ఆస్వాదించే మనసు
ఉండాలే కానీ....
ప్రతి పున్నమి ఒక పండుగే
వెయ్యి పున్నములకు
సరిపాటి కార్తీక పౌర్ణమి...!!
చంద్రుడు ఒక మాయగాడు
ఒక్కోసారి ఒక్కోలా ...
ఒక్కొక్కరికి ఒక్కోలా ....
కనిపిస్తాడు... ఋలిపిస్తాడు
బుజ్జగిస్తాడు....!!
పెద్ద తెర ,చిన్నతెర
పొరలు పొరలుగా మన కళ్ళని
గాంధారి గంతల్లా
చుట్టేసుకోకముందు
వెన్నెలే జగం....!!
పున్నముల చుట్టూ
పండగల్ని సృష్టించుకొని
పండు వెన్నెల్ని
నిండుగా ఆస్వాదించే వాళ్ళం...!
కానీ నేటి తరం
చంద్రుడి ఉనికినే
పట్టించు కొన్నంతంగా
బతుకు సంద్రంలో మునకలేస్తూ
నియాన్ కాంతుల్ని నిజాలని భ్రమిస్తూ
మిణుగురుల్నే
దివిటీలని తలుస్తూంటే......
అందాల చందమామను
రాహుకేతువులే కాదు.......
కాటేస్తుంది కాలుష్యం కూడా...!!
చంద్రుడు
మన ముత్తాతలకు
కనిపించినంత స్పష్టంగా
మన తాతలకు కనిపించలేదు.....
మన తాతలకు
కనిపించినంత తేజోవంతంగా
మన నాన్నలకూ,
మనకు కనిపించలేదు....!!
ఆ మేరకు మసకబారిపోయాయి
వెన్నెల కాంతులు...!!
ఇదే నిర్లక్ష్యం
ఇంకొంత కాలం కొనసాగితే
చంద్రుడంటే
ఓ స్పష్టస్పట ఆకారమనీ......
వెన్నెలంటే
చీకటి లాంటి చల్లదనమేనని
చదువుకోవాల్సి వస్తుందేమో !!
అనగనగా కథలకు
స్ఫూర్తి నిచ్చే మామయ్య....
ఓ అనగనగా కథలా
మిగిలిపోతాడేమో !!
అంతరించిపోతున్న జీవుల్లా ...
అంతరించిపోతున్న అడువుల్లా ....
వెన్నెల కూడా అంతరించిపోతున్న
అనూభూతేనేమో ...
"కార్తీక పౌర్ణమి సాక్షిగా "
కొత్త ఉద్యమం ప్రారంభించాలి
" సెవ్ మూన్"...!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి