పిల్లలంతా చందమామకు
తనయలేనేమో!
కన్నులలో
వెండిపూల వెన్నెలలు కురుస్తాయి
మోములో
మెరుపుల వెలుగులుంటాయి
నవ్వులతో
ముత్యాలు రువ్వుతారు
మాటలతో
తేనెపూలు జల్లుతారు
పిల్లలు పలకరిస్తే
పారిజాతాలు పలకరిస్తున్నట్లుగానే వుంది
పిల్లలు నవ్వుతుంటే
సుస్వరరాగాలు మేళవిస్తున్నట్లుగానే వుంది
పాప నడుస్తుంటే
మహాలక్ష్మి చిట్టిపాప అయి
నట్టింట్లో నర్తిస్తున్నట్లుగానే వుంది
బాబు ఆ తలుపు వెనుక నక్కితే
ఆ చిన్నికృష్ణయ్యే మనతో
దోబూచులాడుతున్నట్లుగానే వుంది
ఇంట్లో పిల్లలు ఉంటే
ఋతువులన్నీ మదిలో
విరబూసినట్లుగా
ఆనందంగానే వుంది
అమ్మానాన్నల కనుదోయిలో
పిల్లలు అనంత కాంతి కిరణాలు !!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి