"ఆత్మదర్శనం"తో ఆనందం;-- యామిజాల జగదీశ్
 ఇటీవల నేను చదివిన పుస్తకాలలో ఒకటి - ఆత్మదర్శనం! 176 పేజీల ఈ పుస్తకం వినూత్నమైంది. ఎందుకంటే రాసింది టైప్ చేసి ముద్రించిన పుస్తకం కాదిది. రచయిత రీసాగారి చేతిరాతతో చూడముచ్చటగా ముద్రితమైన పుస్తకమిది. 
స్వయం అద్దంలో చూస్తూ సాక్షిలా రాసిన సరదా పుస్తకమని చెప్తూనే అవసరం ఉన్న వారికి తక్షణమే పని చేసి గుణాత్మకమైన మార్పుకు నాంది పలుకుతుందన్న రీసాగారి మాట అక్షరసత్యం. 
ఆత్మ అనే పదాన్ని socalled గురువులు చెప్తున్న పరిభాషలో చూడక తనదైన ధోరణిలో చెప్పిన భావాలన్నీ ఆసక్తికరంగా ఉన్నాయి పేజీ తిప్పే కొద్దీ.
అవసరమనుకున్న చోట అర్థవంతమైన బొమ్మలు గీసిన రీసాగారి ఆలోచనా దృక్పథం అన్ని విధాల ఆకట్టుకుంది. 
ఈ పుస్తకంలో చెప్పినవన్నీ నాకు నేను చెప్పుకుంటున్నవి లేదా ఆకాశానికి చెప్తున్నట్లు భావించండి అని రచయిత చెప్పుకుంటే చెప్పుకోవచ్చు. కానీ పది మందికీ ఉపయోగపడే పుస్తకం. చదువుతున్న కొద్దీ ప్రశ్నించుకునేలా 
చేసే  పుస్తకమిది. 
డైనోసార్లు, పైరేనియన్ ఐబిక్స్ లు
అంతరించిపోయాయని తెలుసు
"చేతిరాత" కూడా దాదాపు 
అంతరించిపోయిందని తెలుసా? 
నా చేతిరాత పుస్తకాలు
ఈ generation చివరి Speciesలు 
- అనే మాటలతో ముగిసిన ఈ పుస్తకంలో ప్రతి పేజీ ప్రధానమైనదే. (ఈ మాట చదువుతుంటే ఒకానొకప్పుడు బాగున్న నా చేతిరాత వంకర్లు పోవడం తలచుకుని బాధపడుతున్నా. కంప్యూటర్ వాడకంతో నా చేతిరాత దెబ్బతింది.
బలవంతంగా రోజూ ఒకటీ అర పేజీ రాస్తున్నా అక్షరాలు కుదురుగా ఉండటంలేదు).
చివరగా...
ఈ రాస్తున్నవాడు....చదివే మీరు ఒక్కటే అని...రాస్తున్న వాడు మీకే విధమయిన సలహాలు ఇవ్వడం లేదనీ...తనకు రాయడం సరదా కాబట్టి రాస్తున్నాడనీ ...నవ్వుతూ సరదాగా తెలుసుకో అని 169వ పేజీలో చెప్పిన రచయిత అభిప్రాయం అదైనప్పటికీ పుస్తకం చదువుతుంటే ప్రతి పేజీ నుంచీ ఆయన మాటలు మనసులోకి పోయి మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తాయి. 
ఆలోచన మనిషిని ప్రకృతికి దూరంగా జరిపి అంతులేని బాధకు దగ్గర చేస్తుందన్న రీసాగారి భావంతో ఏకీభవిస్తున్నాను. ఎంత ఎక్కువగా ఆలోచిస్తాడో అంత ఒంటరిగా మిగిలిపోతాడు మనిషి అన్నది నిజం! నిజం!!
"ఈ పుస్తకాన్ని తీరిక దొరికినప్పుడల్లా - అప్పుడప్పుడూ అట్లా... అట్లా...సరదాగా చదివేయండి" అని అన్నారు గానీ కొన్ని చోట్ల మరొక్కసారేమిటీ మళ్ళా మళ్ళా చదివించేలా చేస్తున్నాయి ఇందులోని భావాలు. 
మొదటి కొన్ని పేజీలలో కొందరి గురించి రాస్తూ వారి చిత్రాలనూ సమర్పించారు తన కుంచెతో. 
మా తాతలు శ్రీ రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, నీమ్ కరోలి, రూమీ, తట్ వాలే బాబా, బుచ్చారెడ్డి....వీళ్ళున్నంత వరకూ spirituality ఎంతో honest గా ఉండేది. Now it got corrupted to the core. Now spirituality is sugar coated business bluff biscuit....అంటూ 38వ పేజీలో చెప్పిన రీసా గారి మాటలను కాదనలేనుగా?!
అజ్ఞాన తెరలు తొలగడానికి ఆత్మదర్శనంలోంచి కొన్ని మాటలు యథాతథంగా ....
"ఏది ఏమయినా
అందరూ ఆత్మదర్శనాన్ని చేసుకోవాలి. చేరుకోవాలి. ఎంతమందికి చేస్తాడు ఒక డాక్టర్ సర్జరీలు? 
ఏ గురువు సమస్త మానవాళిని చేయగలడు విముక్తి? 
ఆత్మదర్శనమంటే ..... ఎన్నటికీ చెదరని ప్రశాంతత, ఆనందం, awareness
ఎప్పటికీ ఆగని ఒక ప్రవాహాన్నీ నీలో నీవే గుర్తించే ఒక ART
.......
గాఢ నిద్రలో ... ప్రతి ఒక్కరూ ...
జ్ఞానోదయం పొందిన బుద్ధుళ్ళే.
.........
ఒంటరితనం అహంకారానికి ప్రతీక. ఏకాంతం అనుభవానికి ప్రతీక.
Half hearted thought యొక్క destination - ఒంటరితనం. Being realized the essence of thought - ఏకాంతం.
..........
ఒక్కసారి "పోలిక" అనే పదాన్ని జీవితం నుంచి తీసేసి చూడండి....నీ అస్తిత్వం సంశయంలో పడుతుంది.....ఎంత పోల్చుకుంటే అంత అలసట, పరుగు, Ego.
..........
జ్ఞానోదయం అంటే సంఖ్యకి ఆవల అడుగు పెట్టడం. అంతే...just step out the realm of " NUMBERS " అంతే.
.........
ఇలా ఎన్నని చెప్పడం...ఎక్కడికక్కడ
నూటికి నూరు మార్కులు వేసుకుంటూ పోయాను రీసాగారి థాంట్స్ కి !
..….....
టోటల్ గా నన్ను కట్టిపడేసాయి
ఆయన భావాలు!
టోటల్ గా నన్ను కట్టిపడేసింది
ఆయన చేతిరాత!
టోటల్ గా నన్ను కట్టిపడేసింది
ఆయన ఆవిష్కరించిన ఆత్మదర్శనం!
ఓ మంచి పుస్తకం చదివానన్న అనుభూతి కలిగింది!
తొందరపడి పేజీలు తిప్పేసే పుస్తకం కాదిది. 
చదవాలి...ఆలోచించాలి...అవగాహన చేసుకోవాలి...అప్పుడే అందం చందం మనసుకి...రీసాగారికి కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు!!కామెంట్‌లు