దెబ్బకి దెబ్బ (బాలల జానపద సరదా కథ) - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

  ఒకూర్లో ఎల్లన్నని ఒక ముసిలోడు వుండేటోడు. ఆయనకు ఇద్దరు కొడుకులు. పెద్దోడేమో పెద్ద టక్కరోడు. చిన్నోడేమో ఏమీ తెలీని అమాయకుడు. వాళ్ళ దగ్గర ఒక మంచి కంబళి, బాగా పాలిచ్చే ఆవు, విరగబడి కాసే మామిడి చెట్టూ వుండేటివి. 
ఎల్లన్న వయసు పైబడ్డంతో ఒకరోజు చనిపోయినాడు.
ఎల్లన్న చనిపోయినాక పెద్దోనికి ఆస్తి మీద కన్నుపడింది. ఎట్లాగైనా అంతా తానే కొట్టేయాలనుకున్నాడు. 
ఒకరోజు తమ్మున్ని పిల్చి “ఒరే... నాన్న మనకు పోతాపోతా ఒక కంబళి, ఒక మామిడి చెట్టు , ఒక ఆవు ఆస్తిగా మిగిలిచ్చి పోయినాడు. వీటిని ఇద్దరమూ సమానంగా పంచుకుందాం" అన్నాడు. తమ్ముడు అమాయకంగా “సరే అన్నా... నువ్వెట్లా చెప్తే అట్లాగే” అన్నాడు.
పెద్దోడు పెద్ద మాయగాడు గదా... దాంతో “రేయ్... కంబళి పొద్దునంతా నువ్వు తీసుకో, రాత్రి నేను తీసుకుంటా. అట్లాగే మామిడి చెట్టు కిందభాగం నువ్వు తీసుకో, పైభాగం నేను తీసుకుంటా. అట్లాగే ఆవు ముందు భాగం నువ్వు తీసుకో, వెనుక భాగం నేను తీసుకుంటా.. సరేనా" అన్నాడు. 
తమ్ముడు చానా అమాయకుడు గదా... దాంతో సరేనంటూ సంబరంగా ఒప్పుకున్నాడు.
ఆరోజు నుండీ చిన్నోడు రోజూ పొద్దునా, సాయంత్రం ఊరి బైటకు పోయి గడ్డి కోసుకోనొచ్చి ఆవుకేస్తా వుంటే పెద్దోడేమో హాయిగా పాలు పితుక్కోసాగినాడు. చిన్నోడు రోజూ మామిడి చెట్టుకు నీళ్ళు పోసి, ఎరువులు వేస్తావుంటే పెద్దోడు కాసిన కాయలు కాసినట్టు తమ్మునికి ఒక్కటిగూడా ఇవ్వకుండా అన్నీ తానే తెంపుకోసాగినాడు. చిన్నోడు పొద్దునపూట కంబళిని ఏం చేయాలో తెలీక మడిచి మట్టసంగా గూట్లో పెడతా వుంటే, పెద్దోడు రాత్రి కాగానే దాన్ని తీసుకొనిపోయి హాయిగా కప్పుకొని పడుకొనేటోడు.
కొంతకాలానికి చిన్నోనికి పెళ్ళయ్యింది. చిన్నోని పెండ్లాం చిన్నోని లెక్క అమాయకురాలు కాదు. మంచి తెలివైనది. కొద్దిరోజుల్లోనే పెద్దోడు చేస్తావున్న మోసం గమనించింది. ఒకరోజు మొగున్ని కూచోబెట్టుకోని "సగం సగం అంటే కాచే కాయల్లో సగం, పితికే పాలల్లో సగం.... అంతేగానీ కష్టమొకరికీ, సుఖమొకరికీ కాదు. మీ అన్న నిన్ను అమాయకున్ని చేసి అంతా మోసం చేస్తా వున్నాడు" అంటూ జరుగుతున్నదంతా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్లు చెప్పింది. దాంతో వానికి అన్న చేస్తావున్న మోసం బాగా అర్థమయ్యింది. దెబ్బకు దెబ్బ ఎలా తీయాల్నో పెళ్ళాన్నడిగి తెల్సుకున్నాడు.
తరువాత రోజు పొద్దున్నే కంబళి నీళ్ళలో బాగా తడిపి పెట్టినాడు. రాత్రి ఎప్పట్లాగానే పెద్దోడు దాన్ని తీసుకొని పోయి కప్పుకుంటే ఇంగేముంది... ఒళ్ళంతా తడిచిపోయి చలి చలిగాదు. 
"ఇదేందిరా ఇట్లా తడిపినావు"
అంటే "నా యిష్టం. నేనేమన్నా రాత్రి తడిపినానా. పొద్దున తడిపినా గానీ" అంటూ అడ్డం తిరిగినాడు. దాంతో పెద్దోడు కిక్కురుమనలేదు.
తరువాత రోజు పొద్దున్నే పెద్దోడు పాలు పిండుకుందామని చెంబు తీసుకోనొచ్చి కూర్చున్నాడు. వాడు పాలు పిండడానికి చెయ్యి వెయ్యడం ఆలస్యం చిన్నోడు వెంటనే ఆడికి వచ్చి ఆవు మొగమ్మీద కట్టెతో ఈడ్చి ఒకటి పెరికినాడు. అంతే దానికి సుర్రుమనడంతో అది ఎగిరి పెద్దోని మొగమ్మీద ఈడ్చి ఒక్కటి పెరికింది. ఆ దెబ్బకి వాడు అమ్మా... అబ్బా.... అని మూలుగుతా “అదేందిరా తమ్ముడూ ఇట్లా కొట్టినావు" అన్నాడు. 
దానికి వాడు "నాయిష్టం... నేనేమన్నా వెనుకవైపు కొట్టినానా. నావైపు కొట్టినాగానీ" అంటూ అడ్డం తిరిగినాడు. దాంతో పెద్దోడు పాలు పిండుకోలేక మట్టసంగా వెనక్కి పోయినాడు.
కాసేపటికి చిన్నోడు ఒక గొడ్డలి తెచ్చి ఇంటి ముందున్న మామిడి చెట్టును రపరపరప నరక సాగినాడు. అది చూసి పెద్దోడు అదిరిపడి వురుక్కుంటా వచ్చి “అదేందిరా తమ్ముడూ... బంగారంలాంటి చెట్టును అట్లా నరుకుతా వున్నావు" అన్నాడు. దానికి వాడు “నాయిష్టం... నేనేమన్నా నీభాగం నరుకుతా వున్నానా, నాభాగం నరుక్కుంటావున్నా గాని" అంటూ అడ్డం
తిరిగినాడు. 
దాంతో పెద్దోడు తప్పయిందంటూ లెంపలేసుకోని "ఇప్పట్నించీ ఇద్దరం అన్నింటినీ సమానంగా పంచుకుందాం" అంటూ దారికొచ్చినాడు. ఆరోజు నుండి పాలూ, పండ్లూ అమ్మగా వచ్చిన డబ్బును సగం సగం పంచుకుంటా... కంబళిని పెద్దోడొక నెలరోజులు, చిన్నోడొక నెలరోజులు తీసుకోసాగినారు.
**********
కామెంట్‌లు
Sridhar Akkineni - ( He )Artiste' చెప్పారు…
డాక్టర్ గారికి..కృతజ్ఞతలు,
నమస్సులు.