కష్టం విలువ తెలుసుకో కన్నా.!;- ది‌ పెన్--చరవాణి: 9553955798.
 "అమ్మా..చెప్పులు అరిగిపోయి అస్తమానూ తెగిపోతున్నాయే..కొత్త చెప్పులు కొనుక్కుంటాను డబ్బులియ్యవా.! అంటున్న కొడుకుతో.."ఒరేయ్ నాయనా..మీ నాన్న నన్ను పెళ్లి చేసుకునే నాటికి మన ఊరిలో పాత ప్రెసిడెంట్ దగ్గర పశువుల కాపరిగా ఉండేవాడు.పాలేరుగా ఇంటిపని, పొలంపని, పశువుల కాపు అంటూ రాత్రీ పగలూ నిద్ర లేకుండా పనిచేసేవాడు.ఆరోజు ఆయన కాలికి చెప్పులేసుకోలేదు..నీ అక్కలు పుట్టాక వ్యాపారం మొదలెట్టాడు..సైకిల్ మీద రోజూ ఊరూరా తిరిగేవాడు..అప్పుడూ ఆయన కాళ్లకు చెప్పులు లేవు..కొంతకాలానికి నువ్ పుట్టావ్..ఆయన వ్యాపారంతో పాటు పొలాన్నీ చూసుకోవడం మొదలుపెట్టారు..రాత్రిళ్లు చేనుకు నీళ్లు పెట్టడానికి వెళ్లినప్పుడు కూడా చెప్పులు వేసుకోలేదు..రాళ్లు..ముళ్లు గుచ్చుకుంటాయని, విషపురుగులు కాటేస్తాయని భయమున్నా చెప్పులేసుకోలేదు. ఎందుకో తెలుసా..చెప్పులతో చేలో పనిచేయలేమని కాదు, సైకిల్ తొక్కలేక కాదు.. వాటిని కొనే డబ్బులను కూడా మిగిల్చి మీ కోసమే ఖర్చు చేశారు‌..అంత కష్టంలోనూ అది తన బాధ్యత అనుకున్నారురా మీ నాన్న..కన్నవాళ్లనో..పుట్టినవాళ్లనో..ఎవరినీ నిందించలేదు..తన కష్టానికి ఎప్పుడూ చింతించలేదు..ఇది మీ నాన్నకు వాళ్ల అమ్మానాన్నా నేర్పిన సంస్కారం.. అలవాటు చేసిన జీవన విధానం..మరి మా పిల్లల్ని కూడా అదే విధంగా కష్టం తెలిసిన వారిలా, ఎంతటి కష్టానైనా ఎదిరించి నిలబడేవారిగా పెంచాలి కదా..ఇప్పుడు నువ్ కొంచెం పెద్దవాడివయ్యావ్..చెప్పులు కావాలంటే నీ కష్టంతోనే నువ్ కొనుక్కోవాలి..అప్పుడే సరుకు విలువ, కష్టం విలువ తెలుసుకోగలుగుతావు..అదే డబ్బు నేనిస్తే..నువ్ జీవితాంతం ఎవరో ఒకరిపై ఆధారపడి బతకడానికి నేనే కారణమైనదాన్నవుతాను..నా పిల్లలను నేనలా చూడాలనుకోవడం లేదు..వెళ్లు..వెళ్లి ఏదో ఒక పని చేసి నీక్కావాల్సిన డబ్బులు సంపాదించి , నీకు నచ్చిన చెప్పులు కొనుక్కుని కళాశాలకు వెళ్లు..నువ్ వచ్చేసరికి నీకిష్టమైన పాయసం చేసి ఉంచుతాను." అని చెబుతోంది ఓ తల్లి.
"డాడీ..డాడీ..నాకు బైక్ కావాలి..కొంటారా లేదా.." అనే మాటలకు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు సంతోష్..ఏమైంది డాడీ..నేను చాలా సేపట్నుంచీ పిలుస్తున్నాను..పలకరేంటి..నేను చెప్పేది విన్నారా లేదా..ఏం ఆలోచిస్తున్నారు..అని‌ మరోసారి సందేహంగా అడిగాడు సంతోష్ ని అతని కొడుకు..ఏం లేదు కన్నా.. మీ నానమ్మ గుర్తొచ్చిందిలే అని కన్నీళ్లు కొడుక్కి కనపడకుండా తుడుచుకుని..అది సరే నువ్వేంటి కావాలంటున్నావ్..బైకా..నీ వయసెంతరా..నీ వయసుకి నాకసలు సైకిల్ కూడా లేదు తెలుసా..అని సంతోష్ అనగానే, డాడీ అవి మీ రోజులు..ఇప్పుడలా కాదు..నా ఫ్రెండ్స్ అందరికీ వాళ్ల డాడీ బైక్స్ కొనిచ్చారు..నాకే లేదు..నాకెంత అవమానంగా ఉంటుందో మీకేం తెలుసంటూ విసుగ్గా మాట్లాడుతున్నాడు సంతోష్ కొడుకు..
కొడుకుని దగ్గరకు తీసుకుని 'చూడు..కన్నా..మీ నాన్న ఇప్పుడున్న స్థితికి రావడానికి ఎంత కష్టపడ్డాడో నీకు తెలియదురా..కేవలం చెప్పులు కొనుక్కోవడానికి మూడు రోజులు తాపీపనికి వెళ్లానంటే నమ్ముతావా..ఆరోజు మా అమ్మ చెప్పిన మాటలు నేను జీవితంలో మరెవరి దగ్గరా, దేనికీ చేయిచాచి అడగకుండా చేశాయి..నా కాళ్లపై నన్ను నిలబెట్టాయి.నిన్ను మా నాన్నలా..నాలా అంత కష్టపడమని చెప్పడం లేదు..కానీ కష్టం విలువ మాత్రం నువ్ ఖచ్చితంగా తెలుసుకోవాలని చెబుతున్నాను..నీకు బైక్ నడిపే అర్హతను నువ్వే సంపాదించుకోవాలంటున్నాను.నువ్ అలా సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్న రోజు నా సాయం అన్నివిధాలుగా నీకు తప్పకుండా ఉంటుంది.కాలేజీ బస్ వచ్చే టైమ్ అయ్యింది..వెళ్లి అమ్మ చేసిన పాయసం తినేసి రెడీ అవ్వు..అంటూ వాస్తవాన్ని బోధిస్తూ కొడుక్కి నచ్చజెప్పాడు సంతోష్..
తండ్రి మాటలకు ఆలోచనలో‌ పడిన కుమారుడు ఆ రోజు నుంచీ కాలేజీ అయ్యాక స్నేహితులతో అనవసరంగా తిరగడం మానేసి, కంప్యూటర్ సెంటర్ లో పార్ట్ టైమ్ జాబ్ చేయాలని నిర్ణయించుకుని సంతోషంగా బస్ ఎక్కాడు..ఒరేయ్ పాయసం తినివెళ్లరా..అని పిలుస్తున్న అమ్మతో "సాయంత్రం వచ్చి తింటానమ్మా.!" అంటూ..అది విన్న సంతోష్ కి తాను కూలిపనికి వెళ్లొచ్చాకా తన చేతులకు, కాళ్లకు వేన్నీళ్లతో అమ్మ కాపడం పెడుతూ పాయసం‌ తినిపించిన రోజు గుర్తొచ్చి మరోసారి కళ్లల్లో నీళ్లు తిరిగాయి..తన పెంపకంపై పెంచుకున్న నమ్మకానికి కూడా అవి సాక్ష్యమయ్యాయి.!
#ఇదీ పెంపకం అంటే..ఇలా‌‌ ఎంతమంది తమ పిల్లల్ని పెంచుతున్నారో ఒక్కసారి నిజాయతీగా ఆలోచించండి. బాలల దినోత్సవం అంటే మనకు చాచా నెహ్రూ.. చాక్లెట్లే కాదు..మన తల్లిదండ్రులు మనల్ని ఎంత కష్టపడి పెంచారో కూడా గుర్తుకురావాలి..మనం ఎలా జీవించాలో తెలుసుకోవాలి.. తల్లీ చెల్లి తప్ప కనపడ్డ ప్రతి అమ్మాయినీ తప్పుగా చూడ్డం కాదు..ప్రతి ఆడదానిలోనూ అమ్మా,చెల్లి కనపడాలి.మనం ఈ రోజు బతికే బతుకే రేపటి మన పిల్లల భవిష్యత్తు అని ప్రతి ఒక్కరం గుర్తించాలి.ఆడ పిల్లల్ని జాగ్రత్తగా పెంచడం కాదు..మగ పిల్లల ప్రవర్తనను మార్చాలి.వాళ్లకి వావివరసలు నేర్పి, సమాజంలో స్త్రీలను గౌరవించేలా పెంచాలి..పెద్దలను పూజించడం..సాటి మనిషికి సాయపడటం..స్వశక్తితో పైకి ఎదగడం..దేశాన్ని..ఈ నేలతల్లిని ప్రేమించడం లాంటి మంచి లక్షణాలు తల్లిదండ్రుల పెంపకం నుంచే మొదలవ్వాలి..కన్నవారి కోసం..మాతృభూమి కోసం ప్రాణత్యాగానికైనా వెనుకాడని‌ వీరుల్లా  ప్రతి పౌరుడు ఎదగాలి..అదే నేటి బాలాల‌ దినోత్సవ పరమార్ధం..రేపటి సమసమాజ‌ స్థాపనకు సంకేతం.! జై హింద్.!!


కామెంట్‌లు