జోలపాట;-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
తొలుత బ్రహ్మాండమును తొట్లెగా చేసీ
నాల్గువేదాల త్రాడు వ్రేలాడదీసీ 
వటవృక్షపత్రాలు పాన్పుగా పరిచీ
ప్రియమార నిన్ను పవళింపజేసితీ
మారాముజేయక పడుకోర కృష్ణా!!

శ్రావ్యముగ వేదాలు బ్రహ్మ వల్లించగ
వాణి మాతల్లి వీణవాయించగ
నారదా తుంబురులు గీతమాలాపించ
సనకసనందనులు నిన్ను కీర్తించగ
మారాము జేయక పడుకోర కృష్ణా!!

పాలసంద్రముపైన పవళించినావు
శ్రీలక్ష్మి నీపాద సేవ జేయంగ
శంఖచక్రగదా దివ్యహస్తాల ధరియించి
అభయహస్తము మాకు అందించినావు
మారాము జేయక పడుకోర కృష్ణా!!

ఏడుకొండలనెక్కి నిలుచుండినావు
శ్రీదేవి భూదేవి ఇరుప్రక్కలుండగ
గరుడ హనుమలు నీ సేవజేయంగ
భక్తితో నినుజూచి మేము కైమోడ్పులిడగ
మారాము జేయక పడుకోర కృష్ణా!!


కామెంట్‌లు