నాకు నచ్చని ఓ సినిమా;-అమ్మ చెప్పింది;- సుమ కైకాల
 ఈ సృష్టి లో, నా దృష్టిలో అమ్మ ప్రేమ అమరం... అమ్మంటే స్వార్థం ఎరుగని ప్రేమ ఒయాసిస్సు! తను మరణం అంచు వరకూ వెళ్తాను అని తెలిసినా చాలా ఆనందంగా మరో ప్రాణికి జన్మనిస్తుంది. బిడ్డ ఎదుగుదల కోసం అలుపు ఎరుగని సైనికుడిలా పోరాటం చేస్తుంది.
కన్న సంతానం అందంగా ఉన్నా, లేకపోయినా అమ్మ కళ్ళకు మచ్చ లేని చందమామ లాగానే కనిపిస్తారు. 
నాకు ఈ సినిమాలో అమ్మ పాత్ర అమ్మ స్థానానికే మచ్చ తెచ్చినట్లుగా అనిపిస్తుంది. అమ్మంటే ఒక నమ్మకం! అమ్మ చెప్పిందంటే ఇక తిరుగు ఉండదు అనే ఒక విశ్వాసం! 
అలాంటిది ఈ సినిమా లో చచ్చిపోతాడు అని తెలిసినా ఒక అమ్మ కొడుకుని బాంబు దగ్గరకు పంపదు... తను వెళ్లొచ్చు కదా? 
మానసిక వైకల్యత ఎవరికి ఉన్నట్లు?
వీరమాత యుద్ధానికి పంపినట్లు భావించటం అసలు నచ్చలేదు. అబద్దమాడి పంపిస్తూ కుమిలిపోయే బదులు తను పోవడం మంచిది కదా!
కేవలం అమ్మ చెప్పింది అన్న ఒకే ఒక కారణంతో చచ్చిపోతాను అని తెలిసినా బాంబు దగ్గరకు వెళ్ళిన కొడుకు పాత్ర లో ఔన్నత్యం ఉంది. 
కొడుకు దేశం కోసం చనిపోతే కానీ అతడి మంచితనం అర్థం కాని తండ్రి, తమ్ముడు... ప్రాణం పోయాక ఫోటోకి దండ వేసి కన్నీళ్లు పెట్టడం ప్రేమరాహిత్యానికి దర్పణం పట్టింది.
తప్పు ఎవరు చేసినా మరొకరిని చావుకి చేరువ చేసే హక్కు ఎవరికీ లేదు. అలా చేసే అవకాశం శర్వానంద్ పాత్రకు మాత్రమే లేదు కదా? తల్లి, తండ్రి, తమ్ముడు ఇలా ఎవరయినా చేయవచ్చు. 
బుద్ధి మాoద్యుడు అయినంత మాత్రాన అతడే చావుకి అర్హుడు అన్నట్లు ఉన్న ఈ సినిమా నాకు నచ్చలేదు.

కామెంట్‌లు