కల్ప తరువు /;-టి. వి. యెల్. గాయత్రి--.పూణే. మహారాష్ట్ర.


 కనక వృక్షమనెడి వింత కలలు గనుచు 
మనిషి శోచించి శోధించి మహిని వెదుక
దొరక లేదింత వరకు నీ ధరణి యందు
వ్యర్థ మైనట్టి యాశలు బ్రతుకు నెపుడు
చింతలందున నెట్టుచు చెఱుపు చేయు.
కనక రాశిని పొందగా కలిమి వచ్చు
మదిని శాంతిని కొనగల మహిమ కలదె?
ధనము కోసము మనుజులు దారి తప్పి
తుదకు నడుసులో పడిపోవ తూలి పోయి
చివర కేమియు మిగులదు చిత్త మందు
సంత సంబును కొని తెచ్చు సాధనముల
చేయ వలయును మనుజులు చేవ గలిగి.
పరుల కుపకారమునుచేసి వసుధ యందు
నిల్చి యున్నట్టి మనిషికి నిత్య మెపుడు
దైవ మిచ్చును తృప్తినే ధనము గాను
మంచి తనమన్న వృక్షము పెంచు చుండి
వసుధ యందున మనుజులు వర్థిలంగ
నంతు లేనట్టి సంపద లవని యందు
కురియు చుండును నిరతము కొరత లేక 
కల్ప తరువులు ప్రతి యింట పెరిగి పెరిగి
విలువలన్నియు నేర్పుచు వెలుగు పంచు.
--------------------------

కామెంట్‌లు