బహుమానం;-ఎస్‌. హనుమంతరావు;--8897815656

 తెలతెలవారుతోంది. వర్షాకాలం. గోదావరి నది వరదతో మహోగ్రరూపం దాల్చింది. ఎర్రటి నీళ్లతో సుళ్లు తిరుగుతూ భయంకరంగా ప్రవహిస్తోంది.
నది ఒడ్డుకు వచ్చాడు కిట్టయ్య. అతను గజ ఈతగాడు. వరదల్లో కొట్టుకువచ్చే చెట్టు మోడుల్ని, దుంగల్ని ఒడ్డుకు చేర్చి కలప వ్యాపారులకు అమ్ముతుంటాడు. ఎప్పుడు వరదలొచ్చినా అతను చేసే పని అదే.
ఒడ్డు మీద నిలబడ్డ కిట్టయ్యకి తీరానికి కాస్త దగ్గరగా ఓ చెట్టు మొద్దు నదిలో కొట్టుకువస్తూ కనిపించింది మసగ వెలుతురులో. తన లాంటి వారు ఎవరైనా వున్నారా అని అటూ ఇటూ చూశాడు. ఎవరూ లేరు. ఒకసారి ఊపిరి పీల్చుకుని కొట్టుకువస్తోన్న మొద్దు పైనే దృష్టి నిలిపి నిలుచున్నాడు.
చెట్టు మొద్దు వేగంగా దగ్గరకొచ్చే కొద్దీ అతనిలో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. నదిలోకి దూకబోతుండగా అతని దృష్టి చెట్టు మొద్దుపై నల్లగా కదులుతోన్న దాని మీద పడిరది. అది పాము... నాగుబాము... చెట్టు మొద్దుని చుట్టుకున్న ఆ పాము వరదలో కొట్టుకుపోతూ ప్రాణభయంతో భయపడి సర్రున పడగ ఎత్తింది. బుసలు కొట్టింది.
నదిలో దూకే ప్రయత్నం ఆపేసి, గట్టు మీదే చెట్టు మొద్దుతో పాటు పరిగెట్టసాగాడు కిట్టయ్య. పాముని చెట్టు మొద్దు నించి ఏదోలా తప్పించి దాన్ని స్వంతం చేసుకోవాలని అనుకున్నాడు అతను. ఆ సమయంలో అతనికి గట్టు మీద ఓ పొడవాటి చెట్టు కొమ్మ కనిపించింది. దాన్ని అందుకుని చెట్టు మొద్దు దగ్గరగా వుంచాడు. ఆ కొమ్మని చుట్టుకుని వరద నుండి బయట పడొచ్చని పాము ఆశపడిరది. కాని అతను తనను చంపే అవకాశముంది. చివరికి అది తెగించి ఆ కొమ్మకి బలంగా చుట్టుకుంది. వెంటనే కొమ్మని నదిలోకి దూరంగా విసిరేయాలనుకున్నాడు కిట్టయ్య. అలా చెయ్యడంవల్ల పాము బెడద తప్పుతుంది. చెట్టు మొద్దు దక్కుతుంది. కొమ్మతో పాటు పాము నదిలో కొట్టుకుపోతోంది. ఆ కొమ్మ చిన్నది కాబట్టి పాము బ్రతికే అవకాశం తక్కువ. ప్రాణాలు నిలబెట్టుకోవడం కోసం తనని నమ్మి తను అందించిన కొమ్మ మీదికి ఎక్కిన పాము ప్రాణాలకు ముప్పు తేవడం తప్పు అనిపించింది. అతనికి ఆ సమయంలో అతనిలో మానవత్వం పురి విప్పింది. ఇంకో ఆలచన లేకుండా ఆ కొమ్మని బలంగా పైకి లేపి, విసురుగా నదిలోకి కాకుండా గట్టుపై పొదల వైపు విసిరేశాడు.
పాము గట్టు మీద దబ్బున పడి బ్రతుకు జీవుడా అంటూ పొదల్లోకి దూరిపోయింది. ఈసారి నదిలోకి దూకి చెట్టు మొద్దుని పట్టుకుని ఈత కొడుతూ ఒడుపుగా ఒడ్డుకు చేర్చాడు. మొద్దుని ఒడ్డుకు ఎక్కించాక చూశాడు. అది మామూలు  చెట్టు మొద్దు కాదు. గంధపు చెట్టు మొద్దు. దానికి ధర చాలా పలుకుతుంది. తను మనిషిలా ఆలోచించి పాముని రక్షించినందుకు లభించిన బహుమానం ఆ గంధపు దుంగ అని అనుకుని ఆనందపడ్డాడు.
ఆ దుంగని కలప వ్యాపారికి కాకుండా సుగంధద్రవ్యాలు అమ్మే ఆసామికి అమ్మి బాగా డబ్బు చేసుకున్నాడు. తన కుటుంబానికి ఆర్నెల్ల గ్రాసం సంపాదించుకున్నాడు.
కామెంట్‌లు