మెరుగైన ప్రపంచం;- సి హెచ్.ప్రతాప్
 ఒక సందర్భంలొ ఒక గురువుగారికి , అతని ప్రియ శిష్యుడికి  సంవాదం జరిగింది.

" మహాత్మా, ఈ లోకంలో ఎటు చూసినా కష్టాలే కనిపిస్తున్నాయి. కిందటి యుగం తో పోలిస్తే నేడు ప్రజలు పడుతున్న కష్టాలు, బాధలు ఎక్కువౌతున్నాయి. అందరూ ఏదో ఒక అసంతృప్తితో, అశాంతితో వున్నట్లు అనిపిస్తోంది. వీరి కష్టాలు తొలగించేందుకు నువ్వు వీరిని భగవంతుని సామ్రాజ్యానికి ఎందుకు తీసుకువెళ్ళడం లేదు?" అని ప్రశ్నించాడు  .
గురువు చిరుమందహాసం చేసి " ప్రజలు ఈనాడు స్వర్గానికి రావడానికి సిద్ధంగా లేరు. కాబట్టి వారికి నేనేం చెయ్యలేను. ఒక పని చెయ్యు. నువ్వు స్వయంగా వెళ్ళి భగవంతుని సామ్రాజ్యానికి రావడానికి ఎవరైనా సిద్ధంగా వున్నారేమో తెలుసుకొని వారిని ఇక్కడికి తీసుకురా. అయితే అక్కడ కు వెళ్ళేవారు తమ చెడు ఆలోచనలు, చెడు అలవాట్లు, చెడు సావాసాలు వదిలిపెట్టాల్సి వుంటుంది" అని అన్నాడు.
శిష్యుడు స్వయంగా బయలుదేరాడు. దారిలో ఒక చెట్టు కింద గుర్రు పెట్టి కునుకు తీస్తున్న ఒక యువకుడిని నిద్ర లేపి భగవంతుని సామ్రాజ్యానికి రావడానికి సిద్ధంగా వున్నావా " అని గురువు అందుకు పెట్టిన షరతులను చెప్పాడు.

అందుకు ఆ యువకుడు గాభరా పడుతూ " ఇక్కడే నాకు హాయిగా వుంది. నా స్నేహితులను వదిలి అక్కడికి రాలేను" అని ఖచ్చితంగా చెప్పాడు.

మరికొంత దూరం వెళ్ళాక శిష్యుడికి  ఒక త్రాగుబోతు కనిపించాడు. శిష్యుడు అతడిని ఇంతకుముందు వాడిని అడిగినట్లే అడగగా " అమ్మో, సాయంత్రం ఒక మందు సీసా పడనిదే నాకు నిద్ర పట్టదు.అంత మంచి అలవాటు వదిలి నేను భగవంతుని సామ్రాజ్యానికి రాను." అని చెప్పాడు.

ఇంకాస్త ముందుకు వెళ్ళగా బురదలో పొర్లుతున్న ఒక పంది కనిపించింది.దానిని అదే ప్రశ్న శిష్యుడు అడగగా" అక్కడ బురద వుంటుందా ?ఆ అని అడిగింది పంది.
" "వుందదు.అక్కదంతా పచ్చదనం, పరిశుభ్రతే వుంటుంది" చెప్పాడు శిష్యుడు.
" మరి అక్కడ తినడానికి అమేధ్యం దొరుకుతుందా?" అడిగింది పంది.
"చీ చీ, నీ పాడు పంది బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. అక్కడ తినడానికి పంచ భక్ష్య పరమాన్నాలు దొరుకుతాయి"  చెప్పాడు శిష్యుడు.
"అలా అయితే, అక్కడికి నేను రాను. ఈ బురదా, గంపెడు పిల్లలు, తినేందుకు కమ్మని అమేధ్యం , ఇవే నాకిష్టం" ఖచ్చితంగా చెప్పింది ఆ పంది.
శిష్యుడికి నోట మాట రాలేదు. ఎవరూ తామున్న పరిస్థితుల నుండి బయటకు రావడానికి సిద్ధంగా లేరు. పైగా కష్టాలనే ఇష్టంగా స్వీకరిస్తున్నారు. మెరుగైన ప్రపంచంలోనికి రావడానికి త్యాగాలను చెయ్యడానికి కూడా సంసిద్ధంగా లేరు. ఇదే విషయాన్ని గురువు గారికి చెబితే ఆయన నా మాటలలోని అంతరార్ధం ఇప్పటికైనా అర్ధం అయ్యిందా అన్నట్లు చూసారు.
అందుకే నాటి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు  మానవులలో వెయ్యిమందిలో ఏ ఒక్కడు ,మాత్రమే నన్ను పొందడానికి సంసిద్ధులుగా వుంటాడని తెలిపారు. 
కామెంట్‌లు