చంద్రపురంలో భూస్వాములు ఉన్నారు. కాయకష్టం చేసుకునే పేదలున్నారు. ఎవరికీ చదువురాదు.అందరూ నిరక్షరాస్యులే. కారణం చదువు నేర్పేవారు అందుబాటులో లేకపోవడమే!
ఒకసారి ఎక్కడినుంచో నందనుడు అనే పండితుడు వచ్చి ఆగ్రామంలో చేరాడు. కొంతధనం తీసుకుని పిల్లలకు చదువు నేర్పుతానన్నాడు.అందరూ సంతోషించారు. కానీ చదువు చెప్పడానికి నందనుడు పెద్దమొత్తంలో ధనం ఆశించేవాడు. భూస్వాములకు ఆధనం చెల్లించడం కష్టం కాలేదు.కానీ పేదవారు మరో మార్గంలేక పొదుపుచేసి,అడిగినంతా ఇచ్చి పిల్లలను బడికి పంపేవారు.నందనుడికి సంతానం లేదు. భార్య తప్ప ఎవరూలేరు. అయినప్పటికి చదువు నేర్పడానికి వసూలు చేసే డబ్బును తగ్గించేవాడు కాదు.
'నందనుడు పండితుడే కానీ దురాశపరుడు. అతి పిసినారి. సంతానంలేని వాడికి అంత ధనం పిచ్చి ఎందుకు? పేదవారనే దయ కూడా లేదు.' అని అందరూ అనుకునే వా రు. కానీ ప్రశ్నిస్తే తమ పిల్లలకు చదువు చెప్పడనే భయంతో ఎదురుగా ఎవరూ ఏమీ అనేవారు కాదు.
ఒకసారి జయన్న అనే పిల్లవాడికి జబ్బు చేసింది.వైద్యానికి పెద్దమొత్తంలో ధనం అవసరమైంది.వాడి తల్లిదండ్రులు పేదవారు కావడంవల్ల తిరిగి చెల్లించలేరని
ఏ భూస్వామీ అప్పు ఇవ్వలేదు. ఏంచేయాలో వారికి తోచలేదు. విషయం తెలుసుకున్న నందనుడు అప్పు ఇస్తానని ముందుకు వచ్చాడు. వారికి చదువు రాదు కాబట్టి ఋణపత్రం నందనుడే వ్రాసుకున్నాడు.పత్రంపై వేలిముద్రలు వేయించుకున్నాడు.ఆధనంతో జబ్బు నయం చేసుకున్నారు. ఈవిషయం ఊరందరికీ తెలిసింది. ఆవిధంగా ఎవరికి ఏ అనారోగ్య సమస్య వచ్చినా అప్పు పుట్టనివారు నందనుడి వద్దకు వెళ్తే పత్రం వ్రాసుకుని, వేలిముద్రలు వేయించుకుని ధనమిచ్చేవాడు. వైద్యం కోసం తప్ప ఇతర అవసరాలకు అప్పు ఇచ్చేవాడు కాదు. ఆమాటే ఎవరైనా అంటే "వైద్యం కోసం అప్పు ఇస్తే విశ్వాసంతో తిరిగి ఇస్తారు." అనేవాడు.
కొంతకాలానికి నందనుడి తతంగం న్యాయాధికారికి తెలిసింది. వెంటనే పత్రాలు తీసుకుని రావలసినదిగా నందనుడికి కబురు వచ్చింది. నందనుడు పత్రాలు తీసుకుని న్యాయాధికారిని ఇంటి వద్ద కలిశాడు.
"నీవు చదువు చెప్పడానికి పెద్ద మొత్తంలో ధనం వసూలు చేస్తున్నావట. ఆధనాన్ని తిరిగి వడ్డీకి అప్పుగా ఇస్తున్నా వట.ఈవిధంగా పేదలను పీడించి సంపాదిస్తున్నావని పిర్యాదు అందింది" అన్నాడు న్యాయాధికారి.
నందనుడు పత్రాలన్నీ ఆయన చేతిలో పెట్టాడు.వాటిని చూసిన న్యాయాధికారి ఆశ్చర్యపోయాడు.ఆపత్రాలలోఎక్కడా వడ్డీ గురించి లేదు. అసలు మాత్రం చెల్లించేలా వ్రాసి ఉంది.
"నీవు అధికధనం తీసుకుని చదువు చెప్పడం, అధికవడ్డీకి అప్పులివ్వడం నిజంకాదా?"అని అడిగాడు న్యాయాధికారి.
"అయ్యా!నేను చదువు నేర్పడానికి ఉన్నవారి వద్ద, లేనివారి వద్ద ఎక్కువ ధనం తీసుకుంటున్నాను.అందువల్ల పొదుపు తెలియని పేదవారుకూడా పిల్లల చదువు కోసం పొదుపుచేసి నాకు చెల్లిస్తున్నారు. అలా వచ్చిన ధనాన్ని దాచి పేదలవైద్యానికి అప్పుగా ఇస్తున్నాను. వైద్యంకోసం అప్పు ఇచ్చేవారు లేక పేదలు ప్రాణం కోల్పోయేవారు.అలా జరగకూడదనే అవసరానికి ఆదుకుంటున్నాను. ఇంతవరకూ ఏఒక్కరూ నావద్ద తీసుకున్న అప్పు చెల్లించిందీలేదు.నేను అడిగిందీలేదు. ఎవరైనా అప్పుతీర్చడానికి వస్తే అసలు మాత్రమే తీసుకుని, వడ్డీ తర్వాత ఇవ్వండి.తొందరలేదని చెప్పాలనుకుంటు న్నాను. ఈవిషయాలు ఎవరికీ తెలియనివ్వకండి.నేను సర్వశాస్త్రాలూ చదివిన పండితుడిని. ఈ ధనం శాశ్వతం కాదని, వెంట పట్టుకెళ్లేదేమీలేదని నాకు తెలియదా?ఆకలికి, అనారోగ్యానికి సాయపడడాన్ని మించిన పుణ్యకార్యం ఏదీ
లేదుకదా!ఆపనికోసమే నాసంపాదనను ఉపయోగిస్తున్నాను" అన్నాడు నందనుడు.
"ఇంత దూరదృష్టితో ధనం దాచి, మంచి మనసుతో సహాయపడుతున్న మిమ్మల్ని ఇప్పుడే కానుకలతో సత్కరించు కోవాలను కుంటున్నాను" అన్నాడు న్యాయాధికారి.
"అయ్యా!మంత్రులకూ, రాజుగారికీ చెప్పి నగరాల్లోనే కాకుండా ప్రతిపల్లెలో ఉచితవిద్యాలయాలు,వైద్యశాలలు ఏర్పాటు చేయించండి. అవసరాలకు ఆదుకునే పొదుపు ఆవశ్యకతను గురించి, వ్యసనాలు తెచ్చే చేటును గురించి రాజ్యమంతటా ప్రచారం కల్పించండి. అదే నాకు సన్మానం" అని విన్నవించుకుని ఇంటి దారి పట్టాడు నందనుడు.
న్యాయాధికారి చొరవతో అనతికాలంలోనే రాజ్యంలోని ప్రతిపల్లెలో ఉచితవిద్యాలయా లు, వైద్యశాలలు ఏర్పాటయ్యాయి. తన కోరిక తీరినందుకు నందనుడు సంతోషించాడు.
నందనుడి కోరిక;-డి.కె.చదువులబాబు.ప్రొద్దుటూరు
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి