గులాబీల మల్లారెడ్డి కలం నుండి జాలువారిన "పల్లెపొలిమేరల్లో "కవితా సంపుటిలోని ఎవరన్నారు కవితపై విశ్లేషణా వ్యాసం. ఎవరన్నారు కవిత శీర్షిక చదవగానే నన్ను ఆలోచింపజేసింది. ఇందులో ఏదో మతలబు ఉంది. మల్లారెడ్డి ఆషామాషీగా ఏది పడితే అది రాసే వ్యక్తి కాదు. ఆయన నిబద్ధతగల వ్యక్తి. విద్యార్థిదశనుండి కవిత్వాన్ని ఔపోషణ పట్టాడు. కమ్యూనిజం భావజాలాన్ని హృదయం నిండారా పుణికి పుచ్చుకున్న వ్యక్తి. ఆయన రాసిన తొలి కవితా సంపుటి " పల్లె పొ లి మేర ల్లో" కవితల్లోని భావాలు ,భావ వ్యక్తకరణ యువకుడిగా ఉన్నప్పుడు ఆయన ధార ఉప్పొంగే కెరటాల్లా భావజలది ఎంతో అద్భుతం. నాకు నచ్చింది. సమాజంలోని అసమానతలను అడుగడుగునా చూసి ఆవేదనతో ఆర్తితో తన గుండెలో రగులుతున్న ప్రకంపనలను అలవోకగా ఆవేశంగా వ్యక్తం చేసిన తీరు నన్ను అబ్బురపరిచింది. "ఎవరన్నారు.
మీరు మంచివారు కాదని?" ప్రశ్నించడంలోనే సమాధానం దాగి ఉందని నాకు అనిపిస్తుంది. ఈ అసమ సమాజంలో కూడా మంచివారు ఉంటారని అని నమ్మిన వ్యక్తి. మంచి కోసం పాటుపడుతున్న మంచి వారి గురించి మాట్లాడే దమ్ము ధైర్యం ఎందరికి ఉంటుంది. అలాంటి మంచి కొరకు పాటుపడే మహనీయులు ఉంటారని మనకు మల్లారెడ్డి ఎవరన్నారు కవిత చదివితే తెలుస్తుంది. ఎవరన్నారు కవిత మనలో ఆలోచనల తరంగాలు రేకెత్తిస్తుంది. మనలో మరుగుపడిపోయిన మంచితనం ప్రేరేపించే భావనలు కలిగిస్తుంది. ఎంతమంది మంచి గురించి మాట్లాడుతున్నారు. మంచి గురించి పాటుపడుతున్నది ఎవరు? మనసా వాచా కర్మణా మంచితనం పునాదులు కదిలాయో ఏమో అని ఆలోచిస్తున్న తరుణంలో ఒకపరి మన మనసులను మంచితనం కెరటాలపై తేలియాడ జేస్తుంది వారి కవిత. అద్భుతం. ఇవ్వాల మంచితనం విలువల గురించి తెలియజేసే గ్రంథం మన భారతీయ ఇతిహాసంలో వాల్మీకి విరచిత శ్రీమద్రామాయణం. రామాయణంలో మంచితనం విలువలు కావ్యం నిండా మనకు పంచిపెట్టాడు. లక్షల సంవత్సరాల కింద రాయబడినప్పటికీ అందులోని విషయాలు మంచితనం కోరుకునే వారికి శిరోధార్యాలు. ప్రపంచ చరిత్రలో ఏ కావ్యం అంత చక్కగా అంత గొప్పగా రాయబడలేదు.రామాయణంలోని నీతిని నేటికీ మనం కొనియాడుతున్నాం. మంచి ఎక్కడున్నా మనం స్వాగతించాలి. "మీలో మంచితనం జల లేదని." వాల్మీకి మహర్షి రచించిన రామాయణంలో మంచితనం జల పుష్కలంగా ఉందని కావ్యం చదివితే తెలుస్తుంది. మంచితనం మానవీయ విలువలకు తిలోదకాలు ఇచ్చిన ఈ రోజుల్లో మంచితనం జలను గూర్చి గుర్తుచేస్తూ కమ్యూనిజం భావవ్యాప్తితో ఎవరన్నారు కవిత ద్వారా మనకు సందేశాన్ని మల్లారెడ్డి అందజేస్తున్నాడు. మీలో మంచితనం జలలేదని ప్రశ్నిస్తున్నాడు. మంచితనం జలకొరకు ఆరాటపడుతున్న తపన ఉంది. చెరువుల వద్ద వాగుల వద్ద కుంటల వద్ద ఉసికెను తోడితే నీటి జల ఉబికి పొంగి వస్తుంది. ఆ నీటిజలను చెలిమే అంటారు. ఆ చెలిమే నీరు తీయగా కమ్మగా ఉంటుంది. అమృతం గోలినట్లుగా మధురంగా ఉంటుంది. మళ్లీమళ్లీ ఆ నీటిని తాగాలనిపిస్తుంది. అక్కడ చుట్టుపక్కల పొలాలు చేనులు చెలకల్లో పనిచేసే కూలి జనాలు రైతులు చెలిమే వద్దకు చేరి కమ్మని నీరు తాగుతారు. మరియు కడవల్లో కుండల్లో చెంబుల్లో నీరు తీసుకుపోతారు. మృగ్యమైపోయిన మంచితనం జలను మళ్లీ మనుష్యుల వ్యక్తిత్వాల్లో మరియు అరమరికలు లేకుండా కలిసిమెలిసి ఉండే పల్లె జనుల ముఖాల్లో పోరాడే మంచితనం జలను చూస్తున్న అభ్యుదయ వాది మల్లారెడ్డి. "మీ గుండెలోతులు తెగలేదని." మంచితనం గుండెల్లో గూడు కట్టుకొని ఉంటుందని మనందరికీ తెలుసు. మనలో మూసుకుపోయిన గుండెలోతులు తెగలేదని ఆవేదన చెందుతున్నాడు. "మీ ఎదల్ని కావలసినంత సై కట్టలేదని?" ఎద అంటే మనసు, హృదయం, అని నిఘంటువు అర్థం. మీ మనసు పొరల్లో దాగి ఉన్న మంచితనం కావాల్సినంత పదును పెట్టలేదని అంటున్నాడు. మనిషి మనసు చంచలమైనది. ఎటుపడితే అటు తిరిగి కోతి లాంటిది. కోతి ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మ పైకి ఎగురుతుంది. ఎక్కడ కుదురుగా ఒక క్షణం కూడా ఉండదు. కోతులు అడవుల్లో ఉంటాయి. అడవుల విధ్వంసం నరికివేత కారణంగా కోతులు మనుషులు నివసించే జనావాసాల్లోకి వలస వచ్చాయి. కోతులు ఇప్పుడు నగరాల్లోకి ప్రవేశించాయి. నగరంలోనే జీవనం సాగిస్తున్నాయి. ఆ ఇంటి మీద నుండి ఈ ఇంటి మీదకు మరియు ఇండ్లలో ఉన్న చెట్ల మీద అక్కడక్కడ తిరుగుతూ ఆహారాన్ని వెదుక్కుంటున్నాయి. అడవుల నరికివేత కారణంగా పులులు, ఎలుగుబంట్లు, క్రూరమృగాలు కూడా అప్పుడప్పుడు నగరంలోకి వచ్చి మనుషులను, పశువులను కూడా చంపుతున్నాయి. అందుకే చలించే మనసును కోతి చేష్టలు అంటారు. అలాంటి ఆ మనసును నిర్మలంగా తేటగా ఉంచాలి. "మనసును కావలసినంత సై పట్టలేదని" ప్రశ్నిస్తున్నాడు. మనసు గుర్రానికి కళ్లెం వేయాలని, స్వాధీనంలో ఉంచుకోవాలని తెలియజేస్తున్నాడు. మహామహులే మనసు చెప్పినట్లు చేయగలరు. కానీ మామూలు మనుషులు మనసు తుఫాన్ లోబడి కొట్టుకుపోతారు. "మీ అంతరాంతరాల్లో ఇంకా అడుగు జలలు పుట్టలేదని " మనల్ని ప్రశ్నిస్తున్నాడు. మనలో ఆలోచనల పునాదులను రగిలిస్తున్నాడు. అంతరాంతరాల్లో అంటే నిఘంటువు అర్థం నక్షత్ర మండలం. అనంతమైన ఆకాశంలో నక్షత్ర మండలం ఉంటుంది. అందులో వేనవేల చుక్కలు, తోకచుక్కలు, ఉల్కలు, జలపాతాలు, ఉంటాయని మనందరికీ తెలుసు. నక్షత్ర మండలం లాంటి మన శరీరంలో కూడా అనంతమైన అడుగుజలలు ఉంటాయి. అడుగు జలలు పుట్టలేదని కవి ఆవేదన చెందుతున్నాడు. పాతాళ గంగ పూటలు ఊరలేదని. పాతాళ గంగ ఎక్కడ ఉంటుంది. భూమి అడుగు పొరల్లో పాతాళగంగా నీరు ఉంటుందని మనందరికీ తెలుసు. ఆ నీటిని పాతాళ గంగ పూటలు అంటారు. ఒకప్పుడు పల్లెల్లో ప్రతి ఇంట చేదబావి మరియు చేనులు, చెలుకలు, పొలాల్లో మోట బావులు ఉండేవి. పట్టణాల్లో చేద బావులు ఉండేవి. చేదబావులు ఇనుప గిరుకకు బొక్కెన వేసి చాంతాడుతో నీటిని పైకి లాగుతారు. పల్లెల్లో నీరు చేదుకొని తాగడం, స్నానం చేయడం, బట్టలు పిండుకొని ఆరవేయడం, బావి వద్దనే జరుగుతుండేవి. గ్రామాల్లో అందరికీ బావులు ఉండేవి కావు. కొందరు కలిగిన వాళ్ళ ఇంటి దగ్గర బావులు ఉండేవి. బావులు లేని వాళ్ళు కలిగిన వాళ్ళ ఇళ్ళకి వెళ్లి చేదబావినీళ్లు తోడు కొని తెచ్చుకునేవారు. చేదబావి నీరు పాతాళగంగ నీరు. పంట పొలాల్లో కూడా మోటబావులు ఉండేవి. మోటబావులు పారకం ద్వారా పంటలు పండిస్తారు. రెండు ఎడ్లు కాడికి కట్టి మోట బొక్కెనతో బావి నుండి నీళ్లు పైకి లాగి పొలాలు, చేనులు, చెలుకలు పారించేవారు. ఇప్పుడు మోట బావులు మూలనపడ్డాయి. తర్వాత ఆయిల్ ఇంజన్లు వచ్చాయి. ఆయిల్ ఇంజన్లు కూడా మూతపడ్డాయి. ఇప్పుడు కరెంటు మోటార్లతో నీరు పారిస్తున్నారు. ఇప్పుడు ఆధునికత పేరిట కరెంటు బావులు, ఆ నీరు కూడా పాతాళ గంగ నీరు. వర్షాలు లేక కరువు కాటకాలతో చేద బావులు, మోట బావులు ఎండిపోయాయి. పల్లెల్లో మరియు పట్టణాల్లో బోరు బావులు తవ్వకం ఎక్కువ అయి పాతాళ గంగ నీటిని ప్రజలు అత్యాశతో విపరీతంగా తోడివేయడం తో ఎన్ని వందల గజాలు బోర్ వేసిన నీటి ఊట రావడం లేదు. పాతాళ లోకం ఉంది అని పుస్తకాల్లో చదువుకున్నాం. పాతాళ గంగ జలాలు అడుగంటింప చేస్తున్నారు. పల్లెల్లో మరియు పట్టణాల్లో బోర్ల సంస్కృతి వచ్చింది. హైదరాబాదు లాంటి నగరంలో బోర్లన్నీ ఎండిపోయాయి. ఇప్పుడు నదీ జలాలు త్రాగడానికి మరియు సాగునీరుగా వాడుతున్నారు. కాలేశ్వరం ప్రాజెక్టులు పూర్తిచేసి వాటి నీరు వాడుతున్నారు. "మీరింక భువిని నందనవనం చేయలేదని? " ప్రశ్నిస్తున్నాడు. ఆకాశం నుండి వర్షపు చినుకు పడగానే భూదేవర పులకరిస్తుంది. ఆ వర్షపు నీరు తాగి భూమి పొరలలో అణిగి ఉన్న అసంఖ్యాకమైన వేళ్ళు బతికాయి. లెక్కలేనన్ని చెట్లు మళ్లీ జీవం పోసుకున్నాయి. ఎండాకాలంలో నామరూపాలు లేకుండా పోయిన చెట్టు, చేమా అన్ని మళ్ళీ కొత్త జన్మ ఎత్తుతాయి. వర్షాకాలంలో చెట్టు చేమ వర్షపు నీరుతో పులకించి పచ్చదనంతో సస్యశ్యామలం అవుతుంది. బీడు దనమంతా మాయమవుతుంది. ఆదిమ సమాజంలో అది మానవుడు నుండి ఇప్పటి ఆధునిక సమాజంలో ఈనాటి నవీన మానవుడు భువిని నందనవనంగా చేసి ఎన్నో రకాల పంటలు పండిస్తున్నాడు. ఎన్ని అద్భుతాలు సృష్టించాడు. ఎన్ని ఆవిష్కరణలు చేశాడు. "ఎవరన్నారు ఎవరన్నారు." అలా ఎవరన్నారు అని మనలో ఆలోచనలు రేకెత్తిస్తున్నాడు"మీరింక మంచితనం పంటలు. పుట్ల కొద్ది తీయ లేరని? ఇంటింటికి పంచలేరని." వ్యవసాయదారుడు ఎద్దు ఎవుసంతో ఆరుగాలం కష్టం చేసి పుట్ల కొద్ధి పంటలు పండిస్తాడు. మంచితనం పంటలు ఎవరు పండిస్తారు? మంచితనంతో మెలిగేవాళ్లు మంచితనం పంటలు పుట్ల కొద్ది పండించగలరు. మంచితనం పంటల్ని అందరి హృదయాల్లో ఆవిష్కరించగలరు. ఎంతమంది మంచి వాళ్ళు ఉన్నారు అని మనం వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. మంచితనంతో మనుగడ సాగిస్తున్న మహనీయులు గ్రామానికి ఒకరో ఇద్దరూ ఉన్నారు. వాళ్ల వల్ల వాళ్లు నడిచిన నేల పవిత్రమవుతుంది. వాళ్ల మంచితనం నడకలు సమాజ శ్రేయం కొరకే వాళ్ళు జీవిస్తారు. వాళ్ళ ముఖాల్లో పారాడే మంచితనం పంటలు వాళ్లు జీవించి ఉన్న అన్ని రోజులు పండిస్తారు. ఆ గ్రామాన్ని సౌభాగ్యవంతం చేస్తారు. ఆ మహనీయులు తమ చేతల ద్వారా చేతనతో మంచితనం పంటలు ఇంటింటికి పంచగలరు. "మంచితనం పంటలు. పుట్ల కొద్ది తీయ లేరని ? " మనలను ప్రశ్నిస్తున్నాడు. నిజం. ప్రశ్నించడమే సరి అయినది. "ఇంటింటికి పంచలేరని." మంచితనం చిరునామా ఎక్కడ అని మనం ప్రశ్నించుకోవాల్సిన తరుణం వచ్చింది. ఇవ్వాళ్ళ మంచితనం పంటలు పుట్ల కొద్ధి పండించే మనుషులు కావాలి. వాల్మీకి రామాయణంలో శ్రీ రామచంద్ర ప్రభువు ధీరోదాత్తమైన నాయకుడు, మంచితనంతో రాజ్యాన్ని పాలన సాగించాడు. ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునే ఔదార్యం కావాలి. మళ్లీ రామరాజ్యం రావాలని రాముడి పాలన కావాలని మల్లారెడ్డి ఆరాటపడుతున్నారు. "మానవత్వం లోతు తెలియని అర్బకులున్నారేమో. సేద్యము చేయరాని సోమరిపోతులని ఉంటారు కాబోలు." ఎక్కడ చూసిన మన కళ్ళకు కనిపించేది అమానుషత్వం, అరాచకాలు. వీటిని సృష్టిస్తున్నది ఎవరు? మానవత్వం లోతు తెలియని అర్బకులని మల్లారెడ్డి గుర్తించారు. ఇప్పుడు ఈ కాలం పిల్లలు వ్యవసాయం చేయడం లేదు. బేవార్స్ గా తిరుగుతూ సోమరిపోతుల జాబితాలు చేరారు. మంచితనం పంటలు ఎందుకు తీయలేరు. పుట్ల కొద్ది మంచితనం పంటలు తీయగలరు. ఇంటింటికి పంచగలరు. కాని ఇవ్వాల పేరుకుపోయిన సంక్షుభిత సమాజంలో కరుడుగట్టిన అమానుషత్వం నిలువెల్లా నింపుకున్న మనిషి సమాజ వినాశానికి పాల్పడుతున్నాడు. కొద్దిమంది సంపన్నుల చేతిలో సంపద ఉంది. ఆ సంపద కలవారు నడవడిక సరిగా లేదు. కొద్దిమంది సంపన్నులు మరియు రాజ్యాన్ని పాలిస్తున్న నాయకులు అధికార గణం తీవ్రమైన అవినీతికి, అన్యాయానికి,అక్రమాలకు పాల్పడుతున్నారు. వాళ్ళ చేతలు సమాజానికి వికృత రూపం దాల్చాయి అని చెప్పవచ్చు. మంచితనం కోల్పోయిన మనిషి మంచితనం పంటలు పుట్ల కొద్ది ఎలా తీయగలడు.పుట్ల కొద్ది పంటలు తీయలేరని? అన్నదాంట్లో వాస్తవాన్ని మన ముందు తేట తెల్లం చేస్తున్నాడు. రైతు ఆరుగాలం కష్టించి పండించిన పంటను తను ఒక్కడే అనుభవించడు. తన వృత్తికి సంబంధించిన సహస్ర వృత్తుల వారికి సాయపడడం ఈనాటిది కాదు. తరతరాల నుంచి ఎద్దు ఎవుసంతో జత కూడిన ప్రతి వాడికి ఆసరాగా నిలుస్తాడు. పల్లె అంటేనే ఒక కుటుంబం గా మరి వసుదైక కుటుంబం గా జీవించిన చరిత్ర ఉంది. కాని ఈనాడు మారిన ఈ కలియుగంలో మానవత్వం లోతు తెలియని అర్బకులున్నారేమో . "సేద్యం చేయ రాని సోమరిపోతులని ఉంటారు కాబోలు." కష్టించి శ్రమించే వాళ్లకు మానవత్వం లోతు తెలుస్తుంది. ఈనాడు కష్టించని అర్బకులే ఎక్కువ.అర్బకులు ఖుషి ఖుషీగా జీవితాన్ని గడిపేస్తున్నారు. భ్రమల్లో తెలియాడుతుంటారు. ఇవాళ రైతు కుటుంబాల్లో పిల్లలు చదువుకుంటున్నారు. వారికి వ్యవసాయం అంటే ఏమిటో తెలియకుండా తల్లిదండ్రులు పెంచుతున్నారు. మరి చదువు చక్కగా చదువుతున్నారా ? అంటే అది కూడా లేదు. చక్కగా చదవక , వ్యవసాయం పనులు నేర్చుకోక ,ఖాళీగా ఉంటున్నారు. చదివిన చదువులో నైపుణ్యం లేదు. కాబట్టి ఉద్యోగాలు దొరకవు. ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా వ్యవసాయ పనుల్లో సాయంగా ఉండటం లేదు. సేద్యం చేయరాని సోమరిపోతులని ఉంటారు కాబోలు అన్నది వాస్తవంగా తోస్తుంది. "కాని మీ లోతు గుండె బావి నిండా పూటికె నిండదని అది వట్టి బుడుగు మడుగు గా మారిందని. తెలియదు పాపం అమాయకులకు. దానినిండా స్వార్థం క్రిములు కుతకుతలాడుతున్నవి." మనుషులు చేస్తున్న వింత పనులకు పరితాపం చెంది మీ లోతు గుండె బావి నిండ పూటిక నిండదని తెలియజేస్తున్నారు. గుండెకు లోతులు ఉంటాయని మీయొక్క గుండె బావికి పూటికే నిండదని హృదయం డాక్టర్ గా కార్డియాలజిస్ట్ గా మనలను స్టెతస్కోప్ లేకుండానే పరీక్షించి ఖరా ఖండిగా కవి అయిన మల్లారెడ్డి తెలియజేస్తున్నారు. "అది వట్టి బుడుగు మడుగుగా మారిందని." పల్లెలో పుట్టిన మల్లారెడ్డి పల్లెలో ప్రతి ఇంట చేదబావి మరియు చేను, చెలకలు మోటబావిని చూసిన తన తండ్రితో కలిసి ఎద్దు ఎవుసంచేసిన అనుభవంతో చెబుతున్నారు. చేద బావిలో నీరు రాకపోతే పూటికే నిండిందని తెలుస్తుంది. మళ్లీ బావిలో దిగి గడ్డపారతో తవ్వి పూటికే తీస్తేనే జలధార వస్తుంది. చేనులో కూడా ఇలాగే జరుగుతుంది. బావినిండా పూటికే నిండితే నీళ్ల జలరాదు జల ఆగిపోతుంది. మళ్ళీ నీటిజలతో భావి ప్రకాశించాలంటే ఆ బావిలో పూటికే తీస్తేనే మళ్లీ నీటి ధార ఊటలు ఊటలుగా ఉబికి వస్తుంది . "వట్టి బుడుగు మడుగుగా మారిందని " కొన్ని బావులు పనికిరాని వ్యర్థ పదార్థాలు చెత్త చేరి బుడుగు మడుగ్గా తయారవుతుంది. పనికిరాని చెత్త,వ్యర్థ పదార్థాలు తీసి పారేస్తేనే భావిశుభ్రంగా తయారవుతుంది. ఎల్లవేళలా బావిని శుభ్రం చేస్తూ వాడుతుంటేనే బాగుంటుంది. లేకుంటే బుడుగు మడుగు వల్ల ఉన్న పూడిక కూడా మూసుకు పోతుంది.దాని నిండా స్వార్థం క్రిములు కుత కుత లాడు తున్నవి ఇవాళ ఉన్న వ్యవస్థను డ్రైనేజీ మోరీతో పోల్చవచ్చు. దానినిండా స్వార్థం క్రిములు అడుగడుగునా మనకు అగుపిస్తూ ఉంటాయి. ఒక్కని స్వార్థానికి వేలమంది హాహాకారాలతో అలమటిస్తుంటారు. ధనికులు కోట్ల కొద్ది సొమ్ము స్విస్ బ్యాంకుల్లో దాస్తున్నారు. స్విస్ బ్యాంకు లో ఉన్న ధనికుల డబ్బు తీసుకువస్తే భారతదేశం అమెరికా లాంటి సంపన్న దేశంగా తయారవుతుంది. కానీ స్వార్థపరులు సంపాదించిన డబ్బు స్విస్ బ్యాంకుల్లోనే మూలుగుతూ ఉంటుంది. ఆ డబ్బు బయటకు తీయరు. తీసే దమ్ములు మన స్వార్థ రాజకీయ నాయకులకు లేదు. ఇవ్వాల రాజకీయం ఆట సంపన్నులు ఆడుతున్నారు. సంపన్నులు కూడ బెట్టడం చేస్తారు. వితరణ గుణం వాళ్లలో లేదు. సంపన్నుల సంపద ప్రజా సంక్షేమం కొరకు వినియోగించరు. ఇవాళ వ్యవస్థలు భ్రష్టు పట్టాయి. ఏ రంగాన్ని తీసుకున్నా అందులో అవినీతి మరకలు లేకుండా ఒక్కరు లేరు. ఇవాళ అవినీతి గుట్టలు గుట్టలుగా పేరుకుపోయింది. ఎటు చూసినా స్వార్థం నిండిన నాయకులు. కోట్ల కొద్ది సంపదను కూడా బెడుతున్నారు.సమాజ సంక్షేమం కొరకు ఏదైనా చేయాలనే తపన, త్యాగం వాళ్ల లో ఉండదు. వ్యక్తిగత స్వార్థంతో జీవనం సాగిస్తున్నారు. అందుకే మల్లారెడ్డి దానినిండా స్వార్థం క్రిములు కుత కుత లాడుతున్నవి. స్వార్థం క్రిముల ఆటపట్టించే యువతకు సరైన మార్గదర్శకత్వం ఇస్తే చైతన్యం స్ఫూర్తితో జ్వలించే జ్వాలలుగా మారతారు.పరార్థం గురించి ఆలోచించి మంచి కొరకు మానవత్వం కొరకు పాటుపడే మహనీయుల ఆత్మలు కావాలిప్పుడు. ఆనాటి నాయకులు సర్వమానవాళి శ్రేయస్సు కొరకు సమాజ విలువల పరిరక్షణకు తీవ్రంగా కృషి చేశారు. విలువల కొరకే జీవితాన్ని అంకితం చేశారు. ఇవాళ విలువలు పరిరక్షించే దాతలు ఎందరు ఉన్నారు. కండల బలమున్న గుండెల బలమున్న పడుచు సేద్య గాళ్లకి _ మాకు పగలు రేయి కష్టించే వాళ్లకు చెమట చుక్కల్లోనే స్వర్గం చూపే వాళ్లకు" దేశమంటే మట్టి కాదు దేశమంటే మనసులోయి అన్నాడు గురజాడ వెంకట అప్పారావు మహనీయుడు. ఆరోగ్యమైన వ్యక్తి ఏదైనా సాధించగలడు. సంపూర్ణ ఆరోగ్యం ఉన్న యువత సమాజం గురించి ఆలోచించగలరని సమాజ శ్రేయస్సు వికాసం కొరకు తమ జీవితాలను అంకితం చేస్తారు. ఈనాటి సమాజ వికాసం కొరకు కండల బలమున్న గుండెల బలమున్న పడుచు సేద్య గాళ్ళ కు మాకు పగలు రేయి కష్టించే వాళ్లకు చెమట చుక్కల్లోనే స్వర్గం చూపే వాళ్ళకు ఒక పరి అప్పగిస్తే. అప్పగించాలి.అలాంటి యువత కొండల్ని పిండి చేయగలరు. శ్రామికుని స్వేదంనకు విలువ కట్టింది మార్క్స్ .ప్రపంచ శ్రామికులారా ఏకంకండి అనే పిలుపుతో ప్రతి సంవత్సరం మే డే గా జరుపుకుంటున్నాం.కార్మిక వర్గ ఐక్యత తో సోవియట్ రష్యాలో పోరాటం చేసి లెనిన్ నాయకత్వంలో 1917 అక్టోబర్ కమ్యూనిస్టు రాజ్య స్థాపన మొదటిసారిగా జరిగింది. కమ్యూనిస్టు పాలనలో సంపద అంతా సమాజ పరం చేసి ఆ దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పయనింపజేశాడు. జయకేతనం ఎక్కించాడు. విప్లవాల విజయం బాట పట్టించిన దేశం సోవియట్ రష్యా. "ఒకపరి అప్పగిస్తే మీ మనసు తట్టలకు పురోగమన తాళ్లు కట్టి అభ్యుదయం చేంతాడుతో పూటికంతా లాగుతాం మళ్లీ పాతాళగంగా ఊటల్ని రప్పిస్తాము" మనసు ఎక్కడ ఉంటుంది. అంతరంగంలో ఉంటుంది. మనలో కనిపించే మనసు,బయటకు కనిపించని మనసు కూడా ఉంటుంది. మనసు చేసే మాయలు మంచివైపుకా, చెడు వైపుకా, మనమే నిర్ణయించుకోవాలి. మనసు తట్టలుగా ఉండదు. మనసును తట్టల్లోకి ఎత్తలేం. మనసును ప్రేమించిన వాడు. మానవత్వం ఉన్న మనిషిగా ఆ మనసును పరిపూర్ణమైన సంకల్పంతో సరైన దారుల్లో నడిపిస్తున్నవాడు. మనసును ఉత్సాహంతో ఉద్దీపింప చేసినవాడు. ఉత్సాహమైన మనసు తట్టలకి పురోగమనం తాళ్లు కట్టి అభ్యుదయం చేంతాడుతో పూటికంతా లాగుతాం. మళ్లీ పాతాళ గంగ ఊటల్ని రప్పిస్తాము అంటున్నాడు. క్షణ క్షణము మారే మనసును కూడా సరైన దారిలో పెట్టి చక్కని ఆలోచనాత్మక కర్తవ్యమును మనకు ప్రబోధిస్తున్నాడు. మనిషిలో మాయమైన మానవత్వం జల తో పూటికంతా లాగుతాం అంటున్నాడు. మనిషి అంతరంగంలో అదృశ్యమైన మనసు పొరలకి మళ్లీ పాతాళగంగ ఊటలు రప్పిస్తాను అని చెప్తున్నాడు. మృగ్యమైన మానవతా దీపాలు వెలిగిస్తానంటున్నాడు. ఎంత చక్కటి ఆలోచన. సమాజాన్ని ప్రేమించిన వాడు. సమాజ హితం కోరుతున్నాడు. మనుషులను మనుష్యుల్లోని మనసులను కూడా మృగ్యమైపోయిన మానవత్వపు విలువలను తన చైతన్యంతో రప్పిస్తున్నాడు. గుండె గుండెకు మోట పెట్టి. బండ బండను మడిచేసి. రాళ్ళల్లో రతనాలు పండిస్తాం. కరిగిపోని వసంతాలు సృష్టిస్తాం. గుండె గుండెకు మోట పెట్టి బండ బండను మడిచేసి రాళ్ళల్లో రత్నాలు పండిస్తాం అంటున్నాడు. ప్రతి మనిషికి గుండె ఉంటుంది గుండె లబ్ డబ్ మని శబ్దం చేస్తుంది. డాక్టర్ స్టెతస్కోప్ ద్వారా గుండె ధ్వనులను వింటాడు. బీపీ చెక్ చేసి లో బిపి మరియు హైబీపీ ఉంది అని చెప్తాడు. సమాజాన్ని పరిశీలించే డాక్టర్ గా సమాజ హితం కొరకు పాటుపడే వ్యక్తిగా మనుషుల గుండెలకు మోట పెట్టి బండ బండను మడి చేస్తాను అంటున్నాడు. బండగా మారిన బండ బారిన హృదయాలను సేద్యం మడిచేసి రాళ్లలో రతనాలు పండిస్తాం అంటున్నాడు.విజయనగరాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయలు కాలంలో రాళ్లలో రత్నాలు పండించారట. మనకు చరిత్ర చదివితే తెలుస్తుంది. ఆ రతనాలను విదేశీయులు వచ్చి మన దేశం నుంచి కొనుక్కుపోయేవారట. నిజంగా రతనాలు పండిన దేశం మనది. అందుకే మన దేశాన్ని రత్న గర్భ అని అంటారు. "కరిగిపోని వసంతాలు సృష్టిస్తాం". కరిగిపోని వసంతాలు ఎక్కడ ఉంటాయి. స్వర్గంలో ఉంటాయి. మహా ప్రవక్త మహమ్మద్ కురాన్ లో రాశారు.ఆయనకు దైవ వాణి ద్వారా తెలుపబడింది అని రాశాడు. ఆ చెట్లకు పూచిన పూలు ఎప్పటికీ వాడిపోవు. ఆ కాలువలు ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటాయి. స్వర్గంలో ఎవరికి ప్రవేశం ఉంటుంది. మానవత్వంతో ఆలోచించే వాళ్లకి మానవత్వంతో నడుచుకునే వాళ్ళకి ప్రవేశం ఉంటుంది. దుర్మార్గులకు నరకం శిక్షగా ఉంటుంది. నూనె మడ్డి లాంటి వేడినీరు తాగుతారట. "ఎవరంటారు. మాకా దమ్ములు లేవని?" మనల్ని ప్రశ్నిస్తున్నారు. సత్యమైన బాటలు నడిచే వాళ్ళు మానవత్వం మేల్కొల్పిన వాళ్లు సమాజ సౌభాగ్యాల కోసం పాటుపడుతున్న వారు ఉన్నారు. వాళ్లను ఎవరంటారు మాకా దమ్ము ల్లేవని అడిగే వాళ్ళు ఉండరు. "చూడాల్సింది మా కలాల్ని కాదు మా చేతుల సత్తువని" కవుల కలాలు కూడా కర్తవ్యం గుర్తు చేయగలవని సమాజ హితం కోసం పాటుపడగలవని చెప్తున్నారు. చూడాల్సింది మాకలాల్ని కాదు మా చేతుల సత్తువని తెలియజేస్తున్నారు.. "మా శ్రామిక శక్తి పవనోర్మిల్నిమా నెత్తురు కణాల కత్తులని." శ్రామిక శక్తి ద్వారా విప్లవాలు సృష్టించబడ్డాయి. ప్రపంచ చరిత్రలో విప్లవ బాటలో నడిచి విప్లవిస్తే జయం మనది అని ఆ రెండు దేశాల్లో సోవియట్ రష్యా మరియు చైనా లో కమ్యూనిస్టుల పాలన ఏర్పడి ఆ దేశ సౌభాగ్యానికి ఎంతో తోడ్పడ్డాయి. ఇవాళ మరుగున పడుతున్న మానవతపు జలను తన కవిత ఎవరన్నారు ద్వారా పంచుకున్నారు. ఆయన అంతరంగంలో పురుడు పోసుకున్న ఎవరన్నారు కవిత సర్వ మానవాళి శ్రేయస్సును కాంక్షిస్తుంది.మల్లారెడ్డి శ్రామిక వర్గ పక్షపాతి. ఆయన రాతల్లో అభ్యుదయం తపన అలాగే కొనసాగుతుంటుoది.మానవత్వం పరిమళాలను పండిస్తాడు. మానవత్వానికి స్వాగతం పలుకుతూ మల్లారెడ్డి కలానికి మంచి పదునుపెట్టాలని కోరుకుంటున్నాను. శ్రామికుని శక్తి నుండి స్వేదం నుండి పంటలు తీస్తాం. నెత్తురు కణాల కత్తులు. శ్రామికుల నెత్తురుని కణాల కత్తులు అంటున్నరు. చక్కటి కవితను అందించిన మల్లారెడ్డిని అభినందిస్తున్నాను. రచన: నరేంద్ర సందినేని


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి