రామవరం ఉన్నత పాఠశాలలో వాసు 9వ తరగతి చదువుతున్నాడు. చదువులో అంతంత మాత్రంగానే చదువుతాడు. స్నేహితులతో ఆటపాటలు, ఇంటికి వస్తే సెల్ ఫోనుతో గంటల తరబడి కాలక్షేపం. అదే పాఠశాలలో వాసు చెల్లెలు శ్రావణి 6వ తరగతి చదువుతుంది. చిన్నప్పటి నుంచి తన తరగతిలో తానే మొదటి ర్యాంకు వచ్చేది. తరగతిలో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను చాలా శ్రద్ధగా వినడం, తోటి స్నేహితులను చదువులో ప్రోత్సహించడం, ఇంటికి వచ్చాక పరిమిత సమయం ఆటలకు కేటాయించడం, ఆ తర్వాత హోం వర్క్ చేసుకోవడం, తీరిక సమయాల్లో నానమ్మతో కథలు చెప్పించుకోవడం శ్రావణికి నిత్య కృత్యాలు. "ఒరేయ్ అన్నయ్యా! బుద్ధిగా ఇంటిపట్టున ఉంటూ చదువుకోరా! చెడు స్నేహితులను వదిలి పెట్టు. సమయాన్ని వృథా చేయకుండా బుద్ధిగా చదువుకో." అని చెప్పేది శ్రావణి. వాసు వినేవాడు కాదు.
శ్రావణికి ప్రతిరోజూ దినపత్రికల్లో వచ్చే జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు నోట్ బుక్ లో నమోదు చేసుకోవడం అలవాటు. బాలల దినోత్సవం సందర్భంగా క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నారు. 6 నుంచి 10 తరగతుల విద్యార్థుల్లో ఆసక్తి ఉన్నవారు పాల్గొనవచ్చు. రెండు రోజుల ముందుగానే పాల్గొనే వాళ్ళ పేర్లు రాసుకొని, జట్లను చేశారు. శ్రావణి తాను పాల్గొంటానని పేరు ఇచ్చింది. చెల్లెలు పాల్గొని తాను పాల్గొనకపోతే బాగుండదని అనుకొని తానూ పేరు ఇచ్చాడు వాసు. కానీ అన్నా చెల్లెళ్ళు వేరు వేరు జట్లలో ఉన్నారు. ఇంటికి వెళ్ళాక చెల్లెలు తాను రాసుకున్న జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలను అన్నకు ఇచ్చి చదవమన్నది. రెండు రోజులు అన్నయ్యతో కలిసి బాగా అభ్యాసం చేసింది.
క్విజ్ పోటీ మొదలైంది. వాసు ఉన్న జట్టులో వాసు స్నేహితుడు శ్రీకాంత్ కూడా ఉన్నాడు. చాలా వరకు జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలను అడిగారు. ఆశ్చర్యం చెల్లెలు రాసుకున్న చాలా ప్రశ్నలు కలిశాయి. కానీ ఏం లాభం? చెల్లెలు చెబితే వినడమే కానీ, ఆ జవాబులు సరియైనవో కావో వాసుకు అనుమానంగా ఉంది. ప్రతి ప్రశ్నకు తనకు సమాధానం తెలిసినా తన జుట్టు సభ్యులతో చర్చ ద్వారా శ్రీకాంత్ చెప్పిన సమాధానాలు సరియైనవి అనుకొని అవే చెప్పాడు ఆ జట్టు నాయకుడు అయిన వాసు. చెప్పినవి అన్నీ తప్పు అవుతున్నాయి. అయినా పూర్తిగా శ్రీకాంత్ మీదనే ఆధారపడుతున్నాడు వాసు. చివరికి శ్రావణి తెలివి తేటల మూలంగా శ్రావణి ఉన్న జట్టు గెలిచింది. శ్రావణి జట్టు నాయకుడు రాము శ్రావణికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. అందరూ శ్రావణి తెలివి తేటలకు ఆశ్చర్యపోయారు. అన్నను ఓడించిన చెల్లెలు అని కొందరు చెప్పుకుంటూ ఉంటే వాసుకు అవమానం అనిపించింది.
మరునాడు శ్రీకాంత్ "ఒరేయ్ వాసు! ఆడుకుందాం రా!" అన్నాడు. "నేను ఈరోజు నుంచి ఆటలకు రాను. ఇష్టపడి చదువుకుంటా." అన్నాడు వాసు. ఇంటికి వెళ్ళాక సెల్ ఫోన్ మాట్లాడుతున్న చెల్లెలు "ఒక్క ఐదు నిమిషాలు ఆగు అన్నయ్యా! కాల్ పూర్తి అయ్యాక నీకు ఇస్తాను." అన్నది శ్రావణి. "వద్దులే చెల్లీ! ఈరోజు నుంచి బుద్ధిగా చదువుకుంటా." అన్నాడు వాసు. ఇంట్లో వారంతా సంతోషించారు. వాసు ఉత్తమ విద్యార్థిగా పేరు తెచ్చుకుంటూ శ్రీకాంతును కూడా మార్చినాడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి