వసుధారాణి గారు ప్రకృతి ఆరాధ్యులు.ఆమె రాసిన దేవ కాంచనం నీడన నేను చదవలేదు.బహుశా అది చాలా బాగుంటుదనే అనుకుంటున్నాను.ఈ మధ్య కాలంలో నేను గురువు గారు వేదాంత సూరి గారి ఇంటికి వెళ్ళాను.ఆయన లైబ్రరీ చాలా పెద్దదిగా ఉంటుంది.ఆయన దగ్గరకు వెసమీక్ష ళ్ళినప్పుడల్లా ఏదో పుస్తకం నాకు ఇచ్చి చదవమని చెపుతారు.వీలైతే ఆ పుస్తకం గురించి సమీక్ష రాయమని ప్రోత్సహిస్తూ ఉంటారు.
అలా ఆయన చాలా పుస్తకాలు ఇచ్చారు కానీ, నేను కొన్ని పుస్తకాలకు మాత్రమే సమీక్ష రాయగలిగే అవకాశం కలిగింది.
అందులోనిదే నది వెంట నేను... అద్భుతమైన పోయెట్రీ.అన్నీ కూడా మినీలు అంటే మినీ కవితలు.చాలా తక్కువ లైన్లలో ఎక్కువ హృదయావిష్కరణ,అనేది ఈ పుస్తక పరమార్థం.
శూన్యం... జీవితం అంతా శూన్యం దాన్ని కొలవడం సాద్యమవుతుందా... భారాన్ని అయితే ఎంతో కొంత తూచవచ్చు శూన్యాన్ని ఎలా కోలుస్తాం..
ఎంత గొప్ప వ్యక్తీకరణ.ఆకాశం మనల్ని తల ఎత్తుకునేలా చేస్తుంది.అలాంటి ఆకాశంతో స్నేహం చేయాలంటే తలదించుకోకుండా ఉండగలగాలి.ఆశ, నిరాశ, దుఃఖం, ద్వేషం, మోహం, స్నేహితులు, సంబరాలు...ఇలా ఎక్కడెక్కడో నన్ను నేను ఒలకబోసుకుంటాను.... నిన్ను చేరడానికి ఒలికిన అన్ని చోట్ల నుండి నన్ను నేను కూడగట్టుకుంటున్నాను.
ఉషోదయం రోజూ పిలవకుండానే చీకట్లను చీల్చుకుంటూ వచ్చేస్తూనే ఉంటుంది.భానుడి
కిరణాలు మన ద్వారాలను చీల్చుకుంటూ చీకటిని పారద్రోలుతాయి.ఇంటి ముందున్న వేప చెట్టుపై ఒక కోయిల తన గొంతులో అందమైన రాగం ఆలపిస్తుంది.
క్రితం రాత్రి కురిసిన వర్షానికి నిలిచిపోయిన నీళ్ళల్లో పిచ్చుకలు సేద తీర్చుకుంటున్నాయి.ఒక ఇంట్లో ఆకలి నిద్ర లేస్తుంది,కడుపులో కుక్కర్లు శబ్దాలు చేస్తుంటాయి,మరో ఇంట్లో పసి పిల్లల ఏడుపులు,ఇంకొక ఇంట్లో ఘుమఘుమలాడే ఫిల్టర్ కాఫీ వాసనలు,తమ కుటుంబాన్ని వదిలి వేకువజామునే రోడ్లను ప్రక్షాళన చేసే పారిశుద్ధ్య కార్మికులు.. పొద్దున్నే కూరగాయల బండీల హడావుడిలు.ఇవన్నీ పక్కన పెడితే అందమైన ప్రకృతి
సూర్యోదయానికి ముందు.. అప్పుడప్పుడు కురిసే మంచు మన చేతులకు తాకుతుంటే చెప్పలేని అనుభూతికి భాష ఉండదు.చీకటి వెలుతురు చేసుకునే యుద్ధంలో వెలుతురు విజయం సాధించానన్న ఉత్సాహం ఆ రోజంతా నిన్ను ఒక వినూత్న రీతిలో ఆవిష్కరిస్తుంది.ఉషోదయమనే పాజిటివ్ వైబ్స్ నీ ఆలోచనా సరళిని మార్చేస్తుంది.అందుకే వసుదారాణి గారు తాను తొలి పొద్దు లోనే ఉండిపోతాను అంటారు.
జీవితం మనం ఒకలా ఊహించుకుంటాం కానీ అది జరగదు.అది ఊహించని మలుపులు తిరుగుతుంది.కల ఒక్కటే మనల్ని ధనవంతులను చేస్తుంది, ఆకాశంలో విహరింపజేస్తుంది.వాస్తవంలో జరగనివన్నీ మనతో చేయిస్తుంది.ఊహించుకోవడమే కల.. స్వప్నం...అది ఎప్పుడూ ఒక హైట్ లోనే ఉంటుంది.నిత్యం కలలు కనే
సమయంలో చల్లని గాలి చంపకు తగిలినప్పుడో,వాన చినుకు ఒకటి కంటిపై రాలినపుడో కలలో నుంచి మనం ఇలలోకి రాక తప్పదు.అందుకే మొదటగా రాలిన ప్రతి నీటి చుక్క తొలిప్రేమను చిగురింపజేస్తుంది.అరికాళ్ళ వరకూ విద్యుత్తుని ప్రసరింపజేస్తుంది.భూమి నుంచి మస్తిష్కానికి ఏదో సందేశం వేగంగా చేరుతుంది.అప్పుడనుకుంటాం పూతేనను అద్దుకుని పూరేకు నుంచి జారుతూ, నేలను ముద్దాడడానికి ఆ మంచు బిందువు ఎంత దూరం ప్రయాణం చేసిందో, ఏమేమి సంయోజనాలతో,ఏర్పడిందో...ఎంత చక్కని భావం.
నవమి చంద్రుని తరువాత ఆకాశం బోసిపోయింది.ఒక్కసారిగా వెన్నెలపై విరహం నన్ను ముసిరింది.కాసేపటికి చుక్కల మిణుకులు మిక్కుటమై
ఆకాశాన్ని అందంగా సదిరేసాయి... ఆకాశం బాగుంది కానీ ఎన్ని చుక్కలైతే ఓ చంద్రుడయ్యోను.. అమావాస్య ను ఎంత అద్భుతంగా వర్ణించారు వసుదారాణి గారు.
మరొకచోట నది కార్తీక స్నానం చేసి,సూర్య దీపాన్ని నీటిలో వదిలిందంటారు.ఏకాంతం గురించి ఎంత బాగా చెప్పారంటే ఏకాంతంగా అంటే నువ్వు నేనేగా,ఇరువురం ఒకరి మదిలో మరొకరం అనీ.ముఖద్వారంలో అతని ప్రేమలేఖను అలాగే వుంచి
వంటింట్లో రోజుని వెలిగించిందట.. ఉత్తరం విప్పి చదవడం కుదరలేదట...ఆ తరువాత ఎప్పుడో జ్ఞాపకం వచ్చి ఆ గులాబీ లేఖ కోసం పరుగున వెళ్ళా...ఆ సింధూర లేఖ పడమట కొండ దిగిపోతూ కనిపించింది.
సాయం సంధ్య నిరాశ నీడలు చుట్టూ అలుముకున్నాయి.అలాగే వానను రచయిత్రి ఎంతగా
ఆస్వాదిస్తుందంటే లయబద్ధంగా కురిసే చినుకులను
అదో అద్భుత స్తోత్రంగా అభివర్ణించారు.
వసంతం రావడంతో ప్రకృతిలో మార్పులను గమనిస్తాం కానీ, వసంతం తన మెత్తని పాదాలు పెరటి తోటలోకి ప్రవేశించగానే,కోయిల కూస్తుంది,మోడువారిన చెట్లు చిగురిస్తాయి, అన్నింటి కన్నా ముందు పెరటిలోనీ,నిద్ర గన్నేరు మేల్కొని పూస్తుంది.రంగురంగుల సీతాకోక చిలుకలు నీ ఆగమనాన్ని ఉత్సవంగా చేసుకుంటాయి.నేనూ ప్రకృతిని అయితే గాని, నీకు అంటే వసంతానికి స్వాగతం పలుకలేనేమో...అని వసంతం తో మాట్లాడుతూ అంటారు.ఉదయం తానొక లేత పచ్చిక బయలు,
కుందేటి మెత్తని నడక,అమాయకపు జింక.పొద్దు వెలుగెక్కే కొద్దీ అలుకను,ఆకలినీ,పెరిగే కోరికను,రాటుదేలే వెదురుకర్రను,అవుతానంటుంది.
సూర్యాస్తమయానికీ రాత్రి నిద్ర మడుగున దాగే మొసలినీ,నేనో శుష్క వేదాంతిని.. ఉదయం కళ్ళు విప్పగానే,నేనో మునికన్యను...అంటూ ముగిస్తారు.
విజయవాడ వాస్తవ్యురాలైన వసుధారాణి గారు,ముఖ పుస్తక పాఠకులకు సుపరిచితులు.2019 సంవత్సరంలో, 'కేవలం నువ్వే' అన్న కవితా సంకలనంతో, సాహితీ ప్రపంచానికి పరిచయం అయ్యారు.ఆ తరువాత 2020 సంవత్సరంలో,వేయి కవితల సంకలనం 'దేవకాంచనం నీడన'ను ప్రచురించారు.2021 సంవత్సరంలో, 'టోకెన్ నెంబర్ ఎనిమిది' అన్న పేరుతో,తమ అనుభవాలను హాస్య వ్యంగ్య, కవితల రూపంలో కథల పుస్తకాన్ని తీసుకువచ్చారు.ఆ తరువాత 2022 సంవత్సరంలో 'నది వెంట నేను' అనే కవితా సంకలనాన్ని వెలువరించారు.ఇలా ఆమె తన కవితా యాత్రను ఇంకా కొనసాగించాలనీ కోరుకుంటూ......

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి