చిట్టి ;- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 తళతళ మెరువులు
మెరుస్తుండగా 
దడదడ ఉరుములు
ఉరుముతుండగా
చిటపట చినుకులు
రాలుతుండగా
దబదబ వర్షం
కురుస్తుండగా
జలజల నీళ్ళు
పారుతుండగా 
సలసల మనసు
మరుగుతుండగా 
మలమల కడుపు
మాడుతుండగా
నకనకలాడే
కడుపు చూసుకుని
జరజర ముందుకు
జరిగెను చిట్టి!
బిరబిర నడిచి
డబ్బా తెరిచి
మురుకు తెచ్చిన
అమ్మను చూసి
చరచర ముందుకు
నడిచెను చిట్టి!
కరకరలాడే
మురుకును చిట్టి
కసకస కొరికి
పరపర నమిలి
బరబర మింగి
హాయిగ చూసింది!
కణకణలాడే
నిప్పుల లాంటి
కోపం కాస్తా
జరజర జారింది!
కువకువ పిట్టల
పాటలు వింటూ
కళకళలాడే
చిట్టి కన్నులు
మిలమిల మెరవగ
కిలకిల నవ్వింది!
చిట్టి నవ్విన
నవ్వుకు కొంచెం
బుసబుస బుగ్గల
బూరలు పొంగాయి!
వేడి నిప్పుయే
చల్లని మంచుగ
మారిన తీరుకు
అంతా ఆనందించారు !!

కామెంట్‌లు