మారుతున్నాయా? మాయమవుతున్నాయా? : - నురాధ బొడ్ల (సముద్రాల)-9989566696


 ఈ రోజు ఆదివారం. మా కమ్యునిటీలో ఏదో వ్యాపార సంస్థ స్టాల్స్ పెట్టింది. రోజువారీ వాకింగ్ త్వరగా ముగించుకుంటే ఆ స్టాల్స్ ఏవో  చూడొచ్చు కదా అని సాయంత్రం ఐదు గంటలకే వాకింగ్ కోసం కిందికి దిగాను. ఆదివారం సాయంత్ర సమయం, అందులోనూ స్టాల్స్ ఉండటం వల్లనేమో కమ్యునిటీ అంతా అన్ని వయసుల వాళ్ళతో  సందడి సందడిగా ఉంది.  స్టాల్స్ వేపునుంచి వస్తున్నారేమో, కొంతమంది పెద్దవాళ్ళు  బ్యాగులతో కనపడితే, అక్కడక్కడా పిల్లలు ఐస్క్రీములు తింటూ వస్తున్నారు. 
   సాయంత్ర సమయం, చల్లగా వీస్తున్న గాలి, నా దృష్టి ఆ గాలికి ఊగుతున్న, రేగుతున్న ఆడవాళ్ల జుట్టుపై పడింది. ఏంటో, పది పదిహేనేళ్ళ పిల్లల నుంచి, పాతిక ముప్పై ఏళ్ళ పెద్ద పిల్లల వరకూ అందరిదీ ఒకటే దారి. దాదాపు అందరూ జుట్టు వదిలేసే ఉన్నారు. ఎవరో ఒకరిద్దరు, పైన రెండు పాయలకు ఒక క్లిప్ పెట్టి, మిగిలినదంతా గాలికి వదిలేసారు. ఎక్కడో ఒకరు చిన్న రబ్బర్ బ్యాండ్ పెట్టారు. చిన్నగా ఉంటే సరే ఒక పోనీటైల్ వేసుకోవచ్చు. చక్కగా పొడగాటి వెంట్రుకలు ఉన్నా కూడ ఎవరూ జడ అల్లటమే మానేశారు. ఎందుకలా అందరూ జుట్టు వదిలేసుకుంటారు. ఆ జుట్టంతా మెడల మీద పరుచుకునీ, గాలికి మొఖం మీద పడుతూ చికాకుగా ఉండదా వాళ్ళకి?
 అలా అనుకుంటుంటే గుర్తొచ్చింది. ఆ మధ్య మా మనుమరాలికి యు.ఎస్. లో కరాటే బ్లాక్ బెల్ట్  గ్రేడింగ్ సెరిమొనీ జరిగింది. ఆ ప్రోగ్రాం వీడియోలో, వాళ్ల కోచ్ మా మనుమరాలికి బెల్ట్ కడుతూ ఉంటే తన వెంట్రుకలు అడ్డం వస్తూ ఉన్నాయి. అవి తప్పించటానికి మా మనుమరాలు ఆ వెంట్రుకలు ఇటు పట్టుకుని, అటు పట్టుకుని తెగ కష్టపడుతూ ఉండింది. ఆ కోచ్ కూడా, దీని వెంట్రుకలను తప్పించుకుంటూ కష్టపడుతూ ఆ బెల్ట్ కట్టాడు. ఆ వీడియో చూస్తుంటే, దానికి బ్లాక్ బెల్ట్ వచ్చిన సంబరం కాస్తా చిరాకుగా మారింది నాకు. “ఒక పోనీ అయినా వేసుండొచ్చు కదే! ఆ జుట్టు అలా వదిలేసి, ఎందుకా కష్టం?” అని కోప్పడ్డాను మా అమ్మాయిని. అప్పుడు తను, “అమ్మా అది నీకూ, నాకూ కష్టం. దానికి ఇష్టం. ఇష్టమైనది, కష్టమెలా,” అన్నది. 
ఇంక ఏమనగలం? అది నిజమే కానీ…, జడ అనేది ఎంత అందమైన కళ. మామూలు మూడు పాయల జడే కాకుండా ఎన్ని రకాల జడలు ఉన్నాయి. మా అమ్మమ్మలూ , నాన్నమ్మలూ, ఎన్నో రకాల జడలు వేసేవారు. మేము కూడా ఎన్నో రకాల జడలు వేసుకున్నాము. మూడు పాయల జడ, నాలుగు పాయల జడ, ఎల్లిపాయల జడ, ఫ్రెంఛ్ జడ, ఇలా ఎన్నోరకాలు వేసుకునే వాళ్ళము. మళ్ళీ ఆ జడలను అలంకరిస్తూ, పూల జడ, ముత్యాల జడ, గాజుల జడ, అలా ఎన్నో ఎన్నో.  కొప్పులు కూడా ఎన్నో రకాలు వేసేవాళ్ళు. అంతే కాదు, అమ్మాయిలకు బంగారు జడ గంటలు చేయించటం ఒక ఘనత గా ఉండేది చాలామందికి. హుమ్… ఇప్పుడు ఆ జడలూ లేవు. కొప్పులూ లేవు. 
అకటా! అసలు జడలే లేకపోతే, ఆ కళ ఏమైపోవాలి. అది అంతమైపోవాల్సిందేనా! జడలు చూసి ప్రేమలో పడే కుర్రాళ్ళు ఏమైపోవాలి. ముద్దబంతి పూలు పెట్టి… ముదిమిరేకులు జడను చుట్టీ,  ఓ వాలు జడా, మల్లెపూల జడా, ఓ పాము జడా… లాంటి పాటలు రాసే కవులు ఏమైపోవాలి? 
నీదంతా పాత చింతకాయ పచ్చడి ఆలోచనలు అనూ! ఇప్పుడు అబ్బాయిలకి కూడా అలా వదిలేసిన జుట్టు గల అమ్మాయిలే ఇష్టం. కవుల గురించి కూడ నీకు బెంగ ఎందుకు? వాళ్లు కూడా ట్రెండ్స్ ప్రకారం, ఓ చిట్టి జుట్టూ, పొట్టిపొట్టి జుట్టూ, ఓ పెద్ద జుట్టూ, విరబోసిన జుట్టూ అని… రాస్తారులే.  నీకెందుకీ చింత? అని చెప్పింది నా మనసు. 
నిజమేలే, ట్రెండ్స్ ప్రకారం నడవాలిగా, అనుకుని నడుస్తుండగా, నన్ను దాటుకుని వెళ్ళిన ఒక మనిషి మీద, నా దృష్టి పడింది. ఆ మనిషిని చూసి అనుకున్నా… నువ్వు చింత పడనవసరం అస్సలు లేదు అనూ! జడలూ మాయమవలేదు, కొప్పులూ మాయమవలేదు. వాటి దిశ మార్చుకున్నాయి అంతే! అని నవ్వుకున్నాను. 
కాస్త పెద్ద గడ్డం, తలపై కొప్పూ, చెవుల మీదుగా వేలాడుతున్న రెండు జడలతో ఉన్న, ఒక యువకుడు నా పక్కగా నడుస్తూ వెళ్ళాడు.
కామెంట్‌లు