బతుకమ్మ;-డాక్టర్ అడిగొప్పుల సదయ్య-9963991125
వెములాడ పురిలోన వెలసి కాచెడి తల్లి!
రాజరాజేశ్వరీ! ప్రణతులివె బతుకమ్మ!

రాజరాజను రాజు రాజరాజేశ్వరుని
తరలించె తన పురము తండ్రికై బతుకమ్మ!

పతి బాసి యొంటరిగ వగచెంది దిగులొంద
జనులంత పూలతో ఘనలింగమును చేసి

ఇదుగొ శివుడొచ్చెనని అదుగొ శివుడొచ్చెనని
పూలలింగము జూపి వూరడించెను నిన్ను

ఎంత కాలము గడిచె, ఏమయ్యె నా శివుడు
కళ్ళు కాయలు కాచె, కనపడడె యికనంటు

అనుదినము పతి కొరకు ఆతురత మీరగా
కళ్ళ కాంక్షలు పార వెళ్ళదీసితివమ్మ!

బంగారు పుష్పాల భాసిల్తు,గంధాల
సింగారివైతివే శివుడికై బతుకమ్మ

రంగారు కుసుమాల రమణీయ శోభతో
బయలెల్లితివె తల్లి పతి కొరకు బతుకమ్మ!

నిను చేరవస్తాడు నీ భవుడు బతుకమ్మ!
నిను చేర్చు కుంటాడు నీ ధవుడు బతుకమ్మ!

వగపొందకే తల్లి! బంగారు బతుకమ్మ!
దిగులొందకే మళ్ళి, దివ్యమౌ బతుకమ్మ!

తంగేడు పువ్వుల్లొ తళుకులీనుతు మమ్ము
తరియింపజేయవే తల్లిరో బతుకమ్మ!

గునుగుపూ సొగసుతో గుంభనముగా మెరసి
గుండెలో నిలిచిపో కొమ్మరో బతుకమ్మ!

గుమ్మడాకుల పూల కొమరుతో శోభిల్తు
అనుకంపనీయవే అమ్మరో బతుకమ్మ!

బంతి చేమంతులను ఇంతి కాంక్షయు కూడి
ఇనుమడించెనె సొబగు ఇభయాన బతుకమ్మ!

కులమతాలను పెంచి కుమ్ములాటలు రేపు
తుచ్ఛ పాలకులనిల తొలగించు బతుకమ్మ!

వావి వరుసలు మాని పసి-ముసలి యని లేని
కామాంధకారులను కడతేర్చు బతుకమ్మ!

పాఠశాలల్లోన బాలలకు చదువుతో
సంస్కారమును నింపి సవరించు బతుకమ్మ!

జగతిగతి మార్చేసి జవసత్త్వముల తీసి
భయపెట్టు విషక్రిమిని పరిమార్చు బతుకమ్మ!

చరవాణి చెరనుండి నరజాతి విడిపించి
సంఘమై బతకమని శాసించు బతుకమ్మ!

పదిలంగ బయలెల్లి పతిచేరి మా వెతలు
పురుషకారముచేసి పోగొట్టవే తల్లీ!!
======================
డాక్టర్ అడిగొప్పుల సదయ్య
వ్యవస్థాపక అధ్యక్షుడు
మహతీ సాహితీ కవిసంగమం -కరీంనగరం


కామెంట్‌లు