ప్రేమ;-: సి.హెచ్.ప్రతాప్;-
 మోహన్ స్కూలుకు వెళ్తుంటే దారిలో రోడ్డు పక్కన దెబ్బలు తగిలి ఏడుస్తున్న ఒక చిన్న కుక్కపిల్ల కనిపించింది. దాని వయస్సు ఒకటి రెండు నెలల కంటే ఎక్కువ వుండదు. తల్లి నుండి వేరైపోయింది. దానిని ఇంకొక కుక్క ఏదైనా కరిచి ఉండవచ్చు. కాలి మీద దెబ్బ వుంది. దాని నుండి రక్తం ఆగకుండా వస్తొంది. ఆ నొప్పికి, ఆకలికి తాళలేక కుయ్యో మొర్రో అని ఏడుస్తూ వుంది. దానిని చూడగానే మోహన్ కు జాలి వేసింది. వెంటనే దానిని జాగ్రత్తగా ఎత్తుకొని, ప్రేమగా రాస్తూ ఇంటికి తీసుకువచ్చాడు. స్కూలు ఎగ్గొట్టి కుక్కపిల్లతో ఇంటికి తిరిగి వచ్చిన మోహన్ ను చూసి వాళ్ళమ్మ కయ్ మంది.స్కూలు నుండి తిరిగొచ్చెయ్యడమే కాకుండా దుమ్ము ధూళితో మట్టిగొట్టుకుపోయి వున్న ఆ కుక్క పిల్లను చూడగానే అంతెత్తున ఎగిరింది.
" ఈ దారిన పోయే దరిద్రాన్ని ఎందుకు ఇంటికి తీసుకొచ్చావు ?" అని అడిగింది. వాళ్ళమ్మ.
" అమ్మా, ఈ చిన్నదానికి తల్లి కూడా లేదు. ఆకలితో ఏడుస్తోంది, పైగా దెబ్బ కూడా తగిలింది. దీనికి వైద్యం చేయిద్దాం" అని అడిగాడు మోహన్.
మొదట్లో అందుకు వాళ్ళమ్మ ఒప్పుకోలేదు. ఆవిడకు చాదస్తం, పట్టింపులు చాలా ఎక్కువ. జంతువులు, పక్షులు తన ఆచారాన్ని మంట గలుపుతాయని ఆవిడ నమ్మకం. అయితే మోహన్ మాత్రం తన పట్టు విడవలేదు. ఎలాగైనా సరే దానికి వైద్యం చేయించి, కాస్త పెద్దదయ్యాక వదిలేద్దాం అని అమ్మను బ్రతిమిలాడాడు. అలాగే దానిని వదిలేస్తే ఏ పెద్ద కుక్కో వచ్చి దానిని చంపేస్తుందని, అలా జరిగితే తమకే పాపం అంటుతుందని, పైగా దానికి సేవ చెస్తే ఒక జీవికి ప్రాణం పోసినందుకు గొప్ప పుణ్యం లభిస్తుందని చెప్పాడు. పాప పుణ్యాల ప్రసక్తి వచ్చే సరికి వాళ్ళమ్మ కాస్త మెత్తబడింది. సరే అని, అయితే దానిని ఇంట్లోకి తీసుకురాకూడదని,దానితో ఆడుకున్నాక మోహన్ తప్పక స్నానం చేయాలని, కుక్క పిల్ల ధ్యాసలో పడి తన చదువు నిర్లక్ష్యం చేయకూడదని, ఆ కుక్క కాస్త పెద్దదై తనంతట స్వతంత్రంగా బ్రతకగలిగే వయస్సు వచ్చాక బయట వదిలెయ్యమని  షరతులు పెట్టింది.
ఆ క్షణం నుండి ఆ కుక్కపిల్లను జాగ్రత్తగా సంరక్షించసాగాడు మోహన్. వేళకు శుభ్రం చేస్తూ, పాలు బిస్కెట్లు పెడుతూ జాగ్రత్తగా చూసుకో సాగాడు. ఇంటి వెనుక పెరట్లో కార్టన్ బాక్సులతో ఒక చిన్న ఇల్లు తయారు చేసి అందులో ఆ కుక్క పిల్లను పెట్టాడు.
నెల రోజుల తర్వాత ఆ కుక్క పిల్ల ఎంతో ఆరోగ్యంగా బొద్దుగా తయారయ్యింది. ఇంటి చుట్టూ చలాకీగా  తిరుగుతూ ఇంట్లో మనుష్యులు కనిపిస్తే చాలు చుట్టు ప్రదక్షిణ చేస్తూ కాళ్ళు నాకడం చేసేది.
అమ్మకు వాగ్దానం చేసినట్లు మోహన్ ఒకరోజు ఆ కుక్క పిల్లను తెచ్చి అమ్మకు చూపించి" ఇది , ఇప్పుడు కాస్త పెద్దదయ్యింది. ఆరోగ్యంగా కూడా వుంది. ఈ రోజు దీనిని స్కూలుకు వెళ్లేటప్పుడు  ఇంటికీ దూరంగా వదిలేస్తాను" అని చెప్పాడు.
మోహన్ వాళ్ళ అమ్మను చూడగానే ఆ కుక్కపిల్ల మోహన్ చేతుల్లోనుండి గెంతి వాళ్ళ అమ్మ చుట్టూ తిరిగి ఆవిడ కాళ్ళను ఎంతో ప్రేమతో నాకసాగింది. మీరంటే నాకెంతో ఇష్టం. నన్ను దయచేసి వదలవద్దు. మీకు ఎంతో విధేయతతో వుంటాను  అన్నట్టు ఆవిదను చూడసాగింది.
ఆ కుక్క చూపుల్లో భావాలను అర్ధం చేసుకున్న మోహన్ అమ్మగారి మనస్సు ఆర్ద్రమయ్యింది. వెంటనే దానిని చేతుల్లోకి తీసుకొని ప్రేమతో రాయసాగారు.
అమ్మ చేతల్లోని అంతర్యాన్ని అర్ధం చేసుకున్న మోహన్ మనస్సు ఆనందంతో నిండిపోయింది.
 
సి హెచ్ ప్రతాప్ 


ఫ్లాట్ నెంబర్ : 405 ,శ్రీ బాలాజీ డిలైట్స్
రాహుల్ కోలనీ, ఎ ఎస్ రావు నగర్
సాయి సుధీర్ కాలేజీ వద్ద
హైదరాబాద్ 500 062

కామెంట్‌లు