ఈ రోజు సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో వాకింగ్ మొదలుపెట్టాను. చల్లని గాలి వీస్తూ వాతావరణం హాయిగా ఉంది. కాసేపు కూర్చుందాం అనిపించి, ఒక బెంచి మీద చాలాసేపే కూర్చున్నాను. ఆ తరువాత నా నడక కొనసాగించాను. సమయం దాదాపు ఏడుగంటలవుతుంది. వెలుగులు తగ్గి, చీకటి పడిపోయింది. కమ్యునిటీలో అంతా లైట్లు వెలిగాయి. మంచి గాలి వీస్తూ ఉండటం వల్లేమో, దోమలూ కనిపించలేదు.
అలా చల్ల గాలిని ఆస్వాదిస్తూ, ఒక పది నిమిషాలు నడిచిన తరువాత, ఉత్తరం వైపు ర్యాంప్ ఎక్కడం మొదలుపెట్టా. అలా ఎక్కుతూ ఉండగానే, పైన కొంచెం దూరంలో, పవర్ జనరేటర్ గ్రిడ్స్ కి ముందు ఒక నలుగురైదుగురు ఆడవాళ్లు ముందుకి తొంగి చూస్తూ ఉండటం కనిపించింది. ఏం జరిగిందబ్బా? అనుకున్నా. వాళ్ళ వస్తువు ఏదైనా పడిపోయిందా? చేతి ఉంగరం, చెవి కమ్మ, లాటి బంగారు వస్తువేదైనా పడిపోయిందా? అబ్బో, బంగారం ధర అసలే మండిపోతుంది. చిన్న వస్తువు పోయినా ఎంత బాధో అనుకున్నా. అయినా, వస్తువు పోవటం అయ్యుండదు. ఎందుకంటే వాళ్లు వంగి కింద వెతకటం లేదు. ముందుకి తొంగి చూస్తున్నా.రు.
ఏంటో చూద్దాం అని, నేనూ కొంచెం గబగబా నడిచాను అక్కడికి. అక్కడ పవర్ గ్రిడ్స్ దగ్గర రెండు డోమ్స్ లాగా ఉన్నాయి. వాటిలో పెద్ద ఎక్సాస్ట్ ఫాన్స్ ఉంటాయి. ఆ రెండు డోమ్స్ మధ్యలో కొంత గ్యాప్ ఉంది. నలుగురు ఆడవాళ్లు దాని ముందు నిల్చుని, ఆ గ్యాప్ లోకి తొంగి చూస్తున్నారు.
“అదిగో, అదిగో, తోక కనపడుతుంది,” అని ఒకావిడ అంటుంది.
“చాలా చిన్నది,” అని మరొకావిడ అంటుంది.
“రెండో, మూడో ఉన్నట్టున్నాయిగా,” అంటుంది మరొకావిడ.
అక్కడ చీకటిగా ఉంది. నాకేమీ కనిపించలేదు. ‘ఏంటండీ?’ అని నేను వాళ్ళని అడిగాను. కానీ, వాళ్లు వినిపించుకోలేదు నా మాట.
“ఎప్పుడూ చూడలేదు ఇక్కడ!”; “అవును నిజమే!” అంటూ వాళ్లలో వాళ్లే మాట్లాడుకుంటున్నారు.
సరే, వీళ్లేమీ వినిపించుకోవటం లేదు. ఏదోలే, నాకెందుకు? అనుకుంటూ ముందుకి నడిచాను. అయినా మనసు ఊరుకోదు కదా! దానికి కుతూహలం ఎక్కువ.
అయితే, అంత దీక్షగా ఏం చూస్తున్నారబ్బా వీళ్ళు? పామేమయినా కనపడిందా? అబ్బే పామయితే అంత ధైర్యంగా చూస్తారా వీళ్ళు? మరి, తోక అనీ, చాలా చిన్నదనీ, అంటున్నారు కదా! చిన్న పిల్ల కనుక భయపడకుండా చూస్తున్నారేమో!
అబ్బే, చిన్నదైనా, పెద్దదైనా, పాము పామే కదా!, అంత భయం లేకుండా ఎలా ఉంటారు?
ఏంటో, ఎంత సెక్యూరిటీ ఉండీ ఏం లాభం. మనుషుల సెక్యూరిటీ, మనుషుల నుంచే కానీ, ఈ పాముల నుంచి కాదు కదా. కమ్యునిటీ అంతా రాక్స్ ఉంటాయి, చెట్లుంటాయి. పాములు రాక మానుతాయా! ఇప్పటికే నాలుగయిదు సార్లు విన్నాము ఈ కమ్యునిటీలో పాములొచ్చాయని. పిల్లలు తిరుగుతుంటారు! గ్రౌండ్ ఫ్లోరు వాళ్లు మరీ భయపడతారు, ఏదైనా ఇలాటి వార్త విన్నప్పుడు.
అందుకే మరి, ఈ పురుగూ, పుట్రా భయాలు ఉండవనే, జనాలు పై ఫ్లోర్లలో ఫ్లాట్లు తీసుకోవాలని చూస్తారు. దాని ప్రకారమే, ఆ బిల్డర్లు కూడా పై ఫ్లోర్లు ఎక్కువ ఖరీదు చెప్తారు. ఆ భలే చెప్తావులే అనూ, పైన ఫ్లోర్లు అన్న మాటే కానీ, ఆ మధ్య ఇరవయ్యో ఫ్లోర్ వాళ్లు కూడా ఎలుకలు వచ్చాయని అనలేదా, దోమలు వచ్చాయని అనలేదా! అన్నీ మిస్ కన్సెప్షన్స్.
అలా అనుకుంటూ, ప్లే గ్రౌండు దాకా నడిచిన దాన్ని, కుతూహలం ఆపుకోలేక మళ్లీ వనక్కి నడిచాను. ఇంతలో ఆ నలుగురూ వెనక్కి తిరిగి గలగలా మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు.
“ఏంటండీ, ఏమయిందీ? ఏదో చూస్తున్నట్టున్నారు? అని మళ్లీ వాళ్ళని ఆసక్తిగా అడిగాను.
“పిల్లి పిల్లలు అండీ, నిన్ననే పుట్టినట్టున్నాయి, భలే ముద్దుగా ఉన్నాయి, అంది ఒకావిడ మురిపెంగా.
“మా చెల్లి, ఇంత వయసొచ్చినా, పిల్లులను చూడగానే చిన్నపిల్ల అయిపోతదండీ, అంది మరొకావిడ.
“అందులో ఒకటీ రెండూ కాదు, ఐదు ఉన్నాయి,” అంది మరొకావిడ.
“రెండు నలుపూ, రెండు తెలుపూ, ఒకటి గోధుమరంగు ఉన్నట్టుంది,” అని ఒకావిడ అంటే,
“కాదు గోధుమరంగువే రెండు ఉన్నట్టున్నాయి,,” అని మొదటావిడ అంటూ ఉండగా,
“సర్లే రేప్పొద్దున వచ్చి చూద్దాం, ఏవి ఎన్నో!” అనుకుంటూ, అందరూ నవ్వుకుంటూ వెళ్ళారు అందరూ.
అయ్యబాబోయి, What a misconception! అసలిక్కడేమయిందో తెలుసుకోకుండానే, నా ఆలోచనలు ఎక్కడెక్కడికో వెళ్లిపోయాయి. పాముల నుంచి, బిల్డర్స్ దాకా! భయాల నుంచి conceptions దాకా.
బాగుంది సంబడం, అదిగో పులి అంటే, ఇదిగో తోక అన్నారట వెనకటికెవరో! అని నవ్వుకుంటూ నేనూ ఇంటి దారి పట్టాను.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి