"చెరపకురా చెడేవు";-ఎం బిందుమాధవి
 రామాయణంలోదే మరొక కధ చెప్పుకుందాం ఇవ్వాళ్ళ.
కోసల దేశాన్ని ఇక్ష్వాకు వంశీయుడైన దశరధ మహారాజు పరిపాలించాడు అని మనకి తెలుసు కదా!
ఆయన చాలా గొప్ప వ్యక్తి..వీరుడు..శూరుడు..సమర్ధుడైన రాజు.
ఇంకొక విషయం తెలుసా మీకు? ఆయనకి 'శబ్ద భేది' అనే విద్య తెలుసు. అంటే శబ్దాన్ని బట్టి ఆ దిక్కుగా ఎంత దూరమైనా బాణం వెయ్యగల నేర్పరి.
అది ఎంతో నైపుణ్యంతో కూడిన గొప్ప విద్యే అయినా.. పాపం ఆయన విషయంలో ఆయనకి శాపమయ్యింది.
ఎలాగంటే..
అడవిలో తన తల్లిదండ్రులతో కలిసి ఒక బాలుడు నివసిస్తూ ఉంటాడు. అతని పేరు శ్రవణ కుమారుడు. అతని తల్లిదండ్రులు అంధులు, వృద్ధులు. శ్రవణ కుమారుడు తన తల్లిదండ్రులని కావడిలో కూర్చోపెట్టుకుని వారికి కావలసిన సేవలు చేస్తూ ఉండేవాడు.
ఒక సారి వారికి దాహం వేస్తుంటే నీరు తేవటానికి ఒక వాగు వద్దకి వచ్చి, నీటిలో కడవ ముంచాడు.
అదే సమయంలో దశరధ మహారాజు ఆ అడవిలో జంతువులని వేటాడుతున్నాడు. ఆయనకి కూడా దాహం వేసి అదే వాగు వద్దకి వస్తూ ఉండగా...వాగు దగ్గర నించి వస్తున్న బుడ బుడమనే శబ్దం విన్న దశరధ మహారాజు అది ఒక జంతువు అని భావించి తనకి తెలిసిన 'శబ్ద భేది' విద్యనుపయోగించి బాణం వేసి కొడతాడు.
ఆ బాణం తగిలిన శ్రవణ కుమారుడు 'అమ్మా' అని నేలకొరుగుతాడు. నీళ్ళు తేవటానికి వెళ్ళిన కొడుకు ఎంతకీ రాకపోయే సరికి వెతుక్కుంటూ వచ్చిన తల్లి దండ్రులకి బాణపు దెబ్బతో విల విలలాడుతూ కొన ప్రాణంతో ఉన్న కొడుకు మాట వినపడుతుంది.
పక్కన విల్లు-బాణాలతో ఉన్న దశరధుడు తను తెలియక చేసిన తప్పుని మన్నించమని అడుగుతాడు. వృద్ధాప్యంలో ఉన్న ఒక్క కుమారుడు దూరమై తమకి కలిగిన అనుభవము..ఆవేదనే ఆ రాజు కూడా అనుభవిస్తాడని శపిస్తారు.
ఆ శాప ఫలమే దశరధుడు తన వృద్ధాప్యంలో తనకత్యంత ప్రియమైన కొడుకు రాముడికి దూరమవుతాడు.
@@@@
ఎన్నో వేల యేళ్ళు జనరంజకంగా ప్రజలని పాలించిన దశరధ మహారాజు కి చాలా కాలం వరకు పిల్లలు పుట్టరు.
కులగురువైన వశిష్ఠుని సలహా మేరకి ఋష్యశృంగ మహర్షి చేసిన 'పుత్ర కామేష్టి' యాగం వల్ల దశరధుడికి నలుగురు కొడుకులు పుడతారు. వారే రామ, లక్ష్మణ, భరత, శతృఘ్నులు.
అందులో పెద్ద వాడైన రాముడు దశరధుడి పెద్ద భార్య అయిన కౌసల్య కుమారుడు. కైకేయి కుమారుడు భరతుడు. సుమిత్రకి ఇద్దరు కుమారులు..వారే లక్ష్మణ శతృఘ్నులు.
నలుగురు కొడుకుల్లోను రాముడంటే అమితమైన ప్రీతి దశరధుడికి. అతన్ని వదిలి ఒక్క నిముషం కూడా ఉండేవాడు కాదు.
రాముని తల్లి కౌసల్యే అయినా, అతన్ని కైకేయి అమితమైన ప్రేమానురాగాలతో పెంచింది. తన కొడుకు భరతుని కంటే కూడా రాముడినే ఎక్కువగా ఆదరించేది, ప్రేమించేది అంటే అతిశయోక్తి కాదు.
అంతగా రాముని ప్రేమించిన కైకేయి..తన పుట్టింటి నించి తెచ్చుకున్న దాసి 'మంధర' 'చెప్పుడు మాటలు' విని రాముడిని 14 సంలు అడవికి పంపించి, భరతుడికి కోసల దేశపు రాజుగా పట్టాభిషేకం చెయ్యమని భర్తని వరాలు అడుగుతుంది.
మంధర చెప్పిన ఆ ప్రణాళికని కైకేయి ముందుగా వ్యతిరేకించినా..చెప్పగా చెప్పగా అందులో చెడు తలకెక్కి, స్వార్ధంతో తన కొడుకునే రాజుని చెయ్యమని రాజు మీద ఒత్తిడి చేస్తుంది.
కైకేయి కోరిన ఆ కోరిక తనుగా రాముడికి చెప్పటానికి దశరధుడు ఇష్టపడక, బాధ పడుతుంటాడు. కైకేయి తనే రాముడికి కబురు పంపి పిలిపించి తన కోరిక..దశరధుడు వెనకెప్పుడో తనకిచ్చిన వరాలుగా చెప్పి..తత్క్షణమే అడవికి వెళ్ళి తండ్రి తనకిచ్చిన మాట నెరవేర్చవలసిన బాధ్యత కొడుకుగా అతనిదేనని చెబుతుంది.
రాముడు అడవికి వెళ్ళిపోతాడు. ఇది దశరధుడికి శ్రవణ కుమారుడి తల్లిదండ్రులు ఇచ్చిన శాప ఫలితమే కావచ్చు. కానీ దురాలోచన చేసిన కైకేయికి ఏం జరిగింది? ఏం మిగిలింది?
ఆ దిగులుతో వెంటనే దశరధుడు మరణిస్తాడు. భరతుడు తల్లి చేసిన తప్పు తెలుసుకుని ఆమెని నిందించి ఆమెతో మాట్లాడటమే దోషమని మాట్లాడటం మానేస్తాడు.
అలాంటి సలహా ఇచ్చిన మంధరని దేశం నించి బహిష్కరిస్తాడు.
ఇంతకీ కైకేయి కోరిందేమిటి? జరిగిందేమిటి?
ఈ కధ వల్ల మనకి తెలిసేదేమిటంటే...చెడు మాటలు చెప్పిన మంధర దేశం నించి బహిష్కరింపబడి చరిత్రలో లేకుండా పోయింది. చెప్పుడు మాటలు విని ఇతరులకి హాని తలపెట్టిన కైకేయి భర్తని పోగొట్టుకుంటుంది..కొడుకుతో బంధం తెగిపోతుంది.
కాబట్టి "చెరపకురా..చెడేవు" అని పెద్దలు చెప్పినట్లు ఇతరులని చెడగొట్టాలని ప్రయత్నిస్తే ఆ చెడు మనకే జరుగుతుంది!

కామెంట్‌లు