రాక్షస వంశజుడు ,
పరమ విష్ణు ద్వేషియైన
హిరణ్యకశిపుడు,లీలావతి
సంతానం ప్రహ్లాదుడు...!!
గర్భస్థ దశలోఎదిగింది
జన్మించింది ,పెరిగింది
నారద మహర్షి ఆశ్రమంలో...
వింటున్న హరి కీర్తనలు
కంటున్న ఆశ్రమ వాతావరణం
జన్యు లక్షణాలను
అణిచివేయటం
మనస్తత్వ చిత్రణకు చెందిన
గొప్ప చమత్కారం...
ప్రహ్లాదుడి కథే
శాస్త్రీయ ఆధారం.!!
శ్రీహరిని వివరించే చదివే
అసలైన చదువు...
విష్ణువు గురించి చెప్పే గురువే
నిజమైన గురువు...
తండ్రి -హరి చేరుమనియెడి
తండ్రి తండ్రి! అని...
విస్పష్టంగా ప్రకటించిన
ప్రహ్లాదుడిని పరిచయం చేసింది
పోతన భాగవతం...!!
తండ్రి తపస్సుకు వెళ్ళిన
సమయంలో...
రాజపత్ని ,రాజమాతయైన
లీలావతిని ఇంద్రుడు
చెరపట్టి ....
ఘోరంగా అవమానించగా...
తల్లి పడిన ఆవేదన
గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే
గ్రహించిన
చైతన్యవంతుడు ప్రహ్లాదుడు...!!
మనసు లోలోపలి పొరల్లో
నిక్షిప్తమైన లోతైన గాయమే...
తిరిగి రేగి..
దేవతలపై కక్ష సాధించేలా చేసి
ఊచ కోత కోసిన వైనాన్ని ,
ప్రహ్లాదుడి స్వభావంలోని
వైరుధ్యాన్ని....
వివరించింది ఎర్రన హరివంశం....!!
హరినామ స్మరణతో
తండ్రికే బద్ద శత్రువై...
అనుక్షణం
తండ్రి పెట్టే హింసలను
చిరునవ్వుతో భరిస్తూ...
లేత ప్రాయంలోనే...
నృసింహావతారంలో
మహావిష్ణువుని ప్రసన్నం చేసుకున్న
"పుణ్య చరితుడు" భక్త ప్రహ్లాదుడు...!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి