"దిగేముందులోతుచూడాలి';-ఎం బిందుమాధవి
 గజ ఈతగాళ్ళు నీటిలో మునిగి చావరు అన్న గ్యారంటీ ఏమి ఉండదు.
తమ విద్యలో ఎంత నిష్ణాతులైనా..కాలం కలిసి రాకపోతే ఆ విద్యనుపయోగించి ప్రమాదం నించి బయటపడగలరు అని ఖచ్చితంగా చెప్పలేము.
పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ లో పాల్గొన్న ఇంజనీర్స్ విఫలమైన సందర్భాలుండచ్చు.
హస్తవాసి మంచిదనే పేరున్న డాక్టర్ చేతిలో రోగులు చావరు అనే ఖచ్చితత్వం ఉండకపోవచ్చు.
కాబట్టే ఒక పని మొదలుపెట్టే ప్రతి సారీ ...ముందుగా ఆ పని గురించిన కూలంకషమైన సమాచారం తెలుసుకోవాలి. అమలు పరిచే క్రమంలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యల గురించి ఒక అంచనా ఉండాలి అని పెద్దలు చెబుతారు.
రామాయణంలో ఉన్న ఇలాంటి అనేక సందర్భాల్లో ఒక దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం!
@@@@
సీతాన్వేషణకి లంకలో ప్రవేశించిన 'హనుమ' ఆమెని దర్శించుకుని..రామచంద్ర మూర్తి అంగుళీయకాన్ని ఆమెకిచ్చి రహస్యంగా, దొంగతనంగా తిరిగి వెళ్ళకూడదన్న ఆలోచనతో తన ఉనికి, శక్తి అక్కడి రాక్షసులకి తెలియచేయటానికి కవ్వింపు చర్యగా అక్కడి వనాలు, తోటలు నాశనం చేస్తాడు. భవనాలు నేల కూలుస్తాడు. పర్వతాలు పెకలించి పిండి పిండి చేస్తాడు.
ఎదిరించిన అనేక వేల రాక్షస వీరులని హతమారుస్తాడు. 'ఎక్కడినించో ఒక పెద్ద వానరం వచ్చి మన తోటలు, గృహాలు, వనాలు అన్నీ నాశనం చేస్తున్నది. ఎదిరించిన వారందరిని చంపేసింది' అని అతన్ని చూసి భయపడిన రాక్షస స్త్రీలు వచ్చి రావణుడికి తెలియజేస్తారు.
తన రాజ్యంలో నిర్మాణాలు, ఆకాశ హర్మ్యాలు..వాటి నిర్మాణ కౌశలం, గట్టితనం..వనాలు, తోటల నాణ్యత...తమ శిల్పుల పనితనం అన్నీ తెలిసిన రావణుడు...ఒక సామాన్య వానరం వాటిని నాశనం చెయ్యటం అసాధ్యం అనుకుంటాడు.
అప్పుడు రావణుడు హనుమతో యుద్ధం చేసి, అతన్ని పరిమార్చమని అనేక మంది వీరులని పంపిస్తాడు.
అలా పంపబడిన వారిలో... మిక్కిలి బలశాలి, పెద్ద పెద్ద కోరలు కలవాడు, సాటిలేని పరాక్రమ వంతుడు... ప్రహస్తుని పుత్రుడైన జంబుమాలిని హనుమ అవలీలగా మట్టు పెట్టాడు. గొప్ప బలశాలురు, ధనుర్ధారులు, అస్త్ర విద్యాలలో సుశిక్షితులు, శ్రేష్ఠులైన ఏడుగురు మంత్రి కుమారులని అవలీలగా హతామార్చాడు.
తరువాత..విరూపాక్షుడు, యూపాక్షుడు, దుర్ధరుడు, ప్రఘసుడు, భాసకర్ణుడు అనే
ఐదుగురు రావణ ప్రముఖ సేనా నాయకులు హనుమతో తలపడి ప్రాణాలు పోగొట్టుకున్నారు.
అనేక వేల ఏనుగులు, గుర్రాలు, రధాలు యుద్ధభూమిలో నేలకొరిగాయి.
ఆ తరువాత యుద్ధ విద్యలో ఆరితేరిన వాడు, అనేక అస్త్ర శస్త్రాల సంపద కలిగిన వాడు...తన తపశ్శక్తిచే అనేక వరాలు పొందినవాడు..అపురూపమైన రధం కలిగి, ఆ ప్రభావంతో ఎలాంటి శత్రువునైనా పరిమార్చగల యోధుడు అక్షకుమారుడు కూడా యుద్ధ భూమిలో మరణించాడు.
ఈ వార్తలన్నీ విన్న మహావీరుడైన రావణుడు తన మరొక కుమారుడైన ఇంద్రజిత్తుని పిలిచి... 'ఎనభై వేల మంది సైనికులు, జంబుమాలి, వీరులైన సేనానాయకుల పుత్రులు రణరంగంలో హతమైనారు.'
'నాతో సమానమైన బలము, పరాక్రమము కలిగిన నువ్వే ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలి. యుద్ధంలో ఇంద్రుడినే జయించిన మహా బలశాలివి నువ్వు. కదన రంగంలో నీచేత పరాజితుడు కాని వారెవ్వరూ లేరు. నీ భుజ బలపరాక్రమాలే నీకు రక్షణ కవచాలు. నువ్వు గొప్ప తపస్సంపన్నుడివి. వివిధ యుద్ధరీతుల్లో కుశలుడివైన నీకు అసాధ్యమైనదేదీ లేదు. నీ అస్త్ర బలము, శారీరక శక్తి అపారం.'
అయినప్పటికీ ఆ వానరం అసాధారణ శక్తివంతమైనది. తీవ్రమైన ప్రతాపం కలది. ఇతన్ని సామాన్యమైన శత్రువుగా ఉపేక్షించ రాదు. ఆ వానరుని బుద్ధి కౌశలమును, శారీరక బలమును, ప్రభావమును, పరాక్రమమును దృష్టిలో ఉంచుకుని ఒక అంచనాతో అతనితో యుద్ధానికి తలపడమని' హెచ్చరిస్తాడు.
'మునుపు వాలి, సుగ్రీవులనే వానరులని చూసి ఉన్నాను. ఇతను వారికంటే బలవంతుడు. భిన్నమైన శక్తి సామర్ధ్యాలు కలవానిగా భావించు' అని జాగ్రత్తలు చెప్పి యుద్ధానికి పంపిస్తాడు.
అసమాన బలపరాక్రమాలు, తపశ్శక్తి కల రావణాసురుడంతటివాడు..తనతో సమానమైన కొడుకుని యుద్ధానికి పంపేటప్పుడు..హనుమ శక్తి సామర్ధ్యాల గురించి తన ఆలోచన, అంచనాలు చెప్పి, అనేక జాగ్రత్తలు చెబుతాడు.
యుద్ధం ప్రారంభమై ఒక స్థాయికి చేరాక ఇంద్రజిత్తు..హనుమని జయించటం అసాధ్యమని తెలుసుకుని..అతన్ని బ్రహ్మాస్త్రంతో బంధించి అతన్ని కట్టడి చెయ్యటం మాత్రమే తరుణోపాయమనే నిర్ణయానికి వస్తాడు.
ఎంతటి శక్తివంతులైనా... ఎదుటివారి శక్తి సామర్ధ్యాల గురించి తెలుసుకోకుండా వారితో తలపడకూడదు. ముందుగా తెలుసుకుంటే..అందుకు తగిన ప్రణాళికలతో ముందుకు సాగితేనే విజయం స్వంతమవుతుంది అని మనకి ఈ సంఘటన నించి తెలుస్తుంది.


కామెంట్‌లు