వాకింగులా? మీటింగులా? : - అనురాధ బొడ్ల (సముద్రాల)-9989566696


 ఈ రోజు సాయంత్రం రోజూలాగే వాకింగ్ కోసం కిందికి దిగాను. ఒక యాభై అడుగులు అలా వేయగానే, ఒక పరిచయమున్న ఆవిడ పలకరించింది. ‘వాకింగ్ కోసమేనా? అయిపోయిందా?’ అని అడిగింది. లేదండీ, ఇప్పుడే వచ్చాను, అన్నాను. ‘నేనూ ఇప్పుడే మొదలు పెట్టాను. రా, కలిసే వెళ్దాం!’ అంటూ పిలిచింది. సరే, ఒక కంపెనీ ఉంటుందిగా అనుకుంటూ,  తనతో పాటే నడవటం మొదలు పెట్టాను.
ఆవిడ నా వయసే ఉండొచ్చు. లేదూ, ఒక రెండేళ్ళు పెద్దదై ఉండొచ్చు. అప్పుడప్పుడూ కలుస్తూంటుంది, గలగలా ఏదో ఒకటి మాట్లాడేసి వెళ్ళిపోతుంది అని తప్ప, తన వివరాలేమీ నాకు తెలియదు. అలా నడుస్తూ ఉండగా మా సంభాషణ ఇలా సాగింది. 
తను- రోజూ చేస్తావా వాకింగ్?
నేను - వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పుడప్పుడూ మిస్ అవుతూ ఉంటది. 
తను- తప్పకుండా చూసుకోవాలి మరి! ఎంతసేపు వాకింగ్ చేస్తావు నువ్వు? అని అడిగింది తను. 
నేను - ఒక పదిహేను లేదా ఇరవయి నిమిషాలు చేస్తాను. ఎప్పుడేనా ఒక అరగంట అవుతుంది.
తను - అయ్యో, అంతేనా? ఎన్ని స్టెప్స్ అవుతాయి ఆ టైంలో?
నేను - ఏమో మరి, అలా స్టెప్స్ కౌంట్ చెయ్యలేదు ఎప్పుడూ.
తను - అవునా, నేను ఒక అరవయి నిమిషాలు పైనే చేస్తాను. ఒక ఆరు నుంచి ఏడు వేల పైనే స్టెప్పులు కావాలి అంటారు మా పిల్లలు. ఇదిగో ఈ వాచ్ కొనిపెట్టారు, అంటూ తన చేతికున్న ఫిట్నెస్ వాచ్ చూపించింది. 
నేను - నిజమా! మంచిదే! అంటూ ఒక నవ్వు నవ్వాను.
    అన్నానే కానీ, మనసులో నాకు మథనం మొదలయింది. అందరూ బాగానే నడుస్తారు. టెక్నాలజీతో ట్రాక్ చేసుకుంటారు. ఏంటో నేనే, మరీ మసలిదానిలా, పదిహేను ఇరవయి నిమిషాల కంటే నడవట్లేదు. అమ్మో, ఇకనైనా కాస్త టైం పెంచాలి. నేను కూడా ఒక స్మార్ట్ వాచ్ పెట్టుకుంటే, ట్రాక్ చేసుకోవచ్చేమో! ఇలాగ! మనసులో బోలెడు గిల్టు ఫీలింగులూ, డిటర్మినేషన్లూ జరుగుతున్న వేళ…, మా పిల్లల మీద కొంచెం కోపం వచ్చింది, ఏంటో నాకొక స్మార్ట్ వాచ్ కొనిచ్చి ఇలా చెయ్యి అని చెప్పొచ్చుగా.  వాళ్ల పిల్లలు చూడు, ఎంత శ్రద్ధగా పట్టించుకుంటారు పెద్దల గురించి. మరీనే అనూ, నీ కొడుకు ఎంత చెప్తాడు నీకు? వింటావా నువ్వు? నీకు నువ్వే రారాణివి అనుకుంటావు, అని కోప్పడుతున్న మనసుని, సరి సర్లే అంటూ దాని నోరు మూయించాను. 
 ఇంతలో, ఒక బెంచీల సమూహం దగ్గర, నలుగురయిదుగురు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఈవిడ వాళ్లని పలుకరిస్తూ, రా! అంటూ నన్నూ తీసుకెళ్ళింది. అయ్యో, ఒక పది నిమిషాల నడక కూడా అవలేదు అని అనుకుంటూనే, మొహమాటంతో ఏమీ అనలేక నేనూ అటు వెళ్ళాను. అక్కడున్న అందరితో లోకాభిరామాయణం ఒక పది నిమిషాలు గడిచింది. ఆ తరువాత మళ్లీ మా నడక కొనసాగింది. 
    మరొక యాభై అడుగులకే మరొక హాల్ట్. నన్ను వెళ్ళనివ్వకుండా నా చెయ్యి పట్టుకునే మాటలు సాగాయి. ఈసారి తనూ ఒక బెంచీలో కూర్చుని, నన్నూ లాగేసింది బెంచి పైకి. ఈ సారి పదిహేను నిమిషాలు. అక్కడ జరిగే సంభాషణ వింటూ, అయ్యో వాకింగూ అని మనసు మూలుగుతున్నా, బలవంతంగా ముఖాన నవ్వు పులుముకుని కూర్చున్నాను. 
నేను వెళదామని ప్రయత్నించిన ప్రతిసారీ నన్ను ఆపేసింది. మొత్తం మీద ఒక పదిహేను నిమిషాల తరువాత అక్కడి నుంచి బయలుదేరాము. ఇలా నాలుగడుగులు వేసామో లేదో, మళ్ళీ ఎవరో ఎదురయ్యారు ఆవిడకి. వారితో మాట్లాడుతూ నిల్చుండి పోయింది. ఈవిడ వాకింగులు చేస్తుందా? మీటింగులు చేస్తుందా, అర్థం కాలేదు. 
ఇక ఉండబట్టలేక, నేను వెళతాను అన్నాను. ఆ…, సరే, మళ్లీ ఇంటికి వెళ్ళేటప్పుడు, నా స్టెప్స్ పూర్తయితాయిలే, నువ్వు వెళ్ళు అన్నది. హతాశురాలినయ్యాను. సమయం నలభయి నిమిషాలు దాటింది కానీ, నా పెద్ద రౌండులో సగం కూడా అవలేదు. అక్కడే నోరు తెరిస్తే బాగుండదని, గమ్మున నోరు మూసుకుని, ఒక ఏడవలేని నవ్వు నవ్వి, మెల్లిగా అక్కడినుంచి నడిచాను. 
  అలా నడుస్తూ ఉంటే, నేను ఎక్కడో చదివిన పద్యం లోని ఒక లైన్ ‘ఎరుక లేని నడక లేలనో యీ సృష్టి?’ అనేది గుర్తొచ్చింది. అది ఎవరి పద్యమో, మొత్తం పద్యం ఏంటో, ఎంత ప్రయత్నించినా కూడా గుర్తురాలేదు. కానీ, నడక పరమార్థం తెలియకుండా, ఈ స్మార్ట్ వాచీలు, స్టెప్ కౌంటులూ ఎలా మేలు చేస్తాయి? అని మాత్రం అనిపించింది.  సరే, మరి స్మార్ట్ వాచ్ కొంటున్నావా? అని అడిగింది మనసు.
అబ్బే వద్దు! నేను చేసే వాక్ షో ఈజ్ గుడ్ ఇనఫ్. I don’t need any talk shows and smart shows! అని నవ్వుకుంటూ ముందుకెళ్లాను. 
********
కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Meeru chaala baaga unnadi unnatlu vrastunnaru.