వనం అనే అడవిలో ఒక కోతి ఉండేది. అది ఉదయమే ఆహారంకోసం పోతోంది. దారిలో నల్లమచ్చల కుందేలు ఎదురయింది. దాన్ని చూసి కోతి కిచకిచ నవ్వింది. తన మచ్చల ను చూసి నవ్విందని "ఛీ..ఛీ"అంటూ కుందేలు విసవిస వెళ్లిపోయింది. కొంతదూరం వెళ్లగానే కోతికి ఒక గున్న ఏనుగు ఎదురైంది. కోతి దానివైపు చూసి కిచకిచ నవ్వింది. ఏనుగు "ఛ..ఛ" అని గునగున వెళ్లిపోయింది.
కొంతదూరం వెళ్లగానే ఓ ఎలుగుబంటు ఎదురైంది.దాన్ని చూసి కిచకిచ నవ్వింది కోతి.దుమ్ము కొట్టుకు పోయిన తన వెంట్రుకలను చూసి నవ్విందని "ఛీ...ఛీ" అంటూ వెళ్లిపోయింది ఎలుగు. తర్వాత తోక తెగిపోయిన తోడేలు ఎదురైంది. దాన్ని చూసి నవ్వింది కోతి. అది "థూ...థూ" అంటూ వెళ్లిపోయింది. తర్వాత నాలుక మందం నక్క ఎదురయింది. కోతి దాన్ని చూసి నవ్వింది. అది "తీ...తీ" అంటూ వెళ్లిపోయింది.తర్వాత కుంటుతున్న గుర్రం ఎదురయింది.దానివైపు చూసి కిచకిచ నవ్వింది కోతి. అది "ఛా...ఛా" అంటూ వెళ్లిపోయింది.
జంతువులన్నీ సింహంరాజు దగ్గరకు వెళ్లి కోతి తమను చూసి హేళనగా నవ్విందని పిర్యాదు చేశాయి.
కోతిని పిలుచుకు రమ్మని కాకితో కబురంపింది సింహం.
కోతి రాగానే సింహం వైపు చూసి కిచకిచ నవ్వి,నమస్కరించింది.
ఆ నవ్వు చూసి సింహానికి దిమ్మతిరిగింది. "ఏం...ఒళ్లు ఎలాగుంది. అడవిలో జంతువులను చూసి హేళనగా నవ్వుతున్నా వట. నీకు ఏమయింది?"అంది సింహం.
"మహారాజా!మన్నించండి. నేను ఈమధ్య పల్లెకు వెళ్లాను. ఆరోజు నవ్వుల దినోత్సవ మట. అక్కడ ఒక సభ జరుగుతోంది. ఓ చెట్టుపైన కూర్చొని ఉపన్యాసం విన్నాను. 'నవ్వు ఆరోగ్యానికి చాలా మంచిది. మానసిక,శారీరక ఆరోగ్యానికి నవ్వు ఔషధంలా పనిచేస్తుంది. మన చుట్టూ ఉన్న వారిని చిరునవ్వుతో పలకరిస్తే సంబంధాలు బలపడతాయి.ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారిని అందరూ ఇష్టపడతారు. ముఖం ముడుచుకుని దూరంగా ఉండేవారిని ఎవరూ ఇష్టపడరు. అహంకారాన్ని వదిలి, నవ్వుతూ అందరినీ పలకరిస్తూ గడపండి. ఆనందమంటే ఏమిటో తెలుస్తుంది. ఒక కొత్త లోకాన్ని చూస్తారు.'అని చాలా మంచి విషయాలు చెప్పారు.కానీ నేను నవ్వి ఆప్యాయంగా పలకరిద్దామనుకునేలోగా అపార్థం చేసుకుని ఛీ...ఛా అంటూ వెళ్లడంవల్ల ఈ సమస్య వచ్చింది. ఇందులో నాతప్పు ఏమీలేదు"అని అసలు విషయం చెప్పింది కోతి.
సింహం జంతువులను సమావేశపరిచింది. "ఈరోజు నుండి నాతోసహా అందరం మనసులో ఏ కల్మషం లేకుండా నవ్వుతూ పలకరించుకుందాం.ఆరోగ్యంగా గడుపుదాం."అని చెప్పింది.
ఆరోజు నుండి ఆఅడవి ప్రేమను పంచే నవ్వులవనంగా మారిపోయింది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి