తెలుగు సొగసు ; తుమ్మూరి రామ్మోహన్ రావు
తాతయ్యా తాతయ్యా
తెలుగు భాష నేర్పవా
అమ్మమ్మా నానమ్మా 
తెలుగు  కథలు చెప్పరా

తేనెకంటె తీయనైన
తెలుగు భాషమనదనీ
కమ్మనైన అమ్మభాష
కన్నతల్లి వంటిదనీ

అందరూ అంటుంటే
వింటున్నామూ
మన భాషతీపి రుచిని మాకు
తెలియజెప్పరా

పల్లె ప్రజల జానపదం
మేటి కవుల మనపద్యం
పదకవితా పితామహుల
భక్తి గీత తోరణం

ఆటలుగా పాటలుగా
మాకు నేర్పుతారా
తెలుగుభాష మాతరాని
కందిస్తారా

నన్నయ తిక్కన ఎఱ్ఱన
భారత పద్యాలూ
బమ్మెర పోతన రాసిన
భాగవతం పద్యాలు

కవులెందరొ విరచించిన 
రామాయణ కావ్యాలూ
వేమన కృష్ణా సుమతీ
 నారసింహశతకాలూ

పిల్లల పెద్దల కథలూ
ఎన్నెన్నో ఉన్నాయట
అన్నీ నేర్పించి మాకు
తెలుగు సొగసు చూపరా

మన భాష మనసంస్కృతి
మరుగున పడిపోవద్దు
తరతరాలకైనా మన 
తెలుగు మాసిపోవద్దు

కామెంట్‌లు