సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 దర్శించు...దర్షించు
   *****
ప్రతి రోజూ సూర్యోదయం ఓ అద్భుతమైన దృశ్యం.సూర్యాస్తమయం ఓ వింతైన వేడుక. ప్రకృతి సౌందర్యం మనకు సృష్టి ఇచ్చిన అపూర్వమైన కానుక.
అందుకే నిరాశా,నిస్పృహలను తొలగగించుకోవాలని అనుకుంటే...నిత్యం  మన హడావిడి ప్రపంచాన్ని వీడి ఒక్కసారైనా వీటిని దర్శించాలి.
ఎంతటి  వేదనలు సంవేదనలు ఉన్నా దూదిపింజలా తేలిపోతాయి, మనలో పునరుత్తేజాన్ని కలిగిస్తాయి.
దర్శించు అంటే కేవలం పంచేంద్రియాలలోని నేత్రాలతో కాదు మనో నేత్రంతో అవలోకించాలి.
దర్శించు అంటే ఏమిటో అర్థమైంది కదా! దర్శించు అంటే చూచు,అభివీక్షించు,అవలోకించు,ఆలోకించు,కాంచు,ఈక్షించు,వీక్షించు,పరికించు,తిలకించు,విలోకించు,దృష్టించు,సందర్శించు లాంటి అర్థాలు ఉన్నాయి.
మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలు  ఉన్నాయి. ఆ ఏముందిలే అని కొందరు వాటిని చూడటానికి పెద్దగా ఇష్టపడరు. అందులో ఏముందంటూ  పెదవి విరుపులతో దర్షిస్తుంటారు.అదిగో అలాంటి వారినే రసజ్ఞత,కళా హృదయం లేని వారు అంటుంటారు.
అవే కాకుండా తా పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్లు ప్రవర్తిస్తారు.ఏ మంచి మాటలు, సూచనలు సలహాలు తలకెక్కించుకోకుండా తృణీకరిస్తూ ఉంటారు.
ఆత్మాభిమానానికి హాని కలిగించే వాటిని, గౌరవాన్ని భంగం కలిగించే వాటిని తప్పకుండా దర్షించాలి.
దర్షించు అంటే ఏమిటో చూద్దాం ..తిరస్కరించు,తూలగించు,ధిక్కరించు,నిరసించు,నిరాకరించు,త్రోసివేయు,తృణీకరించు,ఛీత్కరించు,తెగడు అనే అర్థాలు ఉన్నాయి.
 ఎవరేమీ చెప్పినా  వాటిల్లో మంచి చెడులను మనో నేత్రంతో దర్శించుదాం.
చెరుపు చేసేవి ఏమైనా ఉంటే ,నిర్మొహమాటంగా వాటిని దర్షించుదాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు