మనకీర్తి శిఖరాలు .;-కామసముద్రం అప్పలాచార్యులు ;-- డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
 కామసముద్రం అప్పలాచార్యులు . . గద్వాల సంస్థానంలోని కవి, సంగీతకారుడు. ఇతడిని "ఆంధ్ర జయదేవ"గా పేర్కొంటారు. అతను సంగీత సాహిత్యాలలో దిట్ట. ఇతడు 17వ శతాబ్దంలో పెదసోమ భూపాలుని ఆస్థానంలో సంగీత విద్వాంసుడిగా సేవలందించాడు. అప్పలాచార్యులు కౌండిన్యస గోత్రికుడు, శ్రీనివాసాంబ , కృష్ణమాచార్యుల పుత్రుడు , అహోబిల శ్రీనివాసుని శిష్యుడు. మహారాజు గారి కోరిక మీద జయదేవుడు రచించిన గీత గోవిందం సంస్కృత కావ్యంలోని 12 సర్గలూ, 24 అష్టపదులూ, 72 శ్లోకాలనూ తెలుగులోకి "శ్రీకృష్ణ లీలా తరంగిణి"గా రచించాడు.
చిన సోమ భూపాలుని ఆస్థాన కవులు ఆయన కోరిక మేరకు యథాశ్లోక తాత్పర్య రామాయణంలోని వివిధ కాండలను రచించారు. అలాంటి వారిలో తిరుమల కృష్ణమాచార్యుడు సుందరకాండను 3 ఆశ్వాసాలతో రచించారు. చతుర్విధ కవితా నిర్వాహకులైన కామసముద్రం అప్పలాచార్యులు కిష్కింధకాండను 3ఆశ్వాసాలుగా రచించడమే కాకుండా ఈ రామాయణానికి అవతారికను రచించాడు .
ఒకనాడు పెదసోమభూపాలుడు కొలువుదీర్చి అప్పలాచార్యుల వారిని పిలిపించి జయదేవుని అష్టపదులను తెలుగులోకి మార్చవలసినదిగా కోరాడు. జయదేవుడి అష్టపదులకి యావద్భారత దేశంలోనూ ఖ్యాతి ఉంది. అవన్నీ సంస్కృతంలోనే ఉన్నా.. ఏ భాషకాభాష వారు ఇవి తమవేనేమో అనుకునేంతగా జనజీవితంలో మమేకమైపోయిన గీతాలు. వాటిని అనువదించేముందు అతను ముందు జయదేవుడి జీవితం, ఆయన సాహిత్యాన్నీ ఔపోసన పడదాం అనుకుని కృష్ణుణ్ణి మనసులో స్మరించుకునీ.. జయదేవుడు పుట్టిన ఊరు ఒరిస్సాలోని కిందుబిల్వం అనే ప్రదేశానికెళ్ళి ఆ మట్టిని చేత్తో పట్టుకుని ముద్దెట్టుకున్నాడు. జయదేవుడి తల్లిదండ్రులైన భోజదేవుడు, రమాదేవి తమ పిల్లాణ్ణి ఊయలలూపిన ప్రదేశానికెళ్ళి ఆనందంలో ఊగిపోయాడు. జయదేవుడి గీతాలకి నాట్యం చేసిన ఆయన పద్మావతి నర్తించిన మండపాల మీద కూర్చుని అరచేతుల్తో ఆ గచ్చు తుడిచాడు అప్పలాచార్యుడు. అన్నిచోట్ల కృష్ణ దర్శనం, కృష్ణ స్పర్శనం జరిగిపోతోంది అప్పలాచార్యులకి. మొత్తానికి జయదేవుడి గీత గోవిందం కళ్ళకద్దుకున్నాడు. 12 సర్గలూ, 24 అష్టపదులూ, 72 శ్లోకాలలో ఉన్న గీతగోవిందంలో మధుర - శృంగార భక్తిని..ఆస్వాదించి..దీన్ని తెలుగులో రాయడానికి శ్రీకారం చుట్టాడు. జయదేవుని ఆత్మని ఆవిష్కరించుకునీ కొన్ని అవేరాగాలు ఉంచేసి.. కొన్ని సౌలభ్యాన్ని బట్టి రాగాల్ని మార్చీ మొత్తానికి.. శ్రీకృష్ణ లీలా తరంగిణి అనే ఆంధ్రాష్టపదిని పూర్తిచేసాడు.

కామెంట్‌లు