వాన వాన వల్లప్ప;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 పిల్లలకు వానలో ఆట్లాడ్డం అంటే మహా సరదా. చిటపట చినుకులలో ఎంతసేపైనా అలిసిపోకుండా చిందులేయగలరు ఈ అల్లరి వాళ్ళు.పిల్లల్ని వర్షానికి బయటకు పంపకుండా ఇంట్లోనే బందీగా చేసి, ఏదో కిటికీలో నుంచి, లేదా కాస్తంత తలుపు తెరిచి ఇదే వాన అంటూ చూపించండి చాలు అని నేనైతే చెప్పను ఎందుకంటే ఏదైనా అనుభూతి చెందితేనే తెలుస్తుంది. ఆధునిక పొకడలలో పడి ప్రకృతిని, వాతావరణాన్ని అసలు ఆస్వాదించడమే మరిచిపోతున్నాం, ఋతువులలోని ఆనందాన్ని పొందలేకపోతున్నాం. 
తల్లిదండ్రులు పిల్లల విషయంలో జాగ్రత్త వహిస్తారు అందుకే వారిని వర్షంలో తడవనివ్వకుండా ఆంక్షలు పెడుతుంటారు అది మంచిదే ఎందుకంటే పిల్లలు ఎక్కువ సేపు వానలో తడవడం వల్ల
నిమ్ము, దగ్గు, జలుబు జ్వరాలు అంటుకుంటాయి.
దాంతో ఓ వారం రోజులు పాటు బడికి వెళ్లలేరు, అంతేనా జ్వరంలో తిండి సరిగ్గా తినరు దాంతో మరింత బలహీనంగా తయారవుతారు ఈ చంటి పిల్లలు. అందుకోసమని వారి శరీరానికి
వర్షం, ఎండ, మంచు తగలకుండా పెంచితే ఎలా చెప్పండి. మన ప్రకృతి ఇచ్చిన వరాలను ఆస్వాదిస్తేనే వారి
మనసులు కూడా పరిమళిస్తాయి కనుక ఈ పసిమొగ్గలను కాస్తంత చినుకులలో తడవనివ్వండి,
వెన్నెల లాంటి ఆ చిరునవ్వులను విరబోయనివ్వండి. ఎక్కువ సమయం అయితే కష్టమే కానీ కాస్తంత తడిస్తే మరి శరీరానికి వచ్చి పడే ఇబ్బంది ఏమీ లేదు. ఇక కాస్త జలుబు దగ్గు అంటారా పిల్లలకు ఇమ్మునిటీ సాధారణంగా తక్కువగా ఉంటుంది కాబట్టి వాతావరణంలో మార్పులకు సులభంగానే ఎఫెక్ట్ అవుతారు.
కనుక పసివాళ్ళు ఉన్న ప్రతి ఇంట్లో ముందు జాగ్రత్తగా పారాసెటమాల్ సిరప్, కాఫ్ సిరప్ లు ఉంచడం చాలా మంచిది, ఉండాలి కూడా. అలాగేనా....

కామెంట్‌లు