కట్టాడు .
"ఛల్... ఛల్... గుర్రం. గజ్జెలగుర్రం నాట్యంచెయ్!"అన్నాడు. లయబద్దంగా గుర్రం కదలసాగింది. 
"నాన్నా!నన్ను కొత్త గజ్జెల గుర్రంపైన ఎక్కించవా?" అన్నాడు చందు.వాడు అలా అడగటం, అప్పుడప్పుడు గుర్రంపై ఎక్కించి కళ్లెం గట్టిగా పట్టుకోమని చెప్పడం, అటూఇటూ తిప్పి కొద్దిసేపు తర్వాత కిందకు దింపడం మామూలుగా జరిగేదే. చందూకు గుర్రంమీద కూర్చొని ఆకాశంలో విహరిం చాలని కోరిక. గుర్రంమీద కూర్చోగానే ఎప్పటిలాగే"ఛల్…ఛల్…గుర్రం .గజ్జెలగుర్రం ఆకాశంలో ఎగురుదామా!" అన్నాడు. అంతే...గుర్రం గజ్జెలను ఘల్లుఘల్లున కదిలించి మెల్లిగా పైకి లేచింది. చందు ఆశ్చర్యంగా, ఆనందంగా క్రిందకు చూడసాగాడు. ఇల్లు,పచ్చనిచెట్లు చిన్నవిగా కనిపించసాగాయి. మనుష్యులు మరుగుజ్జుల్లా కనిపిస్తున్నారు. అందరూ విచిత్రంగా పైకి చూస్తున్నారు. గుర్రం ఊరును దాటింది. పచ్చనిపొలాలు పచ్చనిరంగు చల్లినట్లున్నాయి. చల్లనిగాలి ఆహ్లాదకరంగా చందూను తాకుతోంది. ఒక పావురంవచ్చి చందూ భుజంపై వాలి పలకరించి పోయింది. ఒకగద్ద చందూ తలమీద ఎగురుతూ పలకరించి వెళ్లింది. చందూకు కొద్దిదూరంలో అందమైన తెల్లకొంగలు బారులుగా ఎగురుతున్నాయి. క్రింద కొండలు, కోనలు, లోయలు, పచ్చనిచెట్లు,పారుతున్న నదులు,దుమికే జలపాతాలు ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తున్నాయి.గుర్రం మెల్లిమెల్లిగా పైపైకి పోతోంది.గుర్రం ఎగరడానికి మాయగజ్జెలే కారణం అనుకుంటూ చందూ "ఛల్... ఛల్... గుర్రం.నా చలాకి గజ్జెలగుర్రం" అంటూ ఆనందంగా ఆకాశంలో మేఘాలమధ్య ప్రయాణిస్తున్నాడు.కొన్ని మేఘాలు చందూను ముద్దాడి పోతున్నాయి. చందు ఎంతో ఆనందంగా మేఘాలమధ్య ప్రయాణిస్తున్నాడు.మనసు,శరీరం ఒకఅద్భుతమైన అనుభూతితో తేలిపోతోంది. కొద్దిసేపటి తర్వాత గుర్రం క్రిందకు దిగసాగింది. "క్రిందకు దిగొద్దు. క్రిందకుదిగొద్దు. ఇంకా కొద్దిసేపు ఆకాశంలో తిరుగుదాం"అంటూ చందూ కేకలు వేయసాగాడు.
ఎందుకలా అరుస్తున్నావంటూ నాన్న చందూను తట్టిలేపాడు. కళ్లుతెరిచి చూశాడు.నాన్న పక్కన పడుకుని ఉన్నాడు .అంతా కలని అర్థమయింది.
తన అందమైన కలగురించి నాన్నకు చెప్పాడు.
'"నాకు గుర్రుపై కూర్చొని ఆకాశంలో ఎగరాల
నుంది నాన్నా!' అనేవాడివి. ఆకోరిక నీలో బలంగా ఉండేది. మనసులోని ఆకోరిక నీకు కలగా వచ్చింది. నీకోరిక తీరింది" అన్నాడు చంద్రయ్య.
"నాన్నా!మళ్లీ ఇలాంటి కల రాదా!" అడిగాడు చందు.
"ఎందుకురాదూ!పడుకునేముందు కళ్ళు మూసుకుని నిద్రపట్టేవరకూ ఈకలను గుర్తుచేసుకుంటూ,నిద్రలోకి జారుకో. ఏదో ఒకరోజు మళ్లీ గజ్జెలగుర్రంపై ఎగురుతావు. ఈకోరికలాగే బాగా చదువుకుని ఉన్నతస్థాయికి చేరుకోవాలనే కోరికను బలంగా పెంచుకుని కష్టపడితే చదువనే గజ్జెలగుర్రంపై ఆకాశమంత ఉన్నతస్థాయిలో ప్రయాణిస్తావు"చెప్పాడు చంద్రయ్య.
 

కామెంట్‌లు