కాళోజీ సమ్మోహనాలు ;-ఎం. వి. ఉమాదేవి. బాసర
(ముక్తపదగ్రస్తం )
ఖలేజా కాళన్న 
కాళ రుద్రుడయెన్న 
రుద్రుడే ప్రజలకోసంగాను ఓ వనజ !

సంచిలో సమస్యలు 
సమస్యల జవాబులు 
జవాబుగ తానయ్యి పనిచేసె ఓ వనజ !

తానౌ కార్యశీలి 
కార్యాలయం మజిలి 
మజిలీతొ మనకొరకు ప్రశ్నిoచె ఓ వనజ !

ఏ భాషరా నీది 
నీ వేష మేమిటిది 
ఏమిటని గర్జించి చావుమనె ఓ వనజ !

అమ్మభాషను పలుకు 
ఆంగ్లమేల కులుకు 
కులుకులే మానుమని కోపించె ఓ వనజ !

ఉద్యమం తనబాట 
బాటలో ప్రతి పూట 
పూటపూటకు బైట తిరిగేను ఓ వనజ !

తెలంగాణా బిడ్డ 
బిడ్డ పోరుకి అడ్డ 
అడ్డాగ తనకలం యోగించి ఓ వనజ !

సామాన్య వేషమ్ము 
వేషమున రోషమ్ము 
రోషంతొ ప్రశ్నలను సంధించు ఓ వనజ !

నిజాం నాటిది పోరు 
పోరు మహ సలిపేరు 
సలుపునే సమస్యల కోసమే ఓ వనజ !

పురస్కారం కోట 
కోట వినయం నోట
నోటనే తెలగాణ యాసలే ఓ వనజ !

కాళన్న యాదిలో 
యాదిమరి గాథలో 
గాథతానై నిలిచే తన  గొడవ ఓ వనజ !


కామెంట్‌లు