అసామాన్య గణిత శాస్త్రవేత్త రామానుజం; - సి.హెచ్.ప్రతాప్
 శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ (1887 డిసెంబర్ 22 – 1920 ఏప్రిల్ 26) బ్రిటీష్ పరిపాలనా కాలంలో భారతదేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త. 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావులలో ఒకరు.  శుద్ధ గణితంలో ఈయనకు శాస్త్రీయమైన శిక్షణ లేకపోయినా గణిత విశ్లేషణ, సంఖ్యా శాస్త్రం, అనంత శ్రేణులు, అవిరామ భిన్నాలు లాంటి గణిత విభాగాలలో విశేషమైన కృషి చేశాడు. 20 వ శతాబ్దంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గణిత మేధావుల్లో ఒకరిగా పేరు సంపాందించిన భారతీయుడు శ్రీనివాస రామానుజన్. తమిళనాడులో ఈరోడ్‌లోని ఓ నిరుపేద బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కోమలమ్మాళ్, శ్రీనివాస అయ్యంగార్ దంపతులకు 1887 డిసెంబరు 22 న రామానుజన్ జన్మించారు. చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభను ప్రదర్శించి ఆయిలర్ నియమాలు, త్రికోణమితికి చెందిన సమస్యలను సాధించారు.1913లో ఆయన ఇంగ్లండులోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో పనిచేసే జి. హెచ్. హార్డీ అనే గణిత శాస్త్రవేత్తను ఉత్తరాల ద్వారా సంప్రదించాడు. అతని పనిని చూసి ముగ్ధుడైన హార్డీ రామానుజాన్ని కేంబ్రిడ్జికి ఆహ్వానించాడు. 1914 మార్చిలో లండన్‌కు వెళ్లిన రామానుజన్ అక్కడ నిరంతరం గణితంపై పరిశోధనలు చేసి కొత్త సిద్ధాంతాలను కనిపెట్టారు. ఫెలో ఆఫ్ ద ట్రినిటీ కాలేజి గౌరవం పొందిన తొలి భారతీయుడిగానూ, ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ గౌరవం పొందిన రెండవ భారతీయుడిగానూ ఆయన చరిత్రకెక్కారు రామానుజన్ ప్రతిపాదించినవి చాలా కీలకమైన సిద్ధాంతాలనీ, కొన్నైతే తాను కనీ వినీ ఎరుగనివని కూడా ఆయన అభిప్రాయపడ్డాడు.  రామానుజన్ బ్రిటన్ నుంచి 1919 మార్చిలో భారతదేశానికి తిరిగి వచ్చారు.
మన దేశ గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిన చెప్పిన రామానుజన్ అనారోగ్యంతో తన 33 వ ఏట కన్నుమూశారు. బ్రిటన్‌లో ఉన్నప్పుడు ఆరోగ్యం గురించి ఏమాత్రం లెక్కచేయకుండా గణిత పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన ఇండియాకు వచ్చిన ఏడాది తర్వాత అంటే 1920 ఏప్రిల్ 26న అస్తమించారు. జీవిత చరమాంకంలో రామానుజన్ రాసిన మ్యాజిక్ స్క్వేర్, ప్యూర్ మాథ్స్‌కు చెందిన నెంబర్ థియరీ, మాక్ తీటా ఫంక్షన్స్ చాలా ప్రసిద్ధి పొందాయి.

సి హెచ్ ప్రతాప్ 

కామెంట్‌లు