తెలుగు సాహిత్యంలో మెరసిన వజ్రం మడిపల్లి భద్రయ్య; -రాథోడ్ శ్రావణ్ ఉట్నూర్,ఆదిలాబాద్ జిల్లా. 9491467715
 (ఈ రోజు ప్రథమ వర్థంతి సందర్భంగా ..)
అ 0దమైన జిల్లా, గిరిజనుల ఖిల్లా,మన ఆదిలాబాదు జిల్లా మదిని మంత్రముగ్ధుల్ని చేసే అడవి అందాలు, ప్రకృతి రమణీయమైన ఆహ్లాదకరమైన సౌందర్య దృశ్యాలు, జలపాతాల అందాలు,
గలగల పారే సెలయేరులతో చూపరులను కట్టిపడేస్తున్న ఆదిలాబాదు.అదిలాబాద్ అంటేనే సాహిత్యం అటువంటి ఆదిలాబాదు జిల్లాలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత  డా.సామల సదాశివ మాష్టారు, గోల్కొండ కవిగా ప్రసిద్ధ చెందిన ప్రముఖ శతావధాని నేరెళ్య వేంకటాచార్యులు, వానమామలై వరద చార్యులు, ప్రముఖ తత్వకవి ఉదారి నాగదాసు,గుడ అంజయ్య, ఇలా ఎంతో మంది సాహితీ వేత్తలకు పుట్టినిల్లు. ఆ జిల్లాలో పుట్టిన మెడపల్లి భద్రయ్య తమ జిల్లా అంటే అమితమైన ప్రేమ. జిల్లా అంతటా తిరిగి అనేక పాటలు, పుస్తకాలు రాస్తూ సాహితీ రంగంలో అంచెలంచెలుగా ఎదిగి ఉమ్మడి జిల్లా కవులలో ప్రథమ వరుసలో స్థానాన్ని సంపాదించుకున్నారు. 
జిల్లంటే జిల్లా కాదో జిల్లా ఆదిలాబాదు జిల్లా జిల్లా
ఆదిలాబాదు జిల్లా జిల్లా అడవుల తల్లి జిల్లా జిల్లా
ఆదిలాబాదు జిల్లా జిల్లా అందమైన జిల్లా జిల్లా
ఒక్కప్పుడు ఈ పాట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చాలా హాల్ చల్ చేసింది. జిల్లంటే జిల్లా కాదోయ్ జిల్లా ఆదిలాబాదు జిల్లా జిల్లా అంటు గీతాన్ని రచించింది ఎవరో కాదు,  మన 
ఉమ్మడి జిల్లా సాహితీ సౌరభం,  జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత, రిటైర్డ్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, సాహితీ రత్న బిరుదు అంకితులైన స్వర్గీయ మడిపల్లి భద్రయ్య గారు.
మడిపల్లి భద్రయ్య  గారు తెలంగాణ సాహితీ సౌరభం, తెలంగాణ సాహితీ చైతన్యామూర్తి, ప్రముఖ కవి, రచయిత,మధుర గాయకుడు సమాజ సేవకుడు, తెలంగాణ ఉద్యమకర్తగా వివిధ సామాజిక, సాహితీ, సాంస్కృతిక రంగాలలో క్రియాశీలకమైన పాత్ర పోషించిన బహుముఖ ప్రజ్ఞాశాలి. చదువుల తల్లి సరస్వతీ దేవి కొలువైన నిర్మల్ జిల్లా శాస్త్రినగర్ లో 17 జనవరి 1945 లో శ్రీమతి/ శ్రీ మడిపల్లి వీరయ్య, గంగమ్మ దంపతులకు జన్మించారు.వీరి ధర్మపత్ని పేరు శ్రీమతి ఇందిర గారు.
విద్యాభ్యాసం:-
ప్రాథమిక విద్యా తండ్రి గారి వద్ద నేర్చుకున్నారు. వీరిది మధ్య తరగతికి చెందిన నిరుపేద కుటుంబం. చదవే స్తొమత లేకపోవడంతో తన
తండ్రి గారి ఆశీస్సులతో 
తెలుగు భాషా మీద ప్రేమను పెంచుకొని మూడో తరగతి నుండే పాటలు, గేయాలు పద్యాలు, కంఠస్థం చేసి ధారాళంగా పాడేవారు. ఇలా తెలుగు భాషా మీద పటుత్వాన్ని సంపాదించి పద్యాలు రాసే స్థాయి వరకు ఎదిగాడు.ఉన్నత విద్యా నిర్మల్, కోరుట్లలో చదువుకున్నారు.వీరి గురువు గారి పేరు దాస్యం సేనాధిపతి.
చదవు మీద ఆసక్తితో పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత  ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసి 1962లో ఉపాధ్యాయ వృత్తిలో చేరారు.1965లో పి.యు.సి ఉత్తీర్ణులై 1968లో బి.ఏ డిగ్రీ పూర్తి చేసాడు.1969లో తెలుగు సహోపాధ్యాయునిగా పదోన్నతి పొంది, ఆ తర్వాత గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ‌ గ్రామీణ,పట్టణ ,ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న పాఠశాలల్లో అంకిత భావంతో విధులు నిర్వహిస్తు, సహోపాధ్యాయునిగా, ప్రధానోపాధ్యాయునిగా 
సేవలందిస్తు 2001లో పదవీ విరమరణ పొందినారు.
కుటుంబ నేపధ్యం:-
భక్త కవి మడిపల్లి గారి ఆరాధ్య శైవ కుటుంబం.గురు సాంప్రదాయం, వీరి తండ్రి ,తాత గారికి శిష్యులు ఉండేవారు. వారికి ధార్మిక విద్య బోధనలు చేస్తు జీవనం గడిపే వారు.తెలుగు భాషా సాహిత్యానికి విశేషంగా సేవలందిన మడిపల్లి సాహిత్యం తన కుటుంబానికి వారసత్వముగా వచ్చిన సంపద అని చెప్పేవారు.భద్రయ్య ఇందిర దంపతులకు నాలుగురు కుమారులు రాజశేఖర,హరిహరనాథ్, విజయకుమార్,సాయినాథ్ నలుగురు కోడళ్ళు భారతి,శైలజ, ప్రవీణా,మమత మొదలగు వీరి కుటుంబం.  మడిపల్లి రాజ్ కుమార్ సాహితీ రంగంలో రాణిస్తున్నారు.
సాహితీ సేవ:-
విద్యార్థి దశ నుండే సాహిత్యంలో అభిరుచి కనబర్చేవారు.సాహితీ, సాంస్కృతిక, సామాజిక, సేవాకార్యక్రమాలలో వీరికి మక్కువ ఎక్కువ.వీరు 1300 'కంద' పద్యాలు ఏక ఛందంలో రాసినారు. దేశభక్తి గేయాలు, దేశ భక్తిగీతాలు, కథలు, పాటలు, నాటకాలు, వచన కవిత్వాలు రచించారు.తెలంగాణ భాష,యాస ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులు మాట్లాడే సరళమైన, వ్యావహారిక భాషలో నిఘంటువుతో పాటు అనేక సంకలనాలు వెలువరించారు. భక్తకవి కావడంతో  ఆధ్యాత్మికతకు సంబంధించిన అనేక రచనలు, భక్తి గీతాలు, హరికథలు, ఒగ్గు కథలు,
 భక్తి గ్రంథాలు లిఖించారు.తన జీవిత కాలంలో కొన్ని వేల మంది విద్యార్థుల భవిష్యత్తును
 తీర్చిదిద్ది వారి గుండెలో చిరస్థాయిలో నిలిచారు. మెడిపల్లి గారు రచించిన గ్రంథాలు
1998లో శ్రీ షిర్డీ సాయి త్రిశతి అను పేరుతో  వెలువరించిన తొలి భక్తి గ్రంథము. 2001లో‌ బాసరలో కొలువైన చదువుల తల్లి సరస్వతీ దేవి పేరుతో "శ్రీ జ్ఞాన సరస్వతీస్తవం వెలువరించారు. సాయి భక్తులు కావడంతో 2002లో షిర్డీ సాయి భజనావళిని రచించారు. 2003లో శ్రీ మేహెర్ భక్తి గీతావళి,2004లో శ్రీ సత్యసాయి స్తుతి,2005లో నాలోని నాదాలు,2006లో శ్రీ సాయి త్రిశతి,2006లో శ్రీ శివ భక్త చరితమ్, చంపువు పద్య కావ్యం వెలువరించారు.2007లో మనోవేదన (పద్యసప్తశతి )2008లో మన ఆదిలాబాదు పేరుతో జిల్లా సమగ్ర దర్శిని పుస్తకాన్ని ఆవిష్కరించడంతో అనేక కీర్తి ప్రతిష్టలు పొంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఆదిలాబాద్ జిల్లాకు సాహిత్యంలో ప్రత్యేక స్థానాన్ని తీసుకొని వచ్చిన ఘనత వారికే దక్కింది.2010లో శ్రీ హరి లీలలు,2011లో నిరసన గొంతుక,2011లో శ్రీ ప్రభాకర్ మహారాజ్ స్మృతిలో, 2012లో శ్రీ శివలీలలు,2012లో శ్రీ షిర్డీ సాయి చరితమ్ హరికథా రూపంలో తీసుకొచ్చారు.2013లో కర్తవ్యం, 2013లో మనోవిలాసం,2016లో శ్రీ యాదగిరి లక్ష్మి నారసింహ శతకము,2017లో శ్రీ సరస్వతీ స్తుతి భక్తి గీతాలు, 2017లో వాస్తవాలు కాస్త,2018లో శ్రీ షిర్డీ సాయిస్తవన మంజరి, మరాఠీ నుండి తెలుగు లో అనువాదం చేశారు.2018లో శ్రీ శ్రీనివాస శతకం,2019లో మన భాష- మన యాస ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా వ్యావహారిక భాషా పదకోశము‌ రాసి తెలంగాణ తెలుగు భాషకు జీవం పోశారు,2019లో శ్రీ వాసర జ్ఞాన సరస్వతీ స్తవం,2019 లో శ్రీ రామ చరితమ్  బాలకాండ, 2019 లో బ్రతుకు బాట కు సంబంధించిన ఆత్మీయ శతకం పూర్తి చేసారు.దానితో పాటు "అక్షర గానాలు" అన్నదాతకు చేయుత, శ్రీ షిర్డీ సాయి శరణమును రచించినారు. మన  రాష్ట్రా ప్రభుత్వాల పథకాల పైన సిడిలు రూపొందించి  
విడుదల చేసాడు.ఇంకా అతను రచించిన పుస్తకాలు అముద్రితాలుగానే ఉండిపోయింది. 
పురస్కారాలు:-
ఆదిలాబాదు జిల్లాలో ఏ మారుమూల ప్రాంతాల్లో విధులు నిర్వహించిన అంకితభావంతో విధులు నిర్వహిస్తు,కుటుంబ సపరివారంతో సహా స్థానికంగా నీవాసము ఉండి విద్యార్థులకు నాణ్యమైన, గుణాత్మకమైన, సామర్థ్యధార, కృత్యాధార, నైపుణ్యాలతో విద్యాను బోధించేవాడు.వీరు బోధనా రంగంలో చేస్తున్న సృజనాత్మక కృషిని మరియు సాహితీ రంగంలో చేస్తున్న కృషిని గుర్తించిన జిల్లా అధికారులు, రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా 1983 లో ఎంపిక చేసి సత్కరించింది. ఆ తర్వాత 1988లో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా,1997లో జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపిక చేసి సత్కరించారు. తెలుగు సాహిత్యంలో వీరు చేస్తున్న కృషిని గుర్తించిన తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాదు వారు కీర్తి పురస్కారం తో సత్కరించారు.2015 జూన్ 02న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఆదిలాబాదు జిల్లా నుంచి ఉత్తమ సాహితీవేత్తగా ఎంపిక చేసి పురస్కారంతో సత్కరించింది. రంజని తెలుగు సాహితీ సమితి వారు 2015లో విశ్వనాథ పురస్కారం అందజేశారు,2015లో బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవస్థానం వారి ఆధ్వర్యంలో ప్రముఖ సాహితీవేత్త పురస్కారము,2015లో భారత సాంస్కృతిక అకాడమీ వారు కళాశిరోమణి పురస్కారం,2017లో తేజ ఆర్ట్స్అండ్ క్రియేషన్స్ హైదరాబాదు వారు తెలంగాణ రాష్ట్ర స్థాయి తేజ సాహితీ పురస్కారం ప్రదానం చేసారు.
స్థాపించిన సాహితీ సాంస్కృతిక సంస్థలు:-
ఉమ్మడి జిల్లా ఆదిలాబాదులో
పలు మండలాల్లో సాహితీ సాంస్కృతిక సంస్థలను స్థాపించి, సాహితీ సాంస్కృతిక చైతన్యం కొసం కృషి చేసాడు.అందులో  జన్నారం మండలంలో  మిత్రకళాసమితి, ఇచ్చోడ మండలంలో  ప్రత్యూష కళా నికుంజం, ఉట్నూర్ మండలంలో ఆంధ్రపద్యకవితా సదస్సు, నర్సాపూర్ (జి) నవతా కళా సమితిని స్థాపించాడు.సాహితీవేత్తగాను 
తన జీవిత కాలంలో తనదైన ముద్రను వేసి ఎంతో మంది కవులను రచయితలను ప్రోత్సహిస్తూ గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సాయి భక్త కవి మడిపల్లి భద్రయ్య గారు  18 సెప్టెంబర్ 2021న ఈ లోకం నుండి నిష్క్రమించాడు.


కామెంట్‌లు