*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - 093*
 *చంపకమాల:*
*సిరిగలనాఁడు మైమరచి | చిక్కిననాఁడు దలంచి పుణ్యముల్*
*పొరిఁ బొరి సేయనైతినని | పొక్కినఁగల్గనె గాలి చిచ్చుపైఁ*
*గెరలినవేళఁ దప్పికొని | కీడ్పడువేళ జలంబుఁగోరి త*
*త్తరమునఁ ద్రవ్వినంగలదె | దాశరధీ ! కరుణాపయోనిధీ !* 
తా: దశరధ పుత్రా! కరుణా సముద్రా! దశరధరామా!   
సంపదలు ఉన్నప్పుడు ఒంటిపైన స్పృహ లేకుండా ఖర్చు చేసి, ఆ సంపదలు పోయాక వెతికి వెతికి పుణ్యము వచ్చే పనులు చేయాలి అనుకుంటే ఏమీ ఫలితము వుండదు. ఎలా అంటే, నిప్పు అంటుకుని బలంగా వీచే గాలి వల్ల ఇల్లు, ఒళ్ళు తగలబడుతుంటే, అప్పుడు నీరు కోసం బావి తవ్వడం మొదలు పెడితే ఉపయోగం వుండదు కదా, అలాగ!.....అని భద్రాచల రామదాసుగా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*"ఏ పనులు ఎప్పుడు చేయాలో అప్పుడు చేయాలి తప్ప, మనకు తోచినప్పుడు చేద్దాములే అని కూర్చో కూడదు" అనేది పెద్దల మాట. శరీరానికి ఇబ్బంది కలిగినప్పుడు మందుల షాపు నుండి తెచ్చుకున్న ఔషదము ఎక్సపైర్ కాకముందే వాడుకోవాలి, కానీ పాడైపోయాక వాడితే ప్రాణానికే హాని కలుగుతుంది. ఇది నిజం. అందుకే యవ్వన బలం శరీరంలో వున్నప్పుడే భగవంతుని సన్నిధకి చేరే నిశ్చయమైన ప్రయత్నం చేయాలి. ముసలితనము వచ్చాక, శరీరలో సత్తువ తగ్గుతుంది, పళ్ళు ఊడిపోయి, నాలిక తడబడి పరాత్పరుని పేరు పలకడం కష్టంగా వున్నప్పుడు, అయ్యో! నామస్మరణ చేయలేక పోతున్నానే అని బాధపడితే ఏమీ ఉపయోగం వుండదు. ఎవరూ మనల్ని భవజలది దాటించడానికి సహాయం చేయలేరు. అందుకని, నిస్సత్తువ రాకముందే మన మనసు రమాపతిపై లగ్నమయ్యేలా కమలనాభుడు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ.........*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు