న్యాయమే గెలిచింది;-డి.కె.చదువులబాబు.

 గిరిపురంలోని గంగయ్య వద్ద ఒకగుర్రం ఉండేది.ఆగుర్రాన్ని బండికి కట్టేవాడు. ప్రయాణికులను,సరుకులను చేర్చడానికి గుర్రంబండిని ఉపయోగించేవాడు. అలా ఉదయంనుండి రాత్రిదాకా గుర్రంబండిని పరుగులు తీయిస్తూ బాగా సంపాదించే వాడు. గుర్రం కష్టపడుతూ చాలా సంవత్సరాలు డబ్బు సంపాదించి గంగయ్య కుటుంబాన్ని పోషించింది. వయస్సు ఎక్కువ కావడంవల్ల గుర్రం మునపటిలా వేగంగా పరుగెత్తడంలేదు.బండిని లాగలేకున్నాది. ఇక గుర్రం పనికిరాదని, దానికి తిండిపెట్టడం దండగని ఇంటినుండి తరిమేశాడు. గుర్రం అటూఇటూ తిరిగి ఇంటికి వచ్చింది.తిరిగి చర్నాకోలాతో కొట్టి తరిమాడు.
గుర్రం మెల్లిగా నడుస్తూ ఊరువదిలి పక్క గ్రామమైన ధర్మాపురం పొలిమేరలకు చేరుకుని,నీరసంగా పడిపోయింది. అక్కడ ధర్మయ్య అనేవాడు గుర్రాన్ని చూశాడు. ఆయాసపడుతున్న దాని పరిస్థితికి జాలిపడ్డాడు.దాని ముఖాన్ని నీటితో తడిపాడు.తిండి పెట్టాడు. నీళ్లు అందించాడు. తన ఇంటికి తీసుకుపోయా
డు. దానికి మంచి తిండిపెట్టి పోషించడం ఎలా అని ఆలోచించాడు. చివరకు ఒక ఆలోచన వచ్చింది. ఉదయమే గుర్రాన్ని తీసుకుని పొరుగునున్న పట్నానికి వెళ్లాడు.గుర్రంపైన పిల్లలను ఎక్కించుకుని మెల్లిగా అటూఇటూ నాలుగుసార్లు తిప్పి, అందుకుగాను డబ్బులు తీసుకోసాగాడు. అలా గుర్రానికి శ్రమలేకుండా విశ్రాంతిని ఇస్తూ ఉపయోగించుకునేవాడు. తనకు పనులులేనప్పుడు చుట్టుపక్కలనున్న గ్రామాల్లోను,పట్నంలోను గుర్రంపై పిల్లలను తిప్పేవాడు.డబ్బులు బాగా వచ్చేవి. ఒకసారి గిరిపురంలో గుర్రాన్ని తిప్పుతూ గంగయ్య కంటపడ్డాడు.  తాను పనికిరాదని తన్ని తరిమేసిన గుర్రాన్ని ధర్మయ్య ఇలా నేర్పుతో ఉపయోగించుకోవడం చూసి, గంగయ్యకు కడుపుమండింది. గుర్రం తనదని,ధర్మయ్యఇంతకాలం ఉపయోగించుకుని ధనం సంపాదించుకున్నందుకు తనకు గుర్రంతోపాటు ధనంఇవ్వాలని వాదనకు దిగాడు గంగయ్య. న్యాయాధికారి వద్ద పిర్యాదు చేశాడు. ఆఊరివాళ్లు 'గుర్రం గంగయ్యదే' అని సాక్ష్యం చెప్పారు. "ఇంతకాలం గుర్రాన్ని ధర్మయ్య పోషించాడు. గుర్రంతో ఏమి సంపాదించు కున్నాడో మనకు తెలియదు కాబట్టి ధనం ఇవ్వవలసిన పనిలేదు.నీగుర్రాన్ని నీవు తీసుకెళ్లవచ్చు"అనిగంగయ్యతో చెప్పాడు న్యాయాధికారి.
కానీ గుర్రం గంగయ్య వెంట వెళ్లడానికి గింజుకుంది.కన్నీరు కారుస్తూ ధర్మయ్య వైపు చూసింది.గుర్రం కళ్లెంను వదలమని న్యాయాధికారి గంగయ్యతో చెప్పాడు. గంగయ్య తాడును వదిలేయగానే గుర్రం ధర్మయ్య దగ్గరకు వెళ్లినిల్చుంది.
ఈలోగా ఒకమనిషి వచ్చి గంగయ్య గురించి వివరాలు న్యాయాధికారి చెవిలో చెప్పాడు. "నీగుర్రం తప్పిపోయి ధర్మయ్యకు దొరకలేదు. నిజంగా గుర్రం తప్పిపోయిఉంటే ఆరోజే పిర్యాదు చేసేవాడివి. నామనిషిని పంపి,నీవు ఉంటున్న వీధిలో విచారణ చేయించాను.గుర్రం వయస్సులో ఉన్నప్పుడు దాన్ని కష్టపెట్టి సంపాదించు కున్నావు. బండిని లాగుతూ పరుగులు తీసే శక్తితగ్గగానే, తిండి దండగని స్వార్థంతో గుర్రాన్ని కొట్టి,తరిమేసి కొత్తగుర్రాన్ని కొన్నావు.ఈరోజు ధర్మయ్య చేస్తున్న పని చూడగానే తిరిగి గుర్రంతో సంపాదించు కోవాలని లేదా అమ్ముకోవాలని ఆశపడి పిర్యాదు చేశావు. ధర్మయ్య దాన్ని బాగా చూసుకుంటున్నాడు.కాబట్టి మంచితనం గల ధర్మయ్యను గుర్రం కోరుకుంటోంది.అందుకు గుర్రం పోషణకొరకు ధర్మయ్యకు నీవు వెయ్యి వరహాలు ఇవ్వాలి" అని తీర్పు చెప్పాడు న్యాయాధికారి.
చక్కటి తీర్పుకు చుట్టూ ఉన్నవారు చప్పట్లు కొట్టారు.
కామెంట్‌లు